ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టిఏ దాడులు
కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన ఘటనతో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తున్నారు.
రాజేంద్రనగర్, ఎల్బీనగర్ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు.
బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు. అలాగే శుక్రవారం అర్థరాత్రి హయత్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల తో పాటు హైదరా బాద్ శివారు ప్రాంతాలలో కూడా రవాణాశాఖ అధికారులు దాడులు కొనసా గుతున్నారు.
శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవే పైన కూడా తనిఖీలు నిర్వహించారు.
అంతేకాకుండా కెరళా, తమిళ నాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, పాండి చ్చేరి, నాగాల్యాండ్, ముంబాయి నుండి హైదరాబాద్ వచ్చే వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ చేపట్టిన ఈ దాడులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఆర్టీఏ తీరు ఉందంటూ పెదవి విరుస్తున్నారు.