వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ
posted on Oct 25, 2025 @ 9:32AM
ఓలా, ఉబెర్ వంటి రైడ్-హెయిరింగ్ సంస్థలకు పోటీగా భారతదేశ సహకార రంగం భారత్' బ్రాండ్‌తో కొత్త టేక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. వచ్చే నెల నుంచే ఈ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. 300 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా డ్రైవర్లను నియమించుకుని.. డ్రైవర్లకు మెరుగైన రాబడిని అందించడం, ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన, సరసమైన సేవలను అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోనికి తీసుకువస్తున్నారు. భారత్ బ్రాండ్ కింద ట్యాక్సే సర్వీసులను 8 సహకార సంస్థలు నిర్వహించనున్నాయి. మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి.
ఇందులో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టి లైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఫ్కో), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్), క్రిషాంక్ భారతీ కోపరేటివ్, ఎన్‌డీడీబీ, నాబార్డ్, ఎన్‌సీఈఎల్ సహా మొత్తం ఎనిమిది సహకార సంఘాలు ఉన్నాయి.
ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా రానున్న ఈ భారత్ టేక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్నాయి. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి పాతిక శాతం చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇటు డ్రైవర్లకూ, అటు ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్న భారత్ టేక్సీ సేవలు ఈ ఏడాది చివరి నుంచీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.