కాకుల దాడులకు చెక్ పెట్టడానికి గద్దను పెంచుతున్నాడు!

పిల్ల‌ల జోలికి వెళితే కుక్క‌లే కాదు, ప‌క్షులూ దాడిచేస్తాయి. కానీ కాలిఫోర్నియా లాస్ ఏంజెల‌స్ కౌంటీ పార్కులోకి ఎవ‌రు వెళ్లినా అక్క‌డి రెండు కాకులు అమాంతం మనుషులపై దాడి చేసి చీకాకు పరుస్తున్నాయి.  దీంతో అక్క‌డి బీచ్‌కి ద‌గ్గ‌ర‌లోని నోబెల్ పార్క్ అనే హోట‌ల్ య‌జ‌మాని చాలా న‌ష్ట‌పోతున్నాడ‌ట‌!  సాయంత్రాలు స‌ర‌దాగా గ‌డ‌ప‌డానికి బీచ్‌కి  వెళ్ల‌డం వైజాగ్‌లో లా ప్ర‌పంచంలో ఎక్క‌డ‌యినా స‌ముద్ర తీరం వున్న ప‌ట్ట‌ణాల‌ వారికి అలవాటు. కొంత‌సేపు ఆట‌ పాట‌లతో గ‌డిపి రావాల‌ని అనుకుంటారు. స‌హజంగా అక్క‌డ కుక్క‌ పిల్ల‌లు ఏదో ఒక కాయ‌ కోస‌మో, పండు కోస‌మో వెంట‌ బ‌డ‌టం మామూలే. కానీ ఏకంగా కాకుల దాడి మాత్రం వింతే!  కాకుల‌కు జ‌నాల్ని గుర్తు పెట్టుకునే శ‌క్తి వుంటుందిట‌. ఎవ‌ర‌యినా ఏద‌న్నా తింటూ, కుక్క‌ల్ని ప‌ట్టుకుని అలా షికారుగా  వెళుతుంటే కాలిఫోర్నియాలో  మాత్రం అమాంతం  చెట్ల మీంచి  విమాన వేగంతో వ‌చ్చి రెక్క‌ల‌తోనో, ముక్కుతోనో ఒక్క‌టి కొట్టి అంతే వేగంతో పోతున్నాయి.  ఈ  కాకుల దాడి కూడా మే, జూన్ మాసాల్లోనే ఎక్కువ‌గా వుంటుంది. కార‌ణం ఆ  మాసాల్లో అవి గుడ్లు పెడ‌తాయి. ఆ స‌మ‌యంలో అవి మ‌రింత జాగ్ర‌త్త‌గా  వుండాల‌న్న ధోర‌ణితో ఎక్కువ దాడులు చేస్తున్నా యిట‌.  కానీ  మ‌రీ ఆస్ప‌త్రికి వెళ్లాల్సినంత గాయాలు కావ‌డం లేద‌ని బీచ్ పోలీసులు అంటున్నారు. ఏమ‌యినా దాడి దాడే, కుక్క‌యినా, కాక‌యినా!  వాటి ధాటికి భ‌య‌ప‌డి చాలామంది ఆ బీచ్‌వేపు వెళ్ల‌డం లేద‌ట‌. అలా ప‌ర్యాట‌కుల శాతం త‌గ్గిపోయింద‌ని అక్క‌డి హోటల్ య‌జ‌మాని తెగ బాధ‌ప‌డుతున్నాడు. ఎందుకంటే న‌లుగురూ   వ‌స్తేనేగా త‌న ద‌గ్గ‌ర సమోసాలో, మిర్చిబ‌జ్జీలో అమ్ముడ‌య్యేది!  ఇలా అంద‌ర్నీ దూరం చేసుకోవ‌డం ఇష్టంలేక ఆయ‌న ఒక చిత్ర‌మైన ఆలోచ‌న చేసేడు. అదేమంటే  కాకుల్ని అక్క‌డి నుంచి పారిపోయేలా చేయ‌డానికి ఆయ‌న త‌న డ‌బ్బుల‌తో ఒక డేగ‌ను పెంచుతున్నాడ‌ట‌. నాలుగు డ‌బ్బులు వ‌చ్చే ఆలోచ‌న చేయ‌మంటే వచ్చేదానిలో రెండు రూపాయ‌లు పోయేలా చేసుకుంటున్నాడు. కానీ త‌ప్ప‌డం లేదు మ‌రి!

సెల్ఫ్ గోల్‌కి మ‌రో పేరు వైసీపీ!

ఎన్ని చేసినా పోలింగ్ శాతం (64.17) గణనీయంగా తగ్గింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల  కన్నా ప్రస్తుత ఉప ఎన్నికలో ఓట్లు పెరిగినా, పోలింగ్ శాతం మాత్రం తగ్గడం తో నేతల్లో గుబులు మొదలైంది. ఓటరిచ్చే తీర్పు ప్రధాన భూమికను  పోషించనుండటంతో  నేతలు విశ్లే షణలలో తలమునకలై ఉన్నారు. ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం కోల్పోయిన త‌ర్వాత ఏమి చేసినా ప్ర‌యోజ‌నం శూన్యం. ఇపుడు పిల్ల‌ల‌కి క‌ధ‌లు చెప్పి తినిపించిన‌ట్లు బ‌తిమాలుకోవాలి. కానీ ఓట‌ర్లు మ‌రీ పాలుతాగే, పాలు అన్నం తినే అమాయ‌త్వంలో లేరు.  పాల‌కుల‌కంటే తెలివిగ‌ల‌వారు, ఓట్లు ఎవ‌రికి వేయాలి, తాము ఇప్ప‌టివ‌ర‌కూ ఏమి కోల్పోయామ‌న్న‌ది పాల‌కుల‌కంటే బాగా ఎరిగిన‌వారే! ఇపుడు వైసీపీ వ‌ర్గీయులే ఓట‌ర్ల కాళ్లు ప‌ట్టుకోవాల్సిన పాత్ర గ‌ట్టిగా పోషించాలి.   ఆత్మకూరు నియోజకవర్గంలో 2,13,338 మంది ఓటర్లు ఉండగా 1,37,038 మంది తమ ఓటు హక్కు వినియో గించుకున్నారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్డ్డి సొంత మండలమైన మర్రిపాడులో 59.8 శాతం, వైసీపీకి గట్టి పట్టున్న అనంతసాగరం మండలంలో సైతం 64.63 శాతం ఓట్లు పోలుకావడం నేతలను కలవర పాటుకు గురి చేస్తోంది. ఇక ఆత్మకూరు మండలంలో 63.69 శాతం, ఏఎస్పేటలో 62.8 శాతం, సంగంలోజర్ల లో 67.9 శాతం మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తమ్మీద ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనే అంశాల పై అధికార పార్టీనేతల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. కానీ యుద్ధానంత‌రం గాయాల‌తో చ‌ర్చించుకో వ‌డం వ‌ల్ల  ప్ర‌యోజ‌న‌మేమిటి?  ఇక వున్న‌న్నాళ్ల‌యినా బుద్ధిగా అంద‌రితో క‌నీసం న‌వ్వు మొహంతో క‌న‌ప‌డుతూ కాలం గ‌డిపేయ‌డ‌మే మేలు!

ఆత్మకూరు బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు జరిగాయి. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధర్ బాబు సూచించారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూక్ష్మ పరిశీలకులు, సుపర్ వైజర్లు, అసిస్టెంట్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో చక్రధర్ బాబు  మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో బ్యాలెట్ ఓట్లు, వీవీ పాట్స్, ఈవీఎంల లెక్కింపుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకొని బాధ్యతగా,పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలౌతుందని, ఉదయం 6 గంటలకే  కౌంటింగ్ సుపర్ వైజర్లు, అసిస్టెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపులో  ఏదైనా సమస్య వస్తే.. వెంటనే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల సంఖ్య సరిపోవాలని, ఓటర్లకు సంబంధించి 17ఏ ను 17సీతో లెక్కింపు సిబ్బంది తప్పని సరిగా సరిచూసుకోవాలని ఆదేశించారు.

అయ్యన్నపాత్రుడు.. విజయసాయి ట్విట్టర్ వార్

తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ విధానాలను విమర్శించడంలోనూ, జగన్, విజయసాయి దుర్మార్గాలను ఎండగట్టడంలోనూ అందరి కంటే ముందు వరుసలో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే అధికార పార్టీ ఎప్పుడు అవకాశం దొరికినా అయ్యన్న పాత్రుడిపై విమర్శల దాడులకు రెడీగా ఉంటారు. ప్రభుత్వమైతే ఏదో విధంగా ఆయనను ఇరుకున పెట్టి కటకటాల వెనక్కు పంపించే యత్నాలను, మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి ఆస్తులపై అధికారులతో దాడులను చేయిస్తుంటుంది. సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్లర్ వేదికగా అనుచిత పదజాలంతో అయ్యన్న పాత్రుడిని రెచ్చగొట్టే యత్నాలు చేస్తూనే ఉంటారు. పులి, పిల్లి అంటే విజయసాయి తాజాగా చేసిన ట్వీట్ కు అయ్యన్న పాత్రుడు అదే స్టైల్ లో అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి.. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఈ ఉదయం ట్విట్టర్ లో పెట్టిన పోస్టుపై అయ్యన్నపాత్రుడు ఆయనకు దిమ్మతిరిగే  కౌంటర్ ఇచ్చారు. 16 నెలలు చిప్పకూడు తినడం వలన చర్మం మందమైంది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయి రెడ్డి పులిగా ఫీల్ అవుతున్నాడు.   బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ. అన్నట్లు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’ అంటూ అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు.. ‘పిల్లి తనను ఎవరు వేటాడతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. కానీ పులి కన్నా గొప్పదాన్నని తనకు తానే అనుకుంటుంది. నేను నర్సీపట్నం వస్తా. డేట్, టైం చెప్పు తాగుబోతు. అయినా నువ్వు అజ్ఞాతంలోకి పోయావట కదా! పారిపోకుండా నిలబడు గంజాయి’ అంటూ అయ్యన్న పాత్రుడిపై ట్విట్టర్ ఖాతాలో విజయసాయి వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్లయింది. అర్థరాత్రి అధికారులు మందీ మార్బలంతో నివాసాలు కూల్చడానికి రావడం వెనుక ఉన్న మర్మమేమిటో వీరిరువురి ట్వీట్ వార్ తో జనానికి దాదాపుగా అర్ధమైపోయింది. కోర్టు కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఎవరు రుజువర్తనతో ఉన్నారు, ఎవరు అవకాశవాదంతో ముందు వెనుకలాడుతున్నారన్నదీ తేటతెల్లమైపోయింది. 

రామగోపాల వర్మకు తిక్కే కిక్కు.. ఎవరికీ అర్ధం కాడు!

వీడు మ‌న‌కు ఛ‌స్తే అర్ధంగాడు.. అనే మాట రోజులో ఒక‌సారి ఎవ‌రో ఒక‌రు ఎవ‌రి గురించో అంటూండ‌టం వింటూంటాం. ఆ వీడు అనే వ్య‌క్తి నిజంగానే లెక్క‌లేనంత తిక్క‌వాడ‌య్యే వుంటాడు. ఇలాంటి త‌లతిక్క మ‌నుషుల‌తో వేగ‌డ‌మూ క‌ష్ట‌మే. వీళ్ల  కోవ‌కి చెందిన‌వాడే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌!  జార్జ్ రెడ్డి జీవితానికి కాస్తంత ద‌గ్గ‌ర‌గా శివ అనే సినిమాతో టాలీవుడ్‌లో చిన్న‌పాటి సంచ‌ల‌నం సృష్టించిన‌పుడు వీడెవ‌డో మ‌గాడే వ‌చ్చాడ్రా అనుకున్నారు. ఏకంగా అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి సీనియ‌ర్ న‌టుడితో స‌ర్కార్ తీసి ఔరా అనిపించాడు. తిరిగి తెలుగు నేల‌కి చేరి త‌న విచిత్ర‌మైన స్ట‌యిల్లో తోచిన‌ట్టు కామెంట్లు చేస్తూ, కాస్తంత క్రైం ట‌చ్‌తో సినిమాలు తీస్తూ, త‌న‌వి మాత్ర‌మే వాస్త‌వానికి బాగా ద‌గ్గ‌ర‌గా వుంటున్నాయ‌ని బాగా ప్ర‌చారం చేయించుకుంటూ,  అడిగిన‌వారికి అర్ధంచేసుకునేలోగా త‌ప్పుకునే వీలున్న స‌మాధానాలు చెబుతూ బొత్తిగా  అర్ధంగాని మ‌న‌స్తత్వంతో మ‌న మ‌ధ్యే వున్నవాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌!  ఏ సమస్యపైన అయినా సరే.. సోషల్ మీడియా సాక్షిగా తనదైన శైలిలో నేను సైతం అంటూ స్పందించి.. ఓ మేధావి త‌నం ప్ర‌ద‌ర్శిస్తూ ఆన‌క అంద‌రిచేత తిట్లు తిన‌డంలో ఆనంద‌మేమిటో ఆయ‌నే చెప్పాలి. అందుకు అనేక వుదాహ‌ర‌ణ‌లు వున్నాయి. ఆమ‌ధ్య ఎప్పుడో  టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి నడిరోడ్డుపై హల్‌చల్ చేసినా,  నేడు ఎన్డీఏ పక్షాలు గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని తమ  రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా.. క్షణాల్లో ఈ రామ్ గోపాల్ వర్మ అదీ ట్విట్టర్ వేదికగా తన దైన శైలిలో స్పందిం చేస్తారు.  ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారీ రామ్ గోపాల్ వర్మ. దీంతో మీడియాలోనే కాదు.. సోషల్ మీడియా సైతం ఈ రామ్ గోపాల్ రాజుగారి వ్యాఖ్యలపై రచ్చ రాజుకొంది. దీంతో కమలం పార్టీ నేతలు అయితే రామ్ గోపాల్ వర్మపై హాట్ కామెంట్స్ చేయడమే కాదు.. ఓ అడుగు ముందుకేసి.. హైదరాబాద్ లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ దర్శక ప్రముఖుడిపై ఎస్టీ, ఎస్సీ కేసు నమోదు చేయాలంటూ పోలీసులను  కమలం పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే రామ్ గోపాల్ వర్మపై నెటిజన్లు.. తిట్ల దండకం అందుకున్నారు. ద్రౌపది పేరు పెట్టుకున్నంత మాత్రాన.. కౌరవులు, పాండవులు అంటూ ఇటు వంటి కామెంట్లు చేయడం ఏమిటని నెటిజన్లు రామ్ గోపాల్ వర్మను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు...  ప్రతిదానికి  ఇలా భూతద్దంలో పెట్టి చూడడం ఏమిటని వారు  వర్మను  సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు. కానీ  ఆయ‌న మాత్రం  నా యిష్టం, నా అభిప్రాయం చెప్పాను, ఈ దేశంలో ఎవ‌రిక‌యినా త‌న అభిప్రాయం బ‌య‌ట‌కు చెప్పే హ‌క్కు వుందిక‌దా?!  అని ఎదురు ప్ర‌శ్న వేసి  త‌ప్పించుకోవ‌డంలో ఘ‌నుడు! అసలు రామ్ గోపాల్ వర్మ కాదు.. ఆయన అసలు సిసలు పేరు రాంగ్ గోపాల్ వర్మ, రోత గోపాల వర్మ  అంటూ  కామెంట్స్ చేస్తు న్నారు. ఏది ఏమైనా.. ఈ రామ్ గోపాల్ వర్మ.. ఈ స‌మాజంలో వున్నందుకు ప్ర‌తీదానికి స్పందించా ల‌న్న ఆతృత‌తో  ప్రతిదీ  రంధ్రాన్వేషణ చేయ‌డంలో ఆనందం ఆయ‌న‌కే తెలియాలి.  ఏ సమస్యపైన అయినా సరే.. క‌త్తికి  కొబ్బరికాయ దొరికినట్లు.. సోషల్ మీడియా సాక్షిగా  ఓ కామెంట్ చేసి.. గమ్మున ఉండి పండగ చేసుకొనే రకం ఈ రామ్ గోపాల్ వర్మ అనే టాక్  టాలీవుడ్‌లో ఉంది . ఆయ‌న‌తో జ‌ర‌భ‌ద్రం అనుకు నేట్టు ఆయ‌నే చేసుకోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌! అంతేకాదు ఆయనగారి తొలి సినిమా శివ సక్సెస్ అయినప్పుడు.. సత్య సినిమా బాలీవుడ్‌లో శతదినోత్స వం చేసుకున్నప్పుడు.. రంగేళి సినిమాలో ఉర్మిల డ్యాన్స్ చేసినప్పుడు కనిపించని సంతోషం ఈ రామ్ గోపాల్ వర్మలో తాను పనికి మాలిన కామెంట్స్ చేసినప్పుడు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటూ నెటిజనులు సెటైరికల్‌గా  కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ రాంగ్ గోపాల్ వర్మ.. నిత్యం వివాదంలో ఉండడం.. వివాదాస్పదంగా ఉండడం.. ఆయన జీవితాలవాటై పోయిందనే టాక్ సైతం టాలీవుడ్‌లో బలంగా ఉంది. ఏమైనా . రామ్ గోపాల్ వర్మ.. రాంగ్ గోపాల్ వర్మ!  కానీ వ‌ర్మ మాత్రం త‌ను స్పందించ కుండా వుండ‌లేన‌నే అంటూంటారు. స్పందించ‌డానికి ఓ ప‌ద్ధ‌తి ఏడుస్తుందిగా వ‌ర్మాజీ! స్పంద‌న ఎదుటి వారిని కాస్తంత ఆలోచింప‌జేయాలి, వ‌ర్మ స్పంద‌న త‌న‌కు అంద‌రినీ దూరం చేస్తోంది. ఆయ‌న‌కు ఎవ‌రు న‌చ్చ‌జెప్ప‌గ‌ల‌రు?!

డేటింగ్ యాప్ తో ఎర..! పరువు, ఉద్యోగం హరోంహర!!

టెక్నాలజీ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నది. అదే సమయంలో వ్యక్తుల దౌర్బల్యాలను ఆసరాగా తీసుకుని మోసాలు చేసే వారి సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది.  అంతర్జాలంలో డేటింగ్ యాప్ ల పేరుతో తమ ఎరలో పడిన వారిని దోచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ యాప్ ల వలలో పడి సర్వం కోల్పోతున్నవారు కొందరైతే.. తామ పని చేస్తున్న సంస్థకే టోపీ వేసి మరీ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఉద్యోగాలకూ ఎసరు తెచ్చుకుంటున్నవారు మరి కొందరు. ఇదిగో సరిగ్గా అలాంటి రెండో కోవకే చెందుతాడీ బ్యాంకు మేనేజర్. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి వేసిన ఎరకు చిక్కుకుని డబ్బు, పరువు, ఉద్యోగం అన్నీ పోగొట్టుకుని గోడుగోడున విలపిస్తున్నాడు. వివరాలలోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఒక బ్యాంకు మేనేజర్ హరిశంకర్ కొద్ది కాలం కిందట తన ఫోన్ లో ఓ డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. కొన్ని రోజులకు ఆ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. స్వీట్ నథింగ్స్ అంటూ పలు ప్రేమ సందేశాలను ఆ యాప్ ద్వారా పంచుకున్నారు. వీడియో కాల్స్, మెస్సేజెస్ ద్వారా వారి ప్రేమ గోల కొంత కాలం సందడిగా సాగింది. ఆ తరువాత వ్యాపారం ప్రారంభించాలంటూ ఆ యువతి హరిశంకర్ ను కొంత సొమ్ము ఇవ్వాల్సిందిగా కోరింది. పాపం అతగాడు కరిగిపోయి ఆమె ఖాతాకు 12లక్షల రూపాయలు బదలీ చేశాడు. అది చాలదు మరింత కావాలని కోరడంతో ఏం చేయాలో తోచని హరిశంకర్ తాను పని చేసే బ్యాంకులోని ఒక సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి రూ.6 కోట్ల రూపాయలు రుణాన్ని ఆమె పేరిట తీసుకుని తన ఖాతాకు బదలీ చేసుకున్నాడు. ఆ తరువాత అందులో నుంచి 5.69 కోట్ల రూపాయల మొత్తాన్ని తన డేటింగ్ యాప్ ప్రేయసికి బదలీ చేశాడు.   అయితే రుణానికి సంబంధించిన సందేశాలు సీనియర్ సిటిజన్ ఫోన్ కు రావడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో హరిశంకర్ బండారం బయటపడింది. బ్యాంకు సొమ్ము కాజేశాడంటూ హరిశంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులు సస్పెండ్ చేశారు. విచారణలో హరిశంకర్ తనను మోసం చేసి ఓ యువతి డబ్బులు తీసుకుని ఇప్పుడు  ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని వెల్లడించారు. 

పాఠశాలలో గురువుల కోట్లాట.. వీడియో తీసిన శిష్యులు!

విద్యార్థులకు సత్ప్రవర్తన అలవర్చాల్సిన ఉపాధ్యాయులే వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే.. అదీ విద్యార్థుల ముందే.. వారికి ఉపాధ్యాయులుగా కొనసాగే నైతికత ఉందా అంటూ నెటిజన్లు తెగ ఫైరైపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్ లోని మహేంగు ఖేరా గ్రామంలోని ఓ పాఠశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తన బూటు తీసి ఒక ఉపాధ్యాయురాలిని కొట్టారు. ఆ ఉపాధ్యాయురాలూ ఊరుకోలేదు. ప్రిన్సిపాల్ పై తిరగబడింది. తోటి ఉపాధ్యాయుులు ఎంత సముదాయించి వారి మధ్య ఘర్షణను నివారిద్దామని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాఠశాలలోనే జరిగిన ఈ గొడవను విద్యార్థులు తమ ఫోన్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇంతకీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలి మధ్య గొడవ ఎందుకంటే.. ఉపాధ్యాయురాలు పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. ప్రిన్సిపాల్ కోపగించారు. ఆమె సమాధానంతో మరింత రెచ్చిపోయి బూటు తీసుకుకోట్టారు. దీంతో ఉపధ్యాయురాలూ తిరగబడ్డారు. ఇదీ సంగతి. అక్కడితో ఆ గొడవ ఆగిపోలేదు. ఇరువురూ ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు  చేసుకున్నారు. ఉపాధ్యాయురాలు ప్రతి రోజూ పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారనీ, అదేంటని అడిగిన తనను దుర్భాషలాడినందుకే కోపంతో దాడి చేశాననీ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఉపాధ్యాయురాలిపై బూటుతో దాడి చేసినందుకు ప్రిన్సిపాల్ ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు.

కోనసీమ జిల్లా కాదు.. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం

కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ సర్కార్ నిర్ణయం తీసేసుకుంది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ  కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమలాపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అయితే ఈ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న వినతుల నేపథ్యంలో పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ.. కోనసీమ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమలాపురంలో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. గత నెల 24న అమలాపురం పట్టణంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలను ఆందోళనకారులు ధగ్ధం చేశారు. పోలీసు వాహనాలు సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అమలాపురం పట్టణంలో ఆంక్షలు విధించారు. పక్షం రోజుల పాటు అంతర్జాల సర్వీసులను నిలిపివేశారు. ఈ అల్లర్ల వెనుక విపక్షాల హస్తం ఉందంటూ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. అయితే వాస్తవానికి అల్లర్ల కుట్ర అధికార పార్టీదేనంటూ విపక్షాలు ఫొటోలతో సహా వివరాలను బయటపెట్టారు. దీంతో సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఈ అల్లర్లకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీకి చెందిన వారే కావడంతో కుట్ర పూరితంగా విధ్వంసం సృష్టించింది వైసీపీయేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. కోనసీమ జిల్లా పేరు మార్పునకు అభ్యంతరాలు తెలియజేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో పేరు మార్పుపై చర్చింది.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదలా ఉండగా,   కోనసీమ కు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో   పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి పైన కోర్టు విచారించాల్సి ఉంది.  మొత్తం మీద కోనసీమలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది.

వయనాడ్ లో రాహుల్ కార్యాలయంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం

రాజకీయ ప్రత్యర్థులపై, వారి కార్యాలయాలు, ఆస్తులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయి. భిన్న అభిప్రాయాన్ని సహించలేని అసహనం దేశంలో పెరిగిపోతున్నది.  కేరళలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగిన దాడి ఈ కోవలోకే వస్తుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,  అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ  కార్యాల‌యంపై  గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు శుక్ర‌వారం దాడికి పాల్పడ్డారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వ‌య‌నాడ్‌లో ఆయ‌న త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాల‌యంపై శుక్ర‌వారం  కొంద‌రు వ్య‌క్తులు  దాడికి పాల్పడి కార్యాల‌యంలోని సామగ్రి ధ్వంసం చేశారు. ఈ దాడిని కాంగ్రెస్  తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి చెందిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైర‌ల్ అయ్యాయి. కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వ‌మే ఈ దాడికి బాధ్య‌త వ‌హించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేర‌ళ పోలీసుల క‌ళ్లెదుటే దుండ‌గులు దాడికి దిగార‌ని  కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.  ఈ దాడి వెనుక సీపీఎం హస్తం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు.   దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్ప‌డ్డ వారిపై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  డిమాండ్ చేశారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని   కేర‌ళ స‌ర్కారును కోరారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను కాంగ్రెస్ పార్టీ స‌హించ‌బోద‌ని హెచ్చ‌రించారు.

బాలకృష్ణకు కరోనా పాజిటివ్

తెలుగుదేశం నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ  తెలంగాణాలో విస్త‌రిస్తోంది. శుక్ర‌వారం కొత్త‌గా 493కేసులు న‌మోద‌య్యాయి. గ‌డ‌చిన 24 గంట‌ల్లో  దేశంలో 29,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాటిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలంగాణా వైద‌్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.  వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లోనే 366 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 3,332 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులిటెన్‌‌లో వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేడు కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. గురువారం 494 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు..   నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది.  కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల కిందట బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.    తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని బాలయ్య సూచించారు. తాను త్వరలోనే కోలుకొని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానన్నారు. హరీశ్ రావు వేదికపై బాలయ్య పక్కన కూర్చున్నారు. కోవిడ్ వ్యాప్తి పెద్దగా లేకపోవడంతో ఎవరూ మాస్కులు ధరించలేదు. బాలయ్య కరోనా బారిన పడినట్లు తేలడంతో..   హరీశ్ రావుతోపాటు కేన్సర్ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒకింత టెన్షన్‌కు గురవుతున్నారు. మంత్రి హరీశ్ రావుకు గతంలోనే కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే.  

ప్ర‌తిష్ఠ కోల్పోయిన చైనా న‌గ‌రం!

ఇంటికి ఆనంద‌ నిల‌యం అని పేరు పెట్ట‌గానే స‌రిపోదు. ఇంట్లో అంతా నిజంగానే హాయిగానూ, ఆనందం గానూ వుండాలి. న‌గ‌ర‌మంటే భారీ క‌ట్ట‌డాలు, భ‌వ‌నాలు, అంద‌మైన రోడ్లు, ప‌బ్బులూ కాదు. ప్రాంతీయ పాల‌న బాగుండాలి, ప్ర‌జ‌ల వ్య‌వ‌హార శైలి బాగుండాలి, అతిధుల‌ను చ‌క్క‌గా ఆద‌రించాలి. అపుడే  ఆ న‌గ‌రం  ఉత్త‌మ న‌గ‌రంగా పేరు సంపాదించుకుంటుంది.  ఎప్పుడూ గొడ‌వ‌లు, కొట్లాట‌లు, హింస‌, మ‌హి ళ‌ల‌పై అత్యాచారాలు, దాడులతో నిత్య న‌ర‌కంగా మారుతుంటే ఏ న‌గ‌ర‌మ‌యినా మ‌హాన‌గ‌రం అనిపించు కోదు. విశ్వనగరమన్న కితాబులూ సరితూగవు. న‌గ‌రానికి వున్న ప్ర‌తిష్ట పూర్తిగా దెబ్బ‌తింటే బ‌య‌టి నంచి వ‌చ్చే అతిధులు భ‌య ప‌డ‌తారు. అప్ర తిష్ట పాల‌యి అంద‌రి దృష్టిలో మామూలు ప‌ట్ట‌ణంగా మిగిలిపోతుంది. ఇపుడు ఈ దుస్థితికి  చేరు కుంది చైనాలోని  తాంగ్‌షాన్ న‌గ‌రం. యువ‌త చేసిన చెత్త ప‌నివ‌ల్ల  ప‌ట్ట‌ణం ప్ర‌తిష్ట పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌తి ష్టాత్మ‌క న‌గ‌రాల్లో ఒక‌టి అన్న స్థాయినీ కోల్పోయింది! చైనాలో తాంగ్‌షాన్ కు ఎంతో మంచి న‌గ‌రంగా గుర్తింపు వుంది. ఈమ‌ధ్య‌నే ఆ న‌గ‌రంలో వూహించ‌ని సంఘ ట‌న జ‌రిగింది. న‌గ‌రంలోని ఒక చైనీస్ రెస్టారెంట్ కి వ‌చ్చిన న‌లుగురు అమ్మాయిల‌ను కొంద‌రు కుర్రాళ్లు వెంబ‌డించారు.  వారిలో ఒక‌డు ఒక అమ్మాయితో అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించాడు. ఆమె తిర‌స్కరించింది. కానీ అత‌ను ఆమె జుత్తుప‌ట్టుకుని వీధిలోకి లాక్కొచ్చి మ‌రీ కొట్టాడు. త‌న ఇష్టాన్ని కాదంటావా అని తిట్ట‌ని తిట్టు తిట్ట‌కుండా తిట్టాడు. అంతేకాదు అత‌నితోపాటు అత‌ని స్నేహితులు కూడా ఆమె స్నేహితు ల‌పై దాడిచేసేరు. గాయ‌ప‌డిన ఇద్ద‌రు అమ్మాయిలు రోడ్డు మీద అలా ప‌డిపోయారు. వాళ్ల‌ని వ‌దిలేసి  ఆ కుర్రాళ్లు పారిపోయారు. ఇద్ద‌రు అమ్మాయిలు తీవ్ర గాయాల‌తో  ఆస్ప‌త్రి ఐసియూ లో వున్నారు. ఈ సంఘ ట‌న ఈ నెల ప‌దో తేదీన జ‌రిగింది.  మ‌న‌దేశంలో ఏ న‌గ‌రంలోనైనా ఇది చాలా మామూలు సంగ‌తే. కానీ  2011 నుంచి ఉత్త‌మ న‌గ‌రంగా ఎంపిక వుతూన్న‌  చైనా ఉత్త‌ర హెబీ ప్రావెన్స్‌లోని తాంగ్‌ష‌న్  న‌గ‌రంలో ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప్ర‌జ‌లు గౌర‌వా నికి  దెబ్బగా భావించా రు. ప్రాంతీయ అధికారులు అస‌లు ఈ  సంఘ‌ట‌న  గురించిన పూర్వాప‌రాలు తెలుసుకోవ‌డానికి  ఆ  రెస్టారెంట్  సిసి టివి కెమెరాల‌ను ప‌రిశీలించారు. ఆ సంఘ‌ట గురించి వ‌చ్చిన ఫిర్యాదులు  నిజ‌మేన‌ని  తేలింది. ప్ర‌జ‌లు  ఈ సంఘ‌ట‌న పట్ల పెద్ద ఎత్తున వుద్య‌మించారు. ఈ  సంఘ ట‌న‌కు పాల్ప‌డ‌న‌వారిగా అనుమానిస్తూ పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.  ఇదంతా  ఒకెత్త‌యితే, ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను వంద‌లసార్లు ప్ర‌జ‌లు చూసి అస‌హ్యిం చుకుంటున్నారు. తాము నివ‌సిస్తున్నది ఇంత‌టి ద‌రిద్ర‌పు న‌గ‌రంలోనా అనుకుంటున్నారు. దీంతో అక్క‌డి  ప్ర‌భుత్వం జాతీయ ప్ర‌తిష్టాత్మ‌క న‌గ‌రాల జాబితా నుంచి తాంగ్‌ష‌న్ న‌గ‌రం పేరును తొల‌గించా రు.   ఇది నిజంగా ఎంతో హ‌ర్ష‌ణీయం. ప్ర‌భుత్వం, ప్రాంతీయ అధికారులు ఇంత‌టి నిర్ణ‌యం తీసుకోవడం లో త‌మ దేశంలో ప‌ట్ట‌ణాలు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వుంటున్నాయ‌న్న‌ది  తెలియ‌జేశారు. మ‌న దేశంలో పేరు గొప్ప వూరు దిబ్బ అన్న సామెత‌కు బాగా ద‌గ్గ‌ర‌గా అనేక ప‌ట్ట‌ణాలు వున్నాయి. దాదాపు ప్ర‌తీ ప‌ట్ట‌ణం, న‌గ‌రం ఏదో ఒక చారిత్రాత్మ‌క క‌ట్ట‌డంతో ఎంతో పేరు సంపాదించుకునే వున్నాయి. ప‌ర్యాట కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. కానీ ఇటీవ‌లి కాలంలో చాలా దారుణ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా యి. ప్ర‌జ‌లు భీతిల్లు తున్నారు. కానీ ప్ర‌భుత్వాలు, పోలీసులు ఆయా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల ప్ర‌తిష్ట దెబ్బ తింటోంద‌న్న జ్ఞానం మాత్రం పొంద‌క పోవ‌డం విడ్డూరం. మ‌న‌కు చైనా ప్ర‌భుత్వం వ‌లె క‌ఠినాతి క‌ఠిన నిర్ణ‌యం తీసుకునే ధైర్యం వుంటే అనేక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు ప్ర‌చారంలో వున్న పేరు, ప్రతిష్ఠ దారుణంగా వెలిసిపోయే అవ‌కాశం చాలా వుంది. 

గుడివాడపై చంద్రబాబు గురి!

పరిపాల‌నలో  విఫ‌ల‌మ‌యిన జ‌గ‌న్  ఆయ‌న మంత్రివ‌ర్గం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం మీద నోరు పారే సుకోవ‌డం ఈ మ‌ధ్య కాలంలో చాలా అతిగా వుంది. త‌మ పాల‌న‌లో లోపాల్ని దిద్దుకోవ‌డం చేత‌గాక, త‌మ‌లో తామే విభేదించుకుంటూ కాలం నెట్టుకొస్తున్న వైసీపీకి  ఇక నూక‌లుచెల్లిన‌ట్టే. వైసీపీ నాయ‌కులు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు ఎదురు ప్ర‌శ్న‌ల‌తో త‌రిమికొడుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌తో వారికి  ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, అభిమానం కోల్పోయామ‌న్న‌ది మ‌రింత స్ప‌ష్ట‌మ‌యింది.  వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి ప్ర‌జ‌ల ఆశ‌లు అడి యాస‌ల‌య్యాయి. ఇపుడు రాష్ట్ర ప్ర‌జ‌లంతా తెలుగుదేశం వేపై ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.  ఈ ప‌రిస్థితు ల్లో తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ముందుగా గుడివాడ పై దృష్టిసారించారు.  గుడివాడ ఎమ్మ‌ల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి  చెక్ పెట్టాల‌న్న ల‌క్ష్యంతో తెలుగుదేశం అధినేత చంద్ర బాబు స్వ‌యంగా  రంగంలోకి దిగుతున్నారు. ఈ మేర‌కు ఆ పార్టీ వ‌ర్గాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.  నాలుగు ప‌ర్యాయాలు గుడివాడ నుంచి  గెలిచిన కొడాలి నాని ఇప్ప‌టికీ  త‌న వ్య‌వ‌హార తీరును  మార్చుకోలేదు. ప్ర‌జ‌లు  ఆయ‌న్ను అస‌హ్యించుకుంటున్నారు. ఇలాంటి వారిని మ‌రోసారి గెలవ‌నీయ‌కుండా చూడాల‌ని తెలుగుదేశం అధినేత ప‌ట్టుద‌ల‌తో వున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సంద ర్భంగా ఆయన జన్మించిన ప్రాంతం గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి, తద్వారా కొడాలి నాని, వైసీపీ ఆగడాలకు, దూకుడుకు చెక్ పెట్టేందుకు టీడీపీ  అగ్రనేతలు  కత్తులు దూస్తున్నారని సమాచారం. అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై నోరేసుకుని పడిపోయి, బూతులతో విమర్శలు చేసే కొడాలి నాని  అంటే టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. మంత్రి పదవి నుంచి తనను జగన్ రెడ్డి  పీకి పారేసినా కూడా  కొడాలి తన  బూతు పంచాంగాన్ని ఆపడం లేదు. నాలుగుసార్లు ఓట్లు వేసి  గెలిపించి  అసెంబ్లీకి  పంపించిన గుడివాడ నియోజకవర్గం ప్రజలకు ఆయన  చేసిందేమీ లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. రోడ్ల  దుస్థితి  చెప్పక్కర్లేదు. రోజూ అనేక  స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిచే గుడివాడ బస్సాండ్ దుస్థితి కొడాలి నాని పనితీరుకు ప్రత్యక్ష నిలువెత్తు నిదర్శనం. గురివింద గింజ తన నలుపు సంగతి ఎరుగదు అన్న చందంగా కొడాలి నాని తీరు ఉందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నా పట్టించుకోకుండా పేకాటలు, భూ ఆక్రమణలు, క్యాసినోల నిర్వహణలో తలమునకలయ్యే కొడాలి నాని చంద్రబాబు పైనా, లోకేష్ పైనా నిత్యం అసందర్భ, అనుచిత ప్రేలాపనలతో కాలక్షేపం చేస్తుండడాన్ని నియోజకవర్గం ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఆ విధంగా విరుచుకుప‌డ‌టం త‌న‌కు, త‌న పార్టీకే న‌ష్ట‌మ‌న్న ఇంగితం కూడా లేక‌పోవ‌డం విడ్డూరం.  కొడాలి నానిని, టీడీపీ వ్యవస్థాపకుడి సొంత నియోజకవర్గం గుడివాడను ఇలాగే వదిలేస్తే మంచిది కాదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 29న కృష్ణా జిల్లా మహానాడులో భాగంగా గుడివాడలో లక్ష మందితో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. గుడివాడ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు టీడీపీ నేతలు నడుం బిగించారు. గుడివాడ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలని, బూతుల నేతకు మూతి వాచేలా చెక్ చెప్పా లనే లక్ష్యంతో టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధం అవుతున్నారు. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఇన్ చార్జి రావి వెంకటేశ్వర రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ చంద్రబాబు బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పూర్తిస్థాయిలో రంగంలో దిగారు. కేసినో వ్యవహారంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించి నప్పుడు స్థానిక టీడీపీ నేతలను గుడివాడ నాని అండ్ కో భయపెట్టి.. బయటకు రాకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో గుడివాడలో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం నేరుగా రంగంలో దిగడం విశేషం. గుడివాడలో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్థానక నేతలతో ఇప్పటికే చర్చలు జరిపారు. భారీ బహిరంగ సభకు అనుకూలంగా ఉండే స్థలా ల్ని కూడా ఆయన పరిశీలించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా గుడివాడ నేతలతో సమావేశం నిర్వహించారు. జనసమీకరణను సవాల్ గా తీసుకోవాలని వారికి అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 29 సాయంత్రం గుడివాడలో మహానాడు, బహిరంగసభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం బందరు పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను సక్సెస్ చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ‘బాదుడే .. బాదుడు’ అంటూ చంద్రబాబు చేస్తున్న ఏపీ వ్యాప్త పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన వస్తోంది. గుడివాడలో కూడా తమ సత్తా చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కొడాలి నాని నోటికి తాళం వేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తు న్నారు.

కోనసీమ అల్లర్లకు 30 రోజులు.. పేరు నిర్ణయంపై ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును నిర్ణయించడాన్ని నిరసిస్తూ అమలాపురంలో జరిగిన విధ్వంసానికి నేటితో 30 రోజులు పూర్తయ్యింది.  విధ్వంసం తరువాత తీరిగ్గా రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆంక్షల పేరుతో స్థానికులను నానా యాతనా పెట్టారు. దాదాపు పక్షం రోజులు అమలాపురం పట్టణ వాసులకు అంతర్జాత సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.  కోనసీమ పరిరక్షణ సమితి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో నిరసనకారులు పలు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలను దగ్ధం చేశారు.   రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్,ముమ్మిడివరం  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు   పోలీసులు 217 మందిని అరెస్టు చేశారు. కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు.  ఇప్పటికి అక్కడ 144 సెక్షన్ 30 సెక్షన్ కింద ఆంక్షలు   మరోవైపు మే 18 నుంచి జూన్ 18 వరకు కోనసీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం విధించిన గడువు కూడా పూర్తియ్యింది.  కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు ఆరు వేల మంది అభిప్రాయాలు, సలహాలూ, సూచనలు జిల్లా అధికారులకు పంపినట్టు సమాచారం.   ఈ నేపథ్యంలో జూన్ 24న   ఏపీ మంత్రివర్గ సమావేశంలో కోనసీమ జిల్లా పేరు మార్పు అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. సున్నితమైన అంశం కావటంతో ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా..మెజార్టీ అభిప్రాయం మేరకు పేరును ప్రకటిస్తుందా..లేక ఎటువంటి వివాదం లేకుండా ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తుందా అనే విషయంపై కోనసీమ వాసుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే.. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు ఏవైనా ప్రభుత్వం మాత్రం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును ఖరారు చేసే ఉద్దేశంతోనే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అల్లర్లు విధ్వంసం చోటు చేసుకున్ననాటి నుంచే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మంత్రులు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరే కొనసాగుతుందని చెబుతున్నారు. అసలు ఈ విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీ వర్గీయులేననీ, పేరు మార్పును వ్యతిరేకిస్తూ విధ్వంసం అంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా నెపం విపక్షాలపై వేయడానికేననీ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  ప్రభుత్వం కోససీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే... కోనసీమ పేరు ప్రకటించడానికి ముందే ఆ పని చేసి ఉండాల్సిందని స్థానికులు అంటున్నారు. అలా చేయకుండా అప్పుడు వచ్చిన విజ్ణప్తులను పక్కన పెట్టేసి ఒక నిర్ణయం తీసుకుని.. ఆ తరువాత తీరిగ్గా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పక్క తోవ పట్టించేందుకు కోనసీమలో కుల చిచ్చుకు కారణమైందన్న విమర్శలు ఉన్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి అరెస్టయిన వారిలో అత్యధికులు వైసీపీ వారే కావడంతో ఈ విమర్శల్లో వాస్తవముందని స్థానికులు కూడా విశ్వసిస్తున్నారు. ఏది ఏమైనా విధ్వంసం తరువాత నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న కోనసీమ.. మంత్రివర్గ నిర్ణయం తరువాత  అదే పరిస్థితి ఉంటుందా అన్న ఆందోళన పట్టణ వాసుల్లో వ్యక్తమౌతున్నది. కాగా కేబినెట్ లో చర్చించి జిల్లా పేరుపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా కోనసీమ వ్యాప్తంగా, ముఖ్యంగా అమలాపురం పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

భయం నా బయోడేటాలోనే లేదు.. లోకేష్

భయం నా బయోడేటాలో లేదు. నాది రాయలసీమ బ్లడ్.. పౌరుషం నా ఇంటి పేరు అంటూ లోకేష్ పల్నాడులో సింహ గర్జన చేశారు.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేష్ పల్నాడు పర్యటనకు ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి ముందుకే కదిలారు.  పల్నాడు గడ్డపై నుంచి ఆయన అధికార పార్టీకి సవాళ్లు విసిరారు. విమర్శల తూటాలు  పేల్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిని జగన్మోసం రెడ్డిగా అభివర్ణించారు. గత ఎన్నిక‌ల‌కి ముందు జ‌గ‌న్‌  అన్నీ పెంచుకుంటూ పోతాన‌న్నాడు జ‌నం ఏమో సంక్షేమ ప‌థ‌కాలు పెం చుతూ పోతాడేమో అని ఆశ‌ప‌డ్డారు. సీఎం అయ్యాక ఆయన అన్నీ పెంచేశారు. అ యితే అవి సంక్షేమ పథకాలు కాదు.. ప‌న్నులు, చార్జీలు అన్నారు. అందుకే ఆయన  జ‌గ‌న్ రెడ్డి కాదు ఆయ‌న జ‌గ‌న్మోసం రెడ్డి  అని లోకేష్ అన్నారు. త‌న‌ను ఎవ రూ పీక‌లేర‌ని విర్ర‌వీగుతున్న జ‌గ‌న్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా బ‌య‌ట‌కొస్తే జ‌న‌మే వెంట్రు క‌ల‌న్నీ పీకి పంపుతార‌ని  నారా లోకేష్ హెచ్చ‌రించారు. ప‌ల్నాడు జిల్లా రావ‌లాపురంలో జ‌ల్ల‌య్య కుటుం బాన్ని ప‌రామ‌ర్శించిన అనంత‌రం టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు.  చంద్ర‌బాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే  గంజాయి, పిచ్చి మందుకి బ్రాండ్  అంబాసిడ‌ర్ జ‌గ‌న్  అని అన్నారు. రాష్ట్రంలో అస‌లు సిస‌లు పాల‌న‌, అభివృద్ధి తెలుగు దేశం వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప‌సుపు జెండాని ప్రాణంగా ప్రేమించే తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కి  పాదాభివంద‌నం. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో ఏపీ ని  మూడ‌వ స్థానానికి చేర్చార‌న్నారు. ఈ మూడేళ్ల‌లో పంట‌ల‌కి గిట్టుబాటు ధ‌ర లేదు, ఏడాదికి ఇస్తామ‌న్న మూడు వేల కోట్ల ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి లేదు. రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోవ డ‌మే రాష్ట్రంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌న్నారు.  ఆడ‌బిడ్డ‌ల‌కి న్యాయం చేయాల‌ని నేను పోరాడితే అక్ర‌మంగా అరెస్టు చేశారు..ఎన్నిసార్ల‌యినా అరెస్టు చేసుకోండి. భ‌యం నా బ‌యోడేటాలో లేదన్నారు. వైకాపా కుక్క‌లు నా మీద రాళ్లు వేయించాయి. రాళ్లు వేస్తే పారిపోను..నాది రాయ‌ల‌సీమ  బ్ల‌డ్‌..పౌరుషం నా ఇంటి పేర‌న్నారు. అమ్మ ఒడి మిగిలించుకోవ‌డానికి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో నాలుగు ల‌క్ష‌ల మందిని ఫెయిల్ చేసి విద్యార్ధుల‌కు అన్యాయం చేశాడ‌ని జగన్ పై లోకేష్‌ ఘాటు విమర్శలు గుప్పించారు.

ఆవుల నోరు విప్పాడు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిర‌సిస్తూ దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ అల్ల‌ర్లు చెల‌రేగిన  సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్‌లో జ‌రిగిన అల్ల‌ర్లు, రైలు ద‌గ్ధం కేసులో అనేక విష‌యాలు వెలుగు చూస్తు న్నాయి. సికింద్రాబాద్‌లో ఎ న్న‌డూ వూహించ‌ని దాడులు, అల్ల‌ర్ల‌కు యువ‌త‌ను రెచ్చ‌గొట్టార‌ని సాయి డిఫె న్స్ అకాడెమీ య‌జ‌మాని ఆవుల సుబ్బారావును అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్సు పోలీసుల విచార‌ణలో ఆవుల దాడుల వెనుక కుట్ర గురించి నోరు విప్పాడు.  ఆవుల త‌న అనుచ‌రుల‌తోనే ధ్వంస ర‌చ‌న చేసిన‌ట్టు విచార ణ‌లో తేలింది.  అస‌లు ఈ ఆందోళ‌నకు గుంటూరు ర్యాలీ స‌మ‌యంలోనే స్కెచ్ వేసిన‌ట్టు తేలింది. సుబ్బారావు అనుచరు ల‌కు వాట్సాప్ గ్రూప్‌లలో పిలుపునిచ్చారు. న‌రేష్ అనే అనుచ‌రుడితో సుబ్బారావు ఆందోళ‌న‌కారుల‌కు కావ ల‌సిన భోజ‌న స‌దుపాయాలు ఏర్పాటు చేయించాడు. కాగా న‌రేష్ ప్ర‌స్తుతం ప‌రారీలో వున్నాడు. జూన్ 16నే సుబ్బారావు సికింద్రాబాద్‌కు వ‌చ్చి హోట‌ల్లో అనుచ‌రుల‌తో భేటీ అయ్యాడు. విధ్వంసానికి  సిద్ధ‌మయ్యారు. విధ్వంసం జ‌రిగిన వెంట‌నే సుబ్బారావు ను పోలీసులు రిమాండ్‌కి త‌ర‌లించారు.  ఇదిలా ఉండగా, సాయి డిఫెన్స్ అకాడమీకి ఆర్‌పీఎఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న ఆర్‌పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన రికార్డులు,  ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావా లని సూచించారు.

యు.ఎస్‌లో తుపాకీ సంస్కృతిపై సెనెట్ ఆమోదానికి సుప్రీం అడ్డు!

ఒకే చెట్టుకి రెండు కాయ‌లు వుండ‌వ‌చ్చు. ఒకే లాంటి వారు ఇద్ద‌రు వుంటారు. ఒకే స‌మ‌స్య‌కు రెండు విరుద్ధ‌ తీర్పులు వుండ‌కూడ‌దు. అమెరికాలో ఇప్పుడు అంద‌ర్నీ ఆందోళ‌న‌కు గురిచేస్తున్న అంశం  అక్క‌డి తుపాకీ సంస్కృతి మీద రెండు విరుద్ద తీర్పులు ఒకే రోజు విన‌డం! గ‌న్ క‌ల్చ‌ర్ ని నిలువ‌రించేందుకు సెనేట్‌లో బిల్లుకి అంద‌రి ఆమోదం ల‌భించ‌డం. మ‌రో వంక సుప్రీంకోర్టు అస‌లు అమెరిక‌న్లు తుపాకీ క‌లిగి వుండ‌టంలో త‌ప్పులేదు, అది వారి హ‌క్కు అంటూ తీర్పునీయ‌డం!  హ‌మ్మ‌య్య పీడ విర‌గ‌డ‌వుతుంద‌ను కున్న‌ది, అబ్బేం నాకు మ‌ర‌ణం లేద‌ని దెయ్య‌మే ఇంట్లోకి వ‌చ్చి కూర్చుంటుంది ఒక జాన‌ప‌ద క‌థ‌లో! ఎందుకంటే  ఇప్పుడు అమెరికా  ప్ర‌జ‌లు న‌వ్వాలో, ఏడ‌వాలో అర్ధంగాని సందిగ్ధ‌త‌లో వున్నారు. సెనెట్ ఆమోదానికి సుప్రీంకోర్టు వెంట‌నే ఆదేశాల‌తో అడ్డుకోవ‌డం ప్ర‌జ‌లు సందిగ్ధానికి గుర‌య్యారు. అస‌లు ద‌శాబ్దాలుగా అమెరికాలో ప్ర‌తీ రాష్ట్రంలోనూ ఎవ‌ర‌యినా తుపాకీ లేదా పిస్ట‌ల్‌ను ప‌ట్టి య‌దేచ్ఛ‌గా తిర‌గ‌డం కోపంవ‌స్తే ఎదుటివారిని కాల్చేయ‌డం విన్నాం, వింటున్నాం. ఈ విష సంస్కృతిని తొల‌గించా ల‌ని చాలాకాలం నుంచి అక్క‌డ నినాదాలు చేస్తుండ‌టం కూడా వింటున్నాం. దీన్ని గురించి  అక్క‌డి సెనెట్‌లో చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌తీసారి అది వీగిపోతూనే వుంది. అయితే ఇటీవ‌ల ఒక బ‌డిలో జ‌రిగిన దారుణ కాండ అక్క‌డి ప్ర‌జ‌ల్ని మ‌రింత భ‌యపెట్టింది. ఫ‌లితంగా అక్క‌డి సెనేట్‌లో గ‌న్‌క‌ల్చ‌ర్‌కి  ఫుల్ స్టాప్ పెట్టాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో తుపాకీ హింస నిరోధ‌క బిల్లును ఎట్ట‌కేలకు యు.ఎస్ సెనేట్‌లో అంగీ క‌రిం చారు. ఇక అది చ‌ట్ట‌రూపంలోకి  మారి అమ‌లు జ‌ర‌గ‌డ‌మే ఆల‌స్యం అని ఆనందించారు.  ఈ బిల్లు  ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమిత మైనా  ఇటివల న్యూయా ర్క్, టెక్సాస్‌లలో గన్‌కల్చర్ సృష్టించిన రక్త పాతాలు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల్లో చలనం కలిగించా యి. దీంతో నెలక్రితం కూడా  ఊహాజని తంగానే ఉన్న గన్‌కల్చర్ బిల్లు అనూహ్యంగా యూఎస్  కాంగ్రెస్ ముందుకొచ్చింది. చిత్ర‌మేమంటే గురు వారం అక్క‌డి సుప్రీంకోర్టు  ఇందుకు పూర్తి విరుద్ధ‌మైన తీర్పునిచ్చింది. అస‌లు అమెరికావాసుల‌కు తుపా కులు క‌లిగి వుండ‌టానికి స్వేచ్ఛ, హ‌క్కు వుంద‌ని!  6-3 తేడాతో  వెలువ‌డిన నిర్ణయం శతాబ్దానికి పైగా పాత న్యూయార్క్ చట్టాన్ని కొట్టివేస్తుంది, ఇది  ఒక  వ్యక్తికి చట్టబద్ధ మైన స్వీయ-రక్షణ అవసరం లేదా సరైన కారణం ఉందని నిరూపించుకోవాల్సిన అవ సరం ఉంది, ఇది ఇంటి బ‌య‌ట‌ చేతి తుపాకీని తీసుకెళ్లడానికి అనుమతిని పొందుతుంది. కాలిఫోర్ని యాతో సహా అనేక ఇతర రాష్ట్రాలు ఒకే విధమైన చట్టాలను కలిగి ఉన్నాయి . కోర్టు  తీర్పు ప్రజలను బహి రంగంగా తుపాకులు కలిగి ఉండకుండా నిరోధించే వారి సామర్థ్యాన్ని అరికడుతుంది. డెమొక్రాటిక్ ప్రెసి డెంట్ జో బిడెన్ ఈ నిర్ణయాన్ని ఖండించారు, ఇది ఇంగితజ్ఞానం, రాజ్యాంగం రెండింటికీ విరుద్ధంగా ఉంది. అలాగే మనందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టాలి అని అన్నారు. మన తోటి అమెరికన్ల ను రక్షించ డానికి సమాజప‌రంగా ఏ విధంగా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేయాల‌న్న‌ది ఆలోచించాల‌న్నారు. తుపాకీ భద్రతపై తమ గళాన్ని వినిపించాలని దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్లకు ఆయ‌న‌ పిలుపునిచ్చారు. వీధులు, పాఠశాలలు, చర్చిలలో కాల్పుల‌కు గురికాకుండా మన పౌరులను రక్షించడానికి  రాడికల్ సైద్ధాంతిక ఎజెండాను ముందుకు తీసుకురావడానికి,  రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించే  కోర్టు నుండి  ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం రావ‌డం హ‌ర్ష‌ణీయం కాద‌ని కాలిఫోర్నియా నాయకుడు గావిన్ న్యూ సోమ్ ట్వీట్ చేశారు. జస్టిస్ క్లారెన్స్ థామస్ మెజారిటీ అభిప్రాయాన్ని పేర్కొన్నారు. తొమ్మిది మంది సభ్యుల కోర్టులో ఇతర ఐదుగురు సంప్రదాయవాదులు చేరారు, వీరిలో ముగ్గురిని మాజీ రిపబ్లికన్ అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు.   ఆయుధాల విక్రయంపై ఆంక్షల విధింపునకు డెమొక్రాట్ల ఇంతకాలం చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్ పార్టీ అడ్డుపడుతూ వచ్చింది. కానీ న్యూయార్క్, టెక్సాస్ కాల్పుల రక్తపాతాలు రిపబ్లికన్ నాయకుల్లోనూ కదలికలు రావడంతో బిల్లు కార్యరూపం దాల్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతిని నిలువరించేందుకు పటిష్ఠమైన చట్టం అవసరమని ఇరు పార్టీలకు చెందిన సెనేటర్లు భావించారు.  ఈ  బిల్లు కార్యరూపం దాల్చితే గన్ కొనుగోలు చేసే యువకుల పూర్వపరాలను తనిఖీ చేస్తారు. అంతే కాకుం డా నేరచరిత్ర లేదా మానసిక స్థితి సరిగా లేని వారి నుంచి ఆయుధాలను దూరం చేస్తారు. ఈ బిల్లు కింద 13 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు. ఈ నిధులను స్కూళ్ల వద్ద భద్రత పెంపు, మానసిక ఆరోగ్యం, హింస నిరోధక కార్యక్రమాల కోసం కేటాయిస్తారు. కాగా ఎన్నికల ఏడాది డెమొక్రాటిక్ పార్టీ చేసిన వాగ్ధానాలకు ఈ బిల్లు దూరంగా ఉంది. దాడులకు ఉపయోగించే ఆయుధాలపై నిషేధం, అధిక సామర్థ్య మున్న అమ్మోనియం మ్యాగజిన్స్ వినియోగంపై కూడా నిషేధాన్ని అమలు చేయాలని డెమొక్రాటిక్ పార్టీ నేతలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మ‌రి ప్ర‌స్తుతం వెలువడిన విరుద్ద ప్ర‌క‌ట‌న‌ల ప‌ట్ల  అమెరికా స‌మాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మహా సంక్షోభానికి పవార్ దూరం .. దేనికి సంకేతం?

మహారాష్ట్ర అధికార కూటమిలో తలెత్తిన సంక్షోభం, పూర్తిగా అది కూటమి అంతర్గత వ్యవహారం. నిజమే, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలతో ఏర్పడిన మహా వికాస్ అఘాడీ (ఎంవిఎస్)లో, కాంగ్రెస్, ఎన్సీపీలలో ప్రస్తుతానికి ఎలాంటి చిక్కులు, సమస్యలు లేవు. కూటమికి సారధ్యం వహిస్తున్న శివసేనలో మాత్రమే, సంక్షోభావం తలెత్తింది. శివసేన ఎమేల్యేలే తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే నిర్వాకం వల్లనే సంక్షోభం తలెత్తింది.. అయినా, కూటమిలోని మూడు పార్టీలను కలిపి ముడి వేసింది మాత్రం, ఎన్సీపీ అధినేత్ శరద్ పవార్. నిజానికి, ఆయన రాజకీయ విజ్ఞత, వివేచన కారణంగానే, కూటమి ప్రభుత్వం ఇంత కాలం మనుగడ సాగించింది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, కూటమి సర్కార్, కర్త. కర్మ, క్రియ అన్నీ పవార్ అండ్ పవార్ ఓన్లీ. ఇందులో ఎవరికీ రెండవ అభిప్రాయం లేదు.  అయితే, ఇప్పడు కూటమిలో ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడి ప్రభుత్వం పతనం అంచుకు చేరినా అదే  శరద్ పవార్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు? ఎందుకు, శిందే తిరుగుబాటు శివసేన అంతర్గత వ్యవహారమని చేతులు దులుపు కున్నారు?  అంతే కాదు, శివసేనలోని రెండు వర్గాల మధ్య దురాన్ని పెంచే విధంగా, పరోక్ష వ్యాఖ్యలు  ఎందుకు చేస్తున్నారు. గువహటిలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు 24 గంటల్లో  ముంబై తిరిగి వస్తే, అఘాడీ ప్రభుత్వం నుంచి వైదొలిగే (బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే) అంశాన్ని పరిశీలిస్తామని, శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన ప్రకటనలో నిజం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ముంబై రప్పించుకునేందుకు వేసిన పాచిక అని పవార్ అర్ధ తాత్పర్యాలు విడమరించి చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? అంటే శివసేన రెండు వర్గాలు కలవడం పవర్ కు ఇష్టం లేదని చెప్పకనే చెప్పారని అనుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, మహా రాష్ట్ర రాజకీయాల్లో ఏది జరిగినా. అందులో ఏదో ఒక కోణంలో పవార్ పాత్ర ప్రమేయం లేకుండా ఉండదని, పవార్  ‘పవర్’ తెలిసిన ఎవరైనా అంగీకరిస్తారు. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుడుతుందేమో కానీ, మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ప్రమేయం లేకుండా, చీమ కుట్టదు, పావు కదలదు, అనేది రాష్ట్ర రాజకీయాలు తెలిసన అందరికీ తెలిసిన విషయమే.  నిజానికి, గత రెండున్నర సంవత్సరాలలో కూటమిలో తలెత్తిన సమస్యలు అన్నింటినీ,  పార్టీలతో ప్రమేయం లేకుండా, పవారే సెటిల్ చేశారు. కానీ, ఈ విషయంలో మాత్రం కాలు కాదు కదా వేలు పెట్టేందుకు కూడా పవార్ సిద్దంగా లేరు. అయ్యేదేదో అసెంబ్లీలోనే అవుతుందని అంటున్నారే కానీ, జోక్యం మాత్రం చేసుకోవడం లేదు. దీంతో ఇప్పడు ఈ మరాఠ యోధుని యోచన ఏమిటి? అనే చర్చ జరుగుతోంది.అందుకు తగట్టుగానే, శివసేన తిరుగుబాటు నాయకుడు శిందేకు ఎన్సీపీ  ఫీలర్స్ పంపడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  అదలా ఉంటే, పవార్ మౌనానికి ఇంకా కారణాలు ఉండవచ్చును కానీ, పరిస్థితి చేయిదాటి పోయిన నేపధ్యంలో వేలు పెడితే చేయి కాల్చుకోవడమే అవుతుందేమో, అనే అలోచనతోనే పవార్ నిశ్శబ్ద ప్రేక్షకుడు (సైలెంట్ స్పేక్టేటర్) పాత్రకు పరిమితం అయ్యారని  అంతర్గత వర్గాల సమచారంగా తెలుస్తోంది. అలాగే, శివసేన రెండు వర్గాల మధ్య, హిదుత్వ, బాలా సాహెబ్ భావజాలం. ఐడియాలజీ విషయంగా పీట ముడి బిగుసుకున్న నేపధ్యంలో ప్రస్తుత పరిస్థితులలో ‘ఆ వివాదంలో ఇరుక్కోవడం శ్రేయస్కరం కాదన్న ఆలోచనతోనూ, మరాఠా యోధుడు మౌనం ఆశ్రయించారని అంటున్నారు. అదలా ఉంటే, తాజాగా శివసేన నాయకుడు, సంజయ్ రౌత్ కేంద్ర మంత్రి ఒకరు, అఘాడీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు శరద్  పవార్’ ప్రయత్నిస్తే ఆయన (పవార్) ఇంటికి వెళ్ళకుండా అడ్డుకుంటామని బెదిరించారని సంచలన వ్యాఖ్య చేశారు. అయితే, ఇందులో నిజం ఉండే అవకాశమే లేదని అంటున్నారు. నిజానికి, పవార్ కు బెదిరుపులే వస్తే, పవార్  ఎందుకు పోలేసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ మంత్రి పేరును ఎందుకు  బయట పెట్టలేదు. పైగా, సంజయ్ రౌత్, ఈ బెదిరింపు పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తమ వైఖరి ప్రకటించాలని కోరారు. అంతేకానీ, పవార్ పై దాడి చేస్తామని బెదిరించి నట్లు ఆరోపిస్తున్న కేంద్ర మంత్రిపై, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గతంలో కేంద్ర మంత్రి నారాయణ రాణే ముఖ్యమత్రి ఉద్దవ థాక్రే’ను చెంప దెబ్బ కొట్టాలని అన్నందుకే మహా రాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆలాగే , పవార్ ను దూషిస్తూ, పేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకే ఓ మరాఠీ నటిని పోలేసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరి ఇప్పడు ఏకంగా ఒక కేంద్ర మంత్రి పవర్ పై దాడి చేస్తామని బెదిరిస్తే , పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, పోలేసులు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అసలు ఆయన పేరును సైతం శివసేన రౌత్ ఎందుకు బయట పెట్టలేదు, అంటే అదొక కట్టు కథ, నిజం కాదు కనుకనే, సంజయ్ రౌత్ ఫేక్ ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అవన్నీ ఎలా ఉన్నా,శరద్ పవార్ వ్యూహత్మకంగానే మౌన వహించారని, పరిశీలకులు అంటున్నారు. పవార్ సాబ్ .. ఏది ఉరికే చేయరు. ఆయన మాటకే కాదు మౌనానికి కూడా ఒక లేక్కుంటుంది ..అంటారు ఆయనేమిటో తెలిసిన సన్నిహితులు.

గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ నిరపరాధి..

సుప్రీంలో కాంగ్రెస్ ఎంపీ జకియా జఫ్రీకి చుక్కెదురైంది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ గతంలో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ నాడు స్పెషల్ మెట్రో పాలటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది.   2002 ఫిబ్రవరి 28న అల్లరి మూకల దాడిలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించిన సంగతి విదితమే.   దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. నాటి అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ,  సహా మరికొందరికి అల్లర్లతో ఎటువంటి సంబంధం లేదని తేల్చింది.  అయితే నరేంద్రమోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఇషాన్ జఫ్రీ సతీమణి జకియా షఫ్రి పలు కోర్లులలో సవాల్ చేశారు. అన్ని చోట్లే ఆమెకు చుక్కెదురైంది. దాంతో 2008 మార్చిలో జకియా షఫ్రి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు సిట్ ను నియమించి అల్లర్ల కేసు దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో సిట్ ఈ అల్లర్లపై విచారణ చేపట్ఠింది. 2010లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దాదాపు 10 గంటల పాటు విచారించింది. అనంతరం సిట్ మోడీ నిరపరాధి అంటూ సుప్రీం కు నివేదిక సమర్పించింది. దీనిని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి 2102లో మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అంతకు ముందు అహ్మదాబాద్ హైకోర్టు కూడా సిట్ నివేదికను సమర్ధించింది.  ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పునే సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది. 

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీయే బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రైపది కుర్ము నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు తన నామినేషన్ పత్రాలు ధాఖలు చేశారు. ద్రౌపది కుర్ము నామినేషన్ దాఖలు కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేబినెట్ మంత్రులు, ఎన్డీయే కూటమి పార్టీల ప్రతినిథులు, ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు నిస్తున్న పార్టీల ప్రతినిధులు. హాజరయ్యారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామపత్రాలను ఆమె దాఖలు చేశారు.అంతకు ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.   ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి   వైపీసీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నామినేషన్‌ కార్యక్రమానికి వైసీపీ  ప్రతినిథులుగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్ సభ సభ్యుడు నేత మిథున్‌ రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందుగా అంటే గురువారమే ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాలోని బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న   ద్రౌపది ముర్ము జన్మించారు. టీచర్‌గా పనిచేసిన ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. కార్యకర్త నుంచి జాతీయ కమిటీలో చోటు పొందే స్థాయికి ఎదిగారు. ఒడిశాలో 2000-2002 మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 29తో గడువు ముగియనుంది. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు.