కిలో టమోటా రూ. 600లు.. ఎక్కడో.. ఎందుకో తెలుసా?
posted on Oct 25, 2025 @ 11:23AM
కిలో టామోటా ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు. ఈ మాట వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారా? ఈ ధర మన రాష్ట్రంలో, మన దేశంలో కాదు లెండి. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ లో. ఔను పాకిస్థాన్ లో ఇప్పుడు టమోటా ధర జనం గుండెల్లో మంట పుట్టిస్తోంది. గింజ మెతుకు దొరకడమే అక్కడ గగనంగా మారిపోయింది. టమోటాల ధరైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే.
ఆ రెండు దేశాల సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దులను ఈ నెల 11 నుంచి మూసేశారు. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితి పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు దేశాల ప్రజలూ కూడా ఆహారం, ఔషధాల కొరతతో అల్లాడుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు.. ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలూ చుక్కలనంటాయి. ఇరు దేశాల మధ్యా ఘర్షణలకు ముందు పరిస్ధితితో పోలిస్తే పాకిస్థాన్ లో అన్ని వస్తువుల ధరలూ కనీసం ఐదు రెట్లు పెరిగాయి. ఆ దేశంలో ప్రస్తుతం కిలో టమాటాల ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు పలుకుతోంది.
సాధారణంగా పాక్- అఫ్గాన్ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఈ కారణంగా అఫ్గాన్ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు ఎందుకూ పనికిరాకుండా పాడైపోయాయి. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయి.
గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్‌లోని దోహాలో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఇందులోభాగంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్ఠంభనకు తెరపడలేదు.