సంక్షోభం పాతదే.. సమస్యే కొత్తది!
posted on Jun 23, 2022 @ 10:15AM
మహారాష్ట్ర రాజకీయాలలో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా శివసేన .. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. మరాఠీల హక్కుల పరిరక్షణ ప్రధాన ఎజెండాగా పార్టీ పురుడు పోసుకున్నా, పార్టీ వ్యస్థాపక అధ్యక్షడు బాల్ ఠాక్రే మరాఠీల హక్కుల పరిరక్షణ, మరాఠీ అస్తిత్వ వాదాలకు హిదుత్వ ఎజెండాను జోడించి, పార్టీని పటిష్ట పునాదుల మీద నిలబెట్టారు. కాలక్రమలో శివసేన హిందూ మతోన్మాద పార్టీగా ముద్ర వేసుకుంది. ఆ విధంగా సుదీర్ఘ కాలం పాటు, బీజేపీకి సహజ మిత్ర పక్షంగా కొనసాగింది. అయితే,, 2019 ఎన్నికల్లో శివసేన ముఖ్యమత్రి పీఠం కోసం పట్టుపట్టి, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఎ) సకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది.
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు, అధికార కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా, ఉన్న శివసేన, సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే’ కు వ్యతిరేకంగా, పార్టీ సీనియర్ నాయకుడు, ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ముఖ్యమంత్రి, శివసేన అధినేత హిందుత్వ ఎజెండా వదిలేశారన్నది షిండే చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఎంవీఎ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల తర్వాత, ఇప్పడు ఇంత హఠాత్తుగా, షిండే, ఆయన అనుచరులకు, ‘ హిందుత్వం’ ప్రమాదంలో పడిందని గుర్తుకు రావడం, ఏమిటో, ఎంవీఎ అసహజ కూటమి అని ఇంత ఆలస్యంగా షిండేకు తెలియడం ఏమిటో ఎవరికీ అర్థం కాకపోవచ్చును,
కానీ, క్షేత్ర స్థాయి పరిస్థితులు ఆయన్ని తిరుగుబాటుకు ప్రోత్సహింఛి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సైధాంతిక విభేదాల కారణంగానే, షిండే తిరుగుబాటు జెండా ఎగరవేయ వలసి వచ్చిందని ఆయన వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే, శివసేన చరిత్రలో ఇలాంటి సంక్షోభాలు చాలానే ఎదుర్కుందని, సంక్షోభం ఎదురైన ప్రతి సందర్భంలోనూ పార్టీ మరింత బలపడుతూ వచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
అయితే, ప్రస్తుత సంక్షోభం, అందుకు కొంత భిన్నమైనదని, పరిశీలకులు సైతం పేర్కొంటున్నారు. గతంలో శివసేన, బీజేపీ మిత్ర పక్షాలుగా ఉన్నరోజులలోనూ, రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చినా, అందుకు సిద్ధాంత విబేధాలు ఎప్పుడూ కారణం కాలేదని పరిశీలకు గుర్తు చేస్తున్నారు. కానీ మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పార్టీల మధ్య సిద్ధాంత విభేదాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులను బేరీజు వెసుకున్న తర్వాతనే షిండే తిరుగుబాటు చేశారని, అంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుత సంక్షోభం నుంచి శివసేన బయట పడడం అనుమానమే అంటున్నారు. అలాగే, గతంలో తిరుగుబాట్లకు ప్రస్తుత తిరుగుబాటుకు మధ్య మరో తేడా కూడా ఉందని అంటున్నారు. గతానికి భిన్నంగా, ఈసారి పార్టీ అధికారంలో ఉండగా నాయకత్వంపై శివ సైనికులు తిరుగుబాటు చేయడం పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో మూడుసార్లు శివసేన లో సంక్షోభం ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఉన్నప్పుడు చోటుచేసుకోగా.. ప్రస్తుతం మాత్రం ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే అధికారంలో ఉన్న సయమంలో నాలుగోది చోటుచేసుకుందని,
అందుకే ప్రస్తుత తిరుబటును భిన్నంగా చూడాలని పరిశీలకులు అంటున్నారు. కాగా శివసేనకు 1991లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనను కాదని, మనోహర్ జోషిని నియమించండతో పార్టీ సీనియర్ ఓబీసీ నేత ఛగన్ భుజభల్ ,పార్టీని వదిలి ఎన్‌సీపీలో చేరారు. ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్న ఆయన అఘాడీ ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత 2005లో మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు అనంతరం కాంగ్రెస్‌కూ రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాణె కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.
అలాగే, 2006లోనూ శివసేనకు మరో షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే సోదరుడు (కజిన్) రాజ్‌ఠాక్రే. శివసేనను వీడి మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన పేరుతో సొంత కుంపటి పెట్టు కున్నారు.అయితే, తన పోరాటం శివసేన నాయకత్వం (బాల్ ఠాక్రే ) మీద కాదని ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్న కొందరిపైనే ( ఉద్దవ్ ఠాక్రే ) మీదనేనని రాజ్‌ఠాక్రే అప్పట్లో చెప్పుకొచ్చారు
తాజాగా ఏక్‌నాథ్ షిండే రూపంలో మరోసారి తిరుగుబాటును ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అయితే, తమకు శివసేన నాయకత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని.. కేవలం సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్, ఎన్‌సీపీల తీరు వల్లే రెబల్స్‌గా మారాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉందని షిండే వర్గం చెబుతోంది. మరో వంక తాజా సమాచారం ప్రకారం, ఉద్దవ్ ఠాక్రే ఏ క్షణంలో అయినా రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది.