పెట్టుబడులతో వస్తాం.. ఏపీపై యూఏఈ పారిశ్రామికవేత్తల ఆసక్తి
posted on Oct 25, 2025 @ 9:50AM
ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆవిష్కరించిన తీరు, పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న నమ్మకాన్ని కలిగించిందని అంటున్నారు. తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం పాతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు రంగాలకు చెందిన సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు.
అదే విధంగా యూఈఏ ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులతో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఏపీలో ఏయే ప్రాంతాలలో ఏయే రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో కూలంకషంగా వివరించారు. ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఏఐ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వారి కళ్లకు కట్టారు. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయనే అంశానికి సంబంధించిన వివరాలను పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగం, ఎరో స్పేస్, డ్రోన్ సిటీ, హార్టికల్చర్, సెమీ కండక్టర్ వంటి పరిశ్రమలు, గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు..ఆక్వా కల్చర్, టూరిజం రంగాలలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని సీఏం అక్కడి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లకు వివరించారు.
ఇక రాజధాని అమరావతి కేంద్రంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నామని, అమరావతి, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామనీ, పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని భావిస్తే, అవసరమైతే పాలసీల్లో మార్పులు తేవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలిపారు. భారత్-యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రధానమంత్రి చొరవను సీఎం తన పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు ప్రజంటేషన్ కు ముగ్ధులైన యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి, తమ సంస్ధలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు.
ఇక చివరిగా గల్ఫ్ లోని తెలుగు వాళ్లతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఓమన్, బెహ్రయిన్ వంటి 10 గల్ఫ్ దేశాల నుంచి వేల మంది పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన ఊహించిన దానికన్న సక్సెస్ అయ్యింది. భారీ పెట్టుబడులు వస్తాయన్న ధీమాతో ఆయన తన పర్యటన ముగించి స్వదేశానికి తిరిగి వచ్చారు.