ఇది పైరసీ వ్యవహారం కాదు, కుట్ర: పవన్ కళ్యాణ్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ఒక్క రోజు ముందుగా ‘యూ ట్యూబ్’ లోకి అప్ లోడ్ చేయబడింది. అంతే గాక, సినిమా సీడీలు కూడా కృష్ణ జిల్లా పెడన మార్కెట్లోకి కూడా వచ్చేసాయి. పోలీసులతో కలిసి పవన్ అభిమానులు ఆ సీడీలను మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకోన్నపటికీ, అప్పటికే ఇంటర్నెట్ లోకి కూడా అప్ లోడ్ అయిపోవడంతో, అది శరవేగంగా ప్రపంచంలో నలుమూలలకి చేరిపోయింది. దాదాపు మొత్తం సినిమా అంతా విడుదలకు ముందే వేలాది మంది చూసేయడమే గాక, దానిని తమ స్నేహితులతో, బంధువులతో కూడా పంచుకొన్నారు. ఆ సినిమా నెట్లో మరింత విస్తరించకుండా ఉండేందుకు పోలీసులు చాలా చర్యలు తీసుకోన్నపటికీ, అప్పటికే జరుగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక ఆ సినిమా భారీగా నష్టపోవడం ఖాయమని అందరూ భావించారు.   కానీ పవన్ కళ్యాణ్ కి ప్రజలలో ఉన్నప్రత్యేక ఆదరాభిమానాల వల్ల ‘అత్తారింటికి దారేది’ సినిమా సూపర్ హిట్ అవడమే గాక కలక్షన్స్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరబాదులో జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఇది పైరసీ వ్యవహారం కాదు. సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తులు చేసిన కుట్ర. వారు సినిమా విడుదలకు రెండు నెలలు ముందు నుండే కాపీలను సిద్దం చేసి పెట్టుకొని, సినిమాను దెబ్బ తీయాలనే ఆలోచనతో ఉద్దేశ్యపూర్వకంగానే ఆ కాపీలను సరిగ్గా సినిమా విడుదలకు ముందు, ఇంటర్నెట్లోకి అప్ లోడ్ చేసారు. అదేవిధంగా మార్కెట్లోకి కూడా కాపీలను రిలీజ్ చేశారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా కొందరు చేసిన కుట్ర అని నాకు తెలుసు. దీని వెనుక ఎవరెవరున్నారో, వారి పేర్లతో సహా నేను చెప్పగలను. సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు, సినిమా రిలీజ్ కి చాలా రోజుల ముందు నుండే, నా సినిమా చాలా బాగుందని నన్ను అభినందిస్తున్నారంటే, ఆ కాపీలు ఎంత మంది షేర్ చేసుకొన్నారో అర్ధం అవుతోంది. ఒకరిద్దరయితే వారిని తప్పకుండా నిలదీసేవాడిని. కానీ ఇది తప్పని తెలిసినా కూడా అనేకమంది దానిని చూసి నన్నుఅభినందిస్తుంటే ఎందరిని నిలదీయగలము? కొందరు వ్యక్తులు సినీపరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారు. మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తాట తీస్తాము. ఈ కుట్రకి పాల్పడిన వ్యక్తులు ఎంత పెద్దవారయినా వదిలిపెట్టేది లేదు,” అని హెచ్చరించారు.

శ్రీహరికి టాలీవుడ్ ఘననివాళి.. జూనియర్ కంటతడి

      తెలుగుతెర రియల్ స్టార్ శ్రీహరి బౌతికఖాయానికి నివాళులు అర్పించడానికి తెలుగు సినీ పరిశ్రమ తరలివచ్చింది. అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్జీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లిలు ఆవేదన ఆపుకోలేక కంటతడి పెట్టడంతో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాంచరణ్ తేజ, దిల్ రాజు, నల్లమల్లపు బుజ్జి, సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, సుమన్, కృష్ణం రాజు, తరుణ్, వందేమాతరం శ్రీనివాస్, జగపతిబాబు, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు దాసరి నారాయణ రావు, వేణుమాధవ్ తదితరులు ఉన్నారు.     శ్రీహరి అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఫాంహౌస్‌లో జరుగుతాయి. అంతకుముందు ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌లో ఉంచనున్నారు. శ్రీహరి పార్థివ దేహానికి  బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూతురు అక్షర సమాధి పక్కనే అంత్యక్రియలు జరుపుతున్నట్లు దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సికల్యాణ్‌ తెలిపారు.

అస్తమించిన షేర్ ఖాన్

  సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ అని పేరుతెచ్చుకున్న ఏకైక నటుడు శ్రీహరి. హీరో, విలన్, కమెడియన్ అనే తేడా లేకుండా అన్ని పాత్రలలో నటించి, ప్రేక్షక మనసు దోచుకున్న నటుడు శ్రీహరి ఇకలేరు. శ్రీహరి గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో భాధ పడుతున్నాడు. అయితే ఈరోజు సాయంత్ర సమయంలో శ్రీహరి లీలావతి హాస్పిటల్(ముంబాయి)లో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ కు గురవుతున్నారు. ఉక్కు మనిషిలాగా ఉండే శ్రీహరి ఇలా హఠాత్ మరణంపై ఎవరు కూడా కోలుకొని పరిస్థితుల్లో ఉన్నారు. శ్రీహరి ఒక్క తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ తో కలిసి నటించిన "జంజీర్" చిత్రంతో బాలీవుడ్ లో కూడా నటన పరంగా శ్రీహరికి మంచి స్పందన వచ్చింది. మన అని అనుకున్న మన షేర్ ఖాన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అనుకుంటేనే భాదగా ఉంది. "మగధీర"లో శ్రీహరి చెప్పిన "నువ్వు ఇపుడు అస్తమించవచ్చు. కానీ ఎదో ఒక రోజు ఈ చీకటి కడుపులు చీల్చుకుంటూ మళ్ళీ పుడతవురా..". శ్రీహరి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ... తెలుగువన్.కామ్  

వెండితెరపై రసిక బాపు

  బాబాలు, స్వాములు అంటూ చెలామణి అయ్యే దొంగ బాబాల గురించి ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికి వస్తున్నాయి కూడా. అయితే తాజాగా 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలతో జైలు కెళ్ళిన గురువు ఆశారాంబాపుపై కూడా ఓ సినిమాతెరకెక్కనుంది. మనోజ్ శర్మ దర్శకత్వంలో "చలో గురూ హోజా షురూ" అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో ఆశారాం పాత్రను నటుడు హేమంత్ పాండే నటించనున్నాడు. దొంగబాబాలు, గురూజీలు, స్వాముల ఇతి వృత్తంగా ఈ సినిమా ఉంటుందని, మతాలను బిజినెస్ గా మార్చుకున్న బాబాల బాగోతాన్ని ఇందులో బయటపెడతామని, నవంబర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అయన తెలిపాడు.

పైసలొద్దు చెప్పులే కావాలంటున్న భామ

  అందం, అభినయంతో అభిమానుల గుండెల్ని కొల్లగొట్టిన హీరోయిన్ రమ్య ఇటీవలే లోక్‌‌సభ సభ్యురాలుగా గెలుపొందిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ అమ్మడు తనకున్న గ్లామర్ ఇమేజ్ ను తన ప్రజలకు సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా కొత్తగా ఆలోచిస్తుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడిని ఒక పాపులర్ చెప్పుల కంపెనీ తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారంట. అయితే రమ్య మాత్రం తనకు రెమ్యునరేషన్ కాకుండా ఒక లక్ష జతల చెప్పులను ఇస్తే చాలని చెప్పిందట. దానికి కనీసం 50 వేల జతల చెప్పులు ఇచ్చేందుకు ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఇంతకీ ఆ చెప్పులు ఎందుకని అనుకుంటున్నారా...? తన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఆశతో....తన నియోజకవర్గంలోని మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆ చెప్పులను అందజేయాలని అనుకుందట. మొత్తానికి ఈ విధంగానైనా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకుంది.

కలిసుండటమెందుకు అంటున్న వెంకీ..?

  "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం విజయం తర్వాత వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ తో కలిసి "మసాలా" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే వెంకటేష్ మరో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకటేష్, రామ్ చరణ్ కలిసి బాబాయ్,కొడుకులుగా నటించబోతున్నారు. ఈ చిత్రానికి "కలిసుండటమెందుకు" అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు. ఇందులో వెంకటేష్ అన్నగా నాగబాబు నటించనున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

గ్యాంగ్ స్టార్ కు స్వస్తి చెప్పిన వర్మ

  "అంతా నా ఇష్టం" అనే విధంగా ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అసలు ఇప్పటి వరకు వర్మ తీసిన ప్రతి గ్యాంగ్ స్టార్ చిత్రం, లేక అండర్ వరల్డ్ సినిమాలు అన్ని కూడా ఎక్కడో ఒక దగ్గర తనకు తెలిసిన లేదా దొరికిన అంశాలపైనే తెరకెక్కించాడు."రక్తచరిత్ర", "సర్కార్", "కంపెనీ", "సత్య" వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం "సత్య 2". కానీ ఈ చిత్రం మాత్రం వర్మ తన మనసులో చివరిసారిగా ఒక గ్యాంగ్ స్టార్ ఎలా ఉండాలో అనుకోని తీసాడంట. అందుకే ఈ చిత్రం తర్వాత గ్యాంగ్ స్టార్ నేపధ్యం ఉన్న చిత్రాలను తీయకుడదని వర్మ నిర్ణయించుకున్నాడు. ఏదైనా ఒక కొత్త రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని వర్మ అనుకుంటున్నాడట. ప్రస్తుతం వర్మ మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు.

వెనక్కి తగ్గిన విష్ణు దూసుకేల్తా

  మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ రాష్ట్రంలో ఉద్యమాల ప్రభావాల వల్ల ఈ చిత్రాన్ని అక్టోబర్ 17కి వాయిదా వేసినట్లు సమాచారం. మరి ఈ ఉద్యమ సెగకు ఈ చిత్రం ఇంకేంతవరకు వెనక్కి వెళ్తుందో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రంలో విష్ణు సరసన "అందాల రాక్షసి" ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

కొరివితో తలగోక్కుంటున్న కమల్‌ హాసన్

      విశ్వరూపం సినిమాను మరోసారి వివాదాలు చుట్టుము్టేలా ఉన్నాయి. తొలి భాగంతో వివాదాస్పదమైనా మంచి సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ ఇప్పుడు మరోసారి పాత వివాదానికే తెరతీసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా విశ్వరూపం 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వరూపం.. అత్యంత వివాదాస్పద మైన ఇండియన్ సినిమాల్లో ఒకటి.. ఉగ్రవాదం నేపధ్యంలో కమల్ స్వీయదర్శకత్వంలో నటించి, నిర్మించిన ఈ సినిమా ఆది నుంచి వివాదాలతోనే మొదలైంది..     తొలి భాగం సినిమా రిలీజ్కు ముందే డిటిహెచ్లో రిలీజ్ చేయాలని భావించిన కమల్.. ఆ ఆలోచనతో వివాదాల్లో ఇరక్కొని కంటనీరు కూడా పెట్టుకున్నాడు.. సినిమా విడుదల చేయనివ్వకపోతే దేశం విడిచివెళ్లిపోతానని కూడా ప్రకటించాడు.. అయితే తమిళ సినీ ప్రముఖుల జోక్యంతో వివాదం సద్దుమనిగింది.. కమల్ డిటిహెచ్లో సినిమా విడుదల చేయాలన్న ఆలోచన విరమించుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఆందోళన విరమించారు..     అయితే ఇప్పుడు మరోసారి డిటిహెచ్ వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చాడు కమల్.. విశ్వరూపం పార్ట్ 2ను కూడా డిటిహెచ్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్టుగా ఇండస్ట్రీల వర్గాల సమాచారం. అదే గనుక నిజమైతే కమల్ హాసన్ మరోసారి కొరివి తలగొక్కున్నట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.. ఒకసారి అదే ప్రయత్నం చేసి విరమించుకున్న తిరిగి ప్రయత్నం చేసి నవ్వుల పాలు కావటం కన్నా మామూలుగా సినిమా రిలీజ్ చేయటమే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు..     మరి కమల్ విశ్వరూపం2తో తన పంతం నెగ్గించుకుంటాడా, లేక మరోసారి వెనకడుగు వేస్తారా అన్నది తెలియాలంటే మాత్రం ఈ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే..

యాబై కోట్ల హీరోయిన్‌

      ఇన్నాళ్లు బాలీవుడ్లో మాత్రమే కలెక్షన్ స్టామినాతో హీరోయిన్ ఇమేజ్ లెక్కగట్టిన ఆడియన్స్ ఇప్పుడు టాలీవుడ్లో కూడా అదే ట్రెండ్ కు తెరతీశారు.. తెలుగు సినిమాల్లో కూడా భారీ కలెక్షన్లు కురిపిస్తున్న హీరోయిన్లకే సక్సెస్ పట్టం కడుతున్నారు.. అయితే ఈ లిస్ట్ అగ్రస్ధానంలో నిలిచిందో అందాల భామ.     బాలీవుడ్ హీరోయిన్ స్టామినాను వందకోట్ల కలెక్షన్లతో లెక్కగడతారు.. ఇప్పటికే  కరీనా, విద్యాబాలన్, దీపకా పదుకునే, కత్రినా లాంటి అందాల భామలు ఈ వంద కోట్ల క్లబ్లో చేరి టాప్ హీరోయిన్స్ అనిపించుకున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో కూడా ఈ కలెక్షన్ల ఫీవర్ ఇప్పుడు టాలీవుడ్కి కూడా పాకింది.. ఇంతకు ముందెన్నుడ లేని విధంగా ఇప్పుడు ఏ హీరోయిన్ నటించిన సినిమాలు ఎంతెంత కలెక్ట్ చేస్తున్నాయి అని చర్చించుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు..     అయితే ఇలా కలెక్షన్ల లిస్ట్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది అందాల భామ సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు కాసులు కురిపించడంలోనూ ముందే ఉంటుంది..సమంత హీరోయిన్గా నటించిన నాలుగు సినిమాలు వరుసగా 50 కోట్ల క్లబ్లో చేరాయి.. దీంతో ఈ అమ్మడి క్రేజ్ ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. సమంత హీరోయిన్గా నటించిన దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు భారీ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేశాయి..     అయితే ఇప్పుడు తాజాగా సమంత హీరోయిన్గా నటించిన అత్తారింటికి దారేది కూడా 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకు పోతుంది. అయితే తన గత సినిమాల కంటే అత్తారింటికి దారేది సినిమాతో ఇంకా షార్ట్ టైంలోనే 50 కోట్లు కలెక్ట్ చేసి మరో రికార్డ్ సెట్ చేయబోతుంది సమంత..        

ప్రమాదంలో మగధీర రికార్డ్స్‌

      టాలీవుడ్‌లో ఇంకే సినిమా బీట్ చేయలేదు అనుకున్న ఓ భారీ రికార్డ్‌కు ఇప్పుడు ప్రమాదం ఏర్పాడింది. అది కూడా బయటి సినిమా నుంచి తన ఇంటి హీరో నుంచి వచ్చిన సినిమాతోనే.     టాలీవుడ్‌లో చరిత్రను తిరగరాసిని బిగెస్ట్ హిట్ మగధీర.. 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇదే పెద్ద హిట్.. మెగా తనయుడు రామ్‌చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంభినేషన్లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాదించటంతో పాటు అన్‌బిటబుల్ రికార్డులను సెట్ చేసింది..     అయితే ఇప్పుడు ఈ మగధీరుడి రికార్డులకు ప్రమాదం వచ్చింది. అది కూడా బయట హీరోల సినిమాలతో కాదు.. సొంత బాబాయితోనే.. పవన్ కళ్యాన్ హీరోగా ఇటీవల విడుదలైన అత్తారింటికి దారేది సినిమా పాత రికార్డులను తిరగరాసే దిశగా నడుస్తుంది..     ఇప్పటికే గబ్బర్‌సింగ్ సినిమాతో మగధీరుడికి చెమటలు పట్టించిన పవర్‌స్టార్ ఈ సారి తప్పకుండా పాత రికార్డులను బద్దలు కొడాతంటున్నారు ఫ్యాన్స్. పవన్ పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌తో పాటు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ డైరెక్షన్తో అత్తారింటికి దారేది సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది.     రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో సినిమా చాలా సార్లు వాయిదా పడటం, రిలీజ్కు ముందే ఫస్ట్ ఆఫ్ సినిమా అంతా పైరసి కావడంతో అసలు ఆడటమే కష్టం అనుకున్న అత్తారింటికి దారేది.. ఇప్పుడు రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది.  ఇప్పటికే భారీగా కాసులు కురిపిస్తున్న అత్తారింటికి దారేదికి మరో పదిరోజుల పాటు వేరే సినిమా లేకపోవడంతో.. మరి కొద్ది రోజుల పాటు కాసుల వర్షం కురుస్తుందంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో మగధీర రికార్డులు బ్రేక్ అవుతాయింటున్నారు పవన్ ఫ్యాన్స్..

వెండితెరపై గణితశాస్త్ర దిట్ట

  ఇప్పటివరకు చాలా మంది సినిమా హీరోలు, స్వతంత్ర సమర యోధుల వంటి వాళ్ళ జీవిత చరిత్రలు వెండితెరపై ప్రాణం పోసుకున్నాయి. అయితే తాజాగా వీరి జాబితాలోకి రామానుజన్ కూడా చేరారు. గణితశాస్త్రంలో దిట్టగా పేరుపొందిన రామానుజన్ జీవితం ఆధారంగా "రామానుజన్" అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామానుజన్ పాత్రలో జెమిని గణేషన్ మనవడు అభినయ్ నటిస్తున్నాడు. మలయాళ నటి భామ కథానాయికగా నటిస్తుంది. కాంఫోర్ సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.