ఏపీకి ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్
posted on Oct 25, 2025 @ 2:52PM
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పుటికీ అంతలోనే ఉన్న పళంగా వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.
మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. ‘మొంథా’ తుపాను.. రాష్టంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో 90-110 కి.మీ. వేగంతో గాలుల వీస్తాయి. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ప్రభావం ఉండనుంది. తీర ప్రాంత జిల్లాల్లో 28,29 తేదీల్లో సెలవులు ప్రకటించాలని అధికారులు సూచించారు.