చంద్రబాబు.. మనిషక్కడ.. మనసిక్కడ!
posted on Oct 24, 2025 @ 2:28PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. క్షణం తీరిక లేకుండా అక్కడ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులతో చర్చలు జరుపుతున్నారు. రోజుకు తొమ్మదికి పైగా సమావేశాలు, సదస్సులతో ఊపిరి తీసుకునే తీరిక కూడా లేనంతగా ఉన్నారు. అయినా ఆయన చిత్తం అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలపై గురువారం (అక్టోబర్ 23)న అక్కడి నుంచే ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
అంతేనా రాష్ట్రంలో మంత్రులు, అధికారులతో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. శుక్రవారం (అక్టోబర్ 24) ఉదయం కర్నూలు శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ, డీఐజీ, కర్నూలు కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. అధికారులు, మంత్రులు దగ్గరుండి ఈ పనులన్నిటినీ పర్యవేక్షించాలన్నారు. అలాగే ప్రమాదఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.