కర్నూలు బస్సు ప్రమాదం.. లగేజీ క్యాబిన్లో వందల ఫోన్లు!
posted on Oct 25, 2025 @ 10:43AM
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద తీవ్రత ఇంత భారీగా ఉండటానికి డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోయి డోర్లు తెరుచుకోకపోవడం ఒక కారణమైతే.. బస్సు లగేజీ క్యాబిన్ లో ఉన్న ఫోన్ల పార్శిల్ ప్రధాన కారణమని అంటున్నారు. బస్సు లగేజీ క్యాబిన్ లో దాదాపు 46లక్షల రూపాయల విలువైన ఖరీదైన సెల్ ఫోన్ లను బస్సులో పార్సిల్ సర్వీసుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఫొరెన్సిక్ టీమ్ గుర్తించింది. బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగగానే.. ఆ వేడికి ఫోన్లలో బ్యాటరీలు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయి.. మంటలు వేగంగా వ్యప్తి చెందాయి. ఆ కారణంగానే బస్సులోని ప్రయాణీకులు బయటకు రావడం కష్టమైందంటున్నారు. కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి.
హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం ఓ కారణమని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. మొబైల్ ఫోన్ల బ్యాటరీలతో పాటు బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయాయనీ.. ఈ మంటల తీవ్రతకు బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.