కార్ పూలింగ్ తో ట్రా‘ఫికర్’కు చెక్
posted on Oct 25, 2025 @ 4:42PM
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఓ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడాన్ లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా మారడంతో ఆర్టీసీ ఐటీ కంపెనీల ముందుకు ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది. అందుకు ఐటీ కంపెనీలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆర్టీసీ ప్రతిపాదన ఏంటంటే.. ప్రజా రవాణాను విస్తరించేందుకు ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి ఐటీ కంపెనీకి ఒక ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతిపదికన కేటాయించడం ద్వారా ఉద్యోగులు సొంత వాహనాలకు బదులుగా బస్సులలో వచ్చేలా ప్రోత్సహించాలన్నది ఒక భాగం కాగా, కార్ పూలింగ్ అన్నది రెండో భాగంగా ఆర్టీసీ ప్రతిపాదన చేసింది.
ఇందులో భాగంగా ముందుగా మైండ్ స్పేస్ ప్రాంతంలో వన్ బస్ పర్ కంపెనీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సైబరాబాద్ పోలీసులు కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు సమసిపోతాయని అంటున్నారు. సో ముందుగా మైండ్ స్పేస్ ఏరియాలో వన్ బస్ పర్ వన్ కంపెనీ పాలసీలో భాగంగా ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే 250 కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సైబరాబాద్ పోలీసులు ఓ సర్వే కూడా చేశారు. ఆ సర్వే ప్రకారం ఐటీ హబ్ ప్రాంతాలలో పనిచేసే చాలామంది ఉద్యోగులు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఒకే ఏరియాలో ఉంటూ కూడా ఎవరికి వారుగా సొంత వాహనాల్లో వస్తున్నారు. ఆ కారణంగా పీక్ అవర్స్ లో ట్రాఫిక్ సమస్య తీవ్రమౌతోంది.
ఇలా ఒకే ఆఫీసులో పని చేస్తూ ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు కార్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకూ పరిష్కారమౌతుందని ఈ సర్వే ద్వారా తేలిందని అంటున్నారు. అలాగే మైండ్ స్పేస్ ప్రాంతంలోని కంపెనీలలో పని చేసే ఉద్యోగులు దాదాపు 250 కార్లలో తమతమ కార్యాలయాలను హాజరౌతున్నారని సర్వేలో తేలింది. ఈ కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేస్తే తక్కువలో తక్కువ పాతిక శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమౌతుందని అంటున్నారు.
అంటే వన్ బస్ పర్ వన్ కంపెనీ పద్ధతిలో ఐటీ ఉద్యోగులు సొంత కార్లకు ప్రత్యామ్నాయంగా బస్సులను ఆశ్రయించేలా చేస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు కడతేరుతాయని అంటున్నారు. అదే సమయంలో ఆర్టీసీ తన బస్సులను ఐటీ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం కలుగుతుందంటున్నారు. త్వరలోనే దీనిపై ఐటీ కంపెనీలు, ఉద్యగులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.