దేశంలో ఏపీయే నంబర్ వన్.. పెట్టుబడులతో తరలిరండి.. లోకేష్

దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఏపీ రెండో స్థానంలో ఉంది.. కానీ అతి త్వరలోనే నంబర్ వన్ స్థానినికి చేరుకుంటుంది. ఈ మాట తన ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో అన్న మాట. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో తరలిరావాలని నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అఅండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్ బోర్న్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్  రౌండ్ టేబుల్ సమావేశంలో  లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులకు 2029 నాటికి ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు లీప్  పేరుతో సంస్కరణలు అమలు చేస్తున్నామని  వివరించారు. ప్రధానంగా తాము 15 రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పిన ఏపీ ఐటీ మంత్రి..  వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్ వన్ అవుతామని గట్టిగా చెప్పారు.  ఏపీతో చేతులు కలిపి మీ ప్రాజెక్టులను సక్సెస్ చేసుకోవాలని చెప్పారు. అలాగే విశాఖలో జరగనున్న  గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. 

కాగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ను  ఒక స్టార్టప్ స్టేట్ గా అభివర్ణించారు. చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్న ఆయన  ఏపీ కేవలం ఎంవోయూలు కుదుర్చుకోవడంతో సరిపెట్టదనీ, ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషి చేస్తుందని ఉదాహరణలతో సహా వివరించారు. ఒక సారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించుకుని మాతో చేతులు కలిపితే.. అది ఇక ఎంత మాత్రం కేవలం మీ ప్రాజెక్టుగా ఉండదనీ, అది మన ప్రాజెక్టు అవుతుందని అన్నారు. 

టోల్ గేట్లకు చెల్లు చీటీ!

ఇక టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఉండవు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ గేట్లనూ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే టోల్ వసూళ్లు మాత్రం ఆగవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   ఇక నుంచి ఏఐ,  శాటిలైట్  ఆధారిత సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లు జరిగేలా చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈ విషయాన్ని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ఈ నూతన టోల్ విధానం  పూర్తిగా ఉపగ్రహ, ఏఐ సాంకేతికతలపై ఆధారపడి ఉంటుందన్నారు. దీని వల్ల వాహనదారులు  టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. దీని వల్ల వాహనదారులకు  ఇంధనం ఆదా అవడమే కాకుండా,  ప్రభుత్వానికి అదనంగా ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు.   ఈ విధానంలో టోల్ గేట్లకు బదులుగా గాంట్రీ గేట్స్ నిర్మిస్తారు.  వీటిపై   హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చడం ద్వారా,  వాహనాలు గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. ఆ వాహనం  నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది.  దీంతో టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయని గడ్కరీ తెలిపారు.

ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ విఫలయత్నం!

ఆస్ట్రేలియా రాంకీ బీచ్ కాల్పుల నిందితుడు ఆస్ట్రేలియా-భారత్ మధ్య తరచూ రాకపోకలు ఆస్ట్రేలియా సిడ్నీ రాంకీ బీచ్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో హతమైన ఐసిస్ అనుబంధ ఉగ్రవాది సాజిత్ అక్రమ్  గతంలో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.  ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి సారీ అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిపాయి.   హైదరాబాద్‌లోని జోచిచాక్ అల్ హసన్ కాలనీలో నివసిస్తున్న సాజిత్ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత 27 ఏళ్లుగా సాజిత్ హైదరాబాద్, ఆస్ట్రేలియా మధ్య  రాకపోకలు సాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణాల వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో  బీఏ పూర్తి చేసిన సాజిత్ అక్రమ్, 1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000లో అక్కడే బియాన్ వెనెస్సా గోసాను వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ కావడంతో, 2001లో సాజిత్ తన వీసాను పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నాడు. తదనంతరం 2008లో రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందిన సాజిత్, పీఆర్ హోదాను కొనసాగించాడు. పీఆర్ కలిగిన వారికి ఐదేళ్లపాటు ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చి వెళ్లే అవకాశం ఉండటంతో, అతడు ఈ వీసా ద్వారా దేశంలో తన ఉనికిని కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు, పాస్‌పోర్టు, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలంటే పౌరసత్వం అవసరం. ఈ నేపథ్యంలో సాజిత్ అక్రమ్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వానికి దరఖాస్తు చేసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. అయితే ప్రతి దరఖాస్తు తిరస్కరణకు గురైందని, తిరస్కరణ కారణాలను సాజిత్ ఎప్పుడూ తమతో పంచుకోలేదని అతడి కుటుంబ సభ్యులు  తెలిపారు. సాజిత్ కుమారుడు నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో జన్మించడం తో అతడికి ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు లభించాయి.  2003లో తొలిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిత్, కుటుంబీకుల సమక్షంలో సంప్రదాయ నిఖా చేసుకున్నాడు. 2004లో తన కుమారుడిని బంధువులకు చూపించేందుకు మరోసారి నగరానికి తీసుకువచ్చాడు. 2006లో తండ్రి మృతి అనంతరం కుటుంబీకులను కలుసుకుని వెళ్లిన సాజిత్, 2018లో వారసత్వంగా తనకు వచ్చిన శాలిబండ లోని ఇంటిని విక్రయించేం దుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ ఆస్తి విక్రయం తో వచ్చిన డబ్బుతో ఆస్ట్రే లియాలోని బోసరగ్ ప్రాంతం లో ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరిలో తన వాటాను కూడా భార్య పేరు కు బదిలీ చేసినట్లు సమా చారం. 2012 ఫిబ్రవరిలో సాజిత్ అక్రమ్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చి కుటుం బీకులను కలుసుకుని వెళ్లాడు. అదే సమయంలో పదేళ్ల కాలపరిమితికి సంబం ధించిన పాస్‌పోర్టు రిన్యూ వల్ కూడా చేయించుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సిడ్నీ కాల్పుల ఘటన నేపథ్యంలో సాజిత్ అక్రమ్ గత జీవితం, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, సంబం ధాలపై భారతీయ, ఆస్ట్రే లియా భద్రతా సంస్థలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌  కేసు మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేశారు.  ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి  ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్​ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్​అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు తెలుస్తోంది 

అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. భారత్ హైకమిషన్ కార్యాలయంపై దాడి

బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి.   బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నెల 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల  15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హాదీ బుధవారం (డిసెంబర్ 18) రాత్రి మరణించాడు. దీంతో ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి హింసాకాండకు తెగబడ్డారు. చిట్టగాంగ్ లోని భారత హైకమిషన్ కార్యాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అలాగే దేశ వ్యాప్తంగా పలు నగరాలలో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఉద్రిక్త పరిస్థితుుల నెలకొన్నాయి.  రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలూ   దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా సంస్థలపై కూడా ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు.  అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో  డైలీ స్టార్' కార్యాలయాలకు నిప్పు పెట్టారు.    అలాగే  అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని, రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.   

ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ

దివంగత ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు వీరాభిమాని, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న  ఎన్టీఆర్ రాజు  బుధవారం (డిసెంబర్ 17) తిరుపతిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం (డిసెంబర్ 18) తిరుపతిలో జరిగాయి.   రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కు అఖిల భారత కార్యదర్శిగా ఎన్టీఆర్ రాజు పని చేశారు. ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకీ నిస్వార్థంగా సేవలందించారు.  ఉన్నత పదవులు ఇస్తానని స్వయంగా ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా, మీ అభిమానిగా ఉండటమే తనకు చాలని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్ రాజు. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా వద్దని తిరస్కరించి, ఆజన్మాంతం ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటానని చెప్పిన ఉన్నత వ్యక్తి ఎన్టీఆర్ రాజు. పదవులు కాదు.. ఆదర్శాలను వీడకపోవడం, అభిమానించే వ్యక్తికి అండగా నిలవడమే ముఖ్యమని చాటిన ఎన్టీఆర్ రాజు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలస్తుంది. అటువంటి ఎన్టీఆర్ రాజు అంత్యక్రియలకు   నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ  హాజర య్యారు. నందమూరి కుటుంబం తరఫున ఎన్టీఆర్ రాజు పార్ధివ దేహానికి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలలో పాల్గొని పాడె మోశారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకీ, నందమూరి కుటుం బానికీ తీరని లోటని వారన్నారు.  నందమూరి వీరాభిమానిగా ఎన్టీఆర్ రాజు ఎనలేని సేవలందిం చారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటున్నట్టు పేర్కొన్నారు. 

పెరిగిన చలి తీవ్రత...స్కూల్స్ టైమింగ్స్ మార్పు

  తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం వరకు బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగటంతో జిల్లా కలెక్టర్ స్కూల్స్ టైమింగ్స్ మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 4 :15 గంటల వరకు ఉన్న బడి సమయాలను ప్రస్తుతం 09:40 గంటల నుంచి సాయంత్రం 04 :30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ స్కూల్ టైమింగ్ మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత మూడు రోజుల నుంచి సాధారణం కంటే 4 డిగ్రీలకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట కనీస జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు

భూవివాదాల్లో నేతల జోక్యం సంహించం : డిప్యూటీ సీఎం పవన్

  భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయిని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ జోన్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు.  విశాఖ, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని, ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి కలెక్టర్లును కోరారు. సౌండ్ పొల్యూషన్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ప్రస్తావించారు. మతం పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్థనలు చేయడం తప్పుని పేర్కొన్నారు. ఎక్కడైనా కేవలం చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే అమలులో ఉంటాయి డిప్యూటీ సీఎం తెలిపారు.  నిర్దేశించిన డెసిబుల్స్ లోనే సౌండ్ ఉండాలి. ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు పవన్ తెలిపారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చేందుకు అన్ని రిజిస్ట్రేషన్, ఆస్తి పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం వివరించారు. 20-30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చివరగా, జిల్లాల వారీగా రెవెన్యూ రాబడులపై దృష్టి సారించాలని, పన్ను ఎగవేతలు, మానిప్యులేషన్ జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆదాయం కోల్పోవడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.   

తెలంగాణ గ్రూపు-3 ఫలితాలు విడుదల

  తెలంగాణ గ్రూపు-3 ఫలితాలను టీజీపీఎస్‌సీ విడుదల చేసింది.  మొత్తం 1370 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ వెల్లడించింది. అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికెషన్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే ఫలితాలు విడుదల చేసింది. జనరల్‌ ర్యాంకుల జాబితాను కమిషన్‌ ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.  పురుషుల్లో టాప్‌ ర్యాంకర్‌కు 339.24 మార్కులు, మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులొచ్చాయి.  2022 లో 1388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. కోర్టు కేసులు, గ్రూప్-1,2 వివాదాల కారణంగా గ్రూప్-3 ఫలితాలు ఆలస్యంగా విడుదల చేశారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

  ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు అనుమతించిన విషయం తెలిసిందే... ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుపై వారం రోజులపాటు సాగిన కస్టోడియల్ విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు రేపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవు తున్నారు. అయితే అధికారులు ప్రభాకర్ రావు ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన సమయంలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, నోరు మెదపలేదని అధికా రులు పేర్కొంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యంత కీలక అంశాలను ఆయన దాటవేస్తున్నారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును మరోసారి కోరే అవకాశ ముందని సమాచారం....ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే ప్రభాకర్ రావును ఇంకా కస్టడీలో ఉంచి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. సిట్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది. ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా మారనుంది.

నాటు సారాను అరికట్టాలి కలెక్టర్లకు... సీఎం చంద్రబాబు సూచన

  అమరావతిలో రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్  ముగిసింది. ముగింపు ఉపన్యాసంలో సీఎం  చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరీకరణ, పీపీపీ విధానాలు, విద్యుత్ రంగం, పాలనలో సంస్కరణలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురాగలిగామని, రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యుత్ రంగంపై మాట్లాడుతూ యూనిట్‌కు రూ.1.20 మేర కొనుగోలు ధర తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.  పీపీఏల రద్దుతో గతంలో విద్యుత్ వ్యవస్థ నాశనం అయ్యిందని, డిస్కంలు–ట్రాన్స్‌కోలపై రూ.1,25,633 కోట్ల భారం పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రుణ నిర్వహణను సమర్థంగా చేపట్టి, అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను రీషెడ్యూలింగ్ చేస్తున్నామని తెలిపారు. పీపీపీ వైద్య కళాశాలల అంశంపై సీఎం ఘాటుగా స్పందించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ విధానంలో చేపట్టే ప్రాజెక్టులు ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయని, నిబంధనలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రైవేటు సంస్థలు నిర్వాహకులుగా మాత్రమే ఉంటాయని, సీట్లు పెరుగుతాయే తప్ప ఫీజులు పెరగవని భరోసా ఇచ్చారు. 70 శాతం వరకు ఎన్టీఆర్ వైద్యసేవల కింద ఉచిత చికిత్స అందుతుందని, పీపీపీ మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధమవుతాయని అన్నారు. ఈ విషయంలో బెదిరింపులు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పాలన, శాంతిభద్రతలపై మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లో నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులను సహించవద్దని స్పష్టం చేశారు. నేరాల దర్యాప్తులో వేగం పెంచాలని సూచించారు. పాలనలో డిజిటలీకరణపై సీఎం కీలక ప్రకటన చేశారు. జనవరి 15 నుంచి అన్ని శాఖల ఫైళ్లు, ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు.  ఇప్పటివరకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, ఇకపై ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఎస్క్రో ఖాతా విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణం, నేరాల రేటును తగ్గించగలిగామని, నాటు సారా నియంత్రణకు తీసుకొచ్చిన ‘మార్పు’ ప్రాజెక్టు రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. సారా తయారీదారులకు పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. తిరుమల ప్రసాదంలో నాణ్యతను పునరుద్ధరించామని, అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు.  రాష్ట్రం 18 నెలల్లోనే రికవరీ అవుతుందని, పునర్నిర్మాణం సాధ్యమవుతుందని తాను కూడా ఊహించలేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నింటికంటే ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అత్యంత విజయవంతంగా జరిగిందని ప్రశంసించారు.