విశాఖ తీరంలో బాలయ్య సందడి

  నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విశాఖ సముద్ర తీరం పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "లెజెండ్" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఆయనొక ఆల్ రౌండర్: దాసరి

  ఎప్పుడు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ, తనదైన శైలిలో ఇండస్ట్రీపై విరుచుకుపడే దర్శకుడు దాసరి నారాయణరావు. అయితే ఈ మధ్య దాసరిలో చాలా మార్పు వచ్చినట్లుగా తెలుస్తుంది. శ్రీహరి మరణం వలన శ్రీహరి స్నేహితులు సికింద్రాబాద్ లో నిర్వహించిన సంస్మరణ సభకు దాసరి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... "కొంద‌రు ఏదో పుట్టాం. బ్రతికాం. వెళ్లిపోయం అన్నట్లు జీవితాన్ని గ‌డుపుతారు. కానీ కొద్దిమంది మాత్రమే పుట్టుకను సార్ధకం చేసుకుంటారు. అటువంటి వారిలో రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి ఒక‌రు. న‌టుడిగానే కాకుండా...మాన‌వ‌త్వం వున్న మ‌నిషిగా కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు తన సొంత డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి చేశారు. ఇక నటుడిగా ఆయ‌న ఎస్వీఆర్ మాదిరిగా ఆల్ రౌండ‌ర్ గా ఎదుగుతున్న స‌మ‌యంలో చనిపోవడం.. తెలుగు ఇండ‌స్ట్రీకి తీర‌ని న‌ష్టం. శ్రీహ‌రి బ్రతికి వుంటే నిజంగా ఇంకో 20 ఏళ్లు న‌టించే వాడన్నారు. ఏది ఏమైన ఎస్వీఆర్ అంత‌టి వాడుగా ఎద‌గాల్సిన శ్రీ‌హ‌రిని ఇండ‌స్ట్రీ కోల్పోయింద‌ని దాసరి బాధ ప‌డ్డారు. వాస్తవానికి న‌టుడిగా శ్రీ‌హ‌రికి ఎవ‌రు వంక పెట్టలేరు. ఆయ‌నొక ఆల్ రౌండ‌ర్" అని అన్నారు. అయితే ఈ విధంగానే దాసరి అన్ని వేదికలపై పాసిటివ్ గానే మాట్లాడితే బాగుంటుందని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బాహుబలి కథ లీకయ్యిందోచ్....!

  "మర్యాద రామన్న" చిత్రం విడుదలకు ముందే దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం కథ చెప్పి, అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అదే విధంగా "ఈగ" చిత్రం కథ కూడా ముందే చెప్పి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ "బాహుబలి" చిత్రం కథ లీకయ్యింది.   నిజానికి ఈ కథ తెలిసిపోయిన కొందరు వ్యక్తులు దీనిని కామెడీగా షార్ట్ ఫిల్మ్ గా కూడా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏమిటా కథా అని అనుకుంటున్నారా?   ప్రభాస్, రానా అన్నదమ్ములు. వీరిద్దరూ కూడా అనుష్కనే ప్రేమిస్తారు. కాకపోతే ఆ అమ్మాయికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న రానా, ప్రభాస్-అనుష్క లను విడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. దీనికి వీరు రాజమార్గాన్ని ఎంచుకుంటారు. కానీ రానా మాత్రం రాజామార్గంతో పాటు, అడ్డదారి ప్రయత్నాలు కూడా చేస్తూ అనుష్కను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. దీనికోసం తన సొంత మనుషులను కూడా చంపడానికి రానా ప్రయత్నిస్తుంటాడు. తర్వాత ప్రభాస్-అనుష్క లకు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత అనుకోకుండా ఇదే సమయంలో వీరికి ఒక పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్యను ప్రభాస్ బాహుబలి లాగా పోరాడుతుంటే... రానా మాత్రం అనుష్కను తన వశం చేసుకోడానికి ఇదే మంచి అవకాశం అనుకొని.. తనని దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తాడు. తర్వాత ఫైనల్ గా ప్రభాస్-రానా లకు భారీ యుద్ధం జరిగి, చివరికి రానాకి బుద్ధి వచ్చేలా చేస్తాడు ప్రభాస్. దాంతో ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకుంటారు.   ఈ కథ వినటానికి చాలా కొత్తగా ఏం లేకపోయినా కూడా, దీనిని రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టనున్నాడని తెలిసింది.

మంచు బాబు.. చెంప చెల్లుమనిపించాడట...!

  మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న తాజా చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి అనుమతి లేకుండా చిత్ర షూటింగ్ ను చూసాడని, దాంతో మోహన్ బాబుకి కోపం వచ్చి అతని చెంప చెల్లుమనిపించాడని తెలిసింది. అంతే కాకుండా అలా చూసినందుకు 500 రూపాయలు చెల్లించమని అడిగినట్లుగా సమాచారం. ఎందుకంటే ఇటీవలే పవన్ "అత్తారింటికి దారేది" సినిమా విడుదలకు ముందే పైరసీ కావడం వల్ల మోహన్ బాబు చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరు కూడా సెల్ ఫోన్ లు వాడరాదని చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు మోహన్ బాబు.

ప్రతినిధి ఆడియోలో టిడిపి అధినేత

  నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "ప్రతినిధి". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.... "యువతరంలో స్పూర్తిని రగిలించే అంశాన్ని కథగా ఎంచుకుని దర్శకుడు మంచి సినిమాని తెరకెక్కించారు. సమాజాన్ని ప్రక్షాలన చేస్తే ప్రపంచంలో మనదేశం మొదటిస్థానంలో నిలబడుతుంది. రాజకీయాల్లో పడిపోతున్న విలువలను నిలబెట్టేందుకు యువతరం రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉంది. నారా రోహిత్ "బాణం", "సోలో" చిత్రాల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది" అని అన్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ మాండవ దర్శకత్వం వహిస్తున్నాడు. శుభ్ర అయ్యప్ప హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ లో లొల్లి చేయనున్నబైక్ రేసర్

  "ఇద్దరమ్మాయిలతో" చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసుగుఱ్ఱం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ నవంబర్ 16 నుండి హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

గుర్రుమీదున్న అందాల భామ

  ఈ మధ్య బాలీవుడ్ లో అందాల భామ దీపికా పదుకునేపై పలు కథనాలు వస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తుందని, చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ తెగ ఎంజాయ్ చేస్తుందని సదరు ఓ హిందీ ఛానెల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఇది ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ వార్త చివరికి దీపికా చెవిలో పడటంతో.. దీపికా ఆ ఛానెల్ పై మండిపడింది. ఇదే విషయంపై దీపికా స్పందిస్తూ... "బాయ్‌ఫ్రెండ్ అనే పదానికి ముందు అర్థం ఏంటో ఆ ఛానెల్ వాళ్లు తెలుసుకుంటే మంచిది. ఫ్రెండ్స్ తో కలిసి తిరిగినంత మాత్రాన శారీరక సంబంధం పెట్టుకున్నట్లేనా? వృత్తిని, జీవితాన్ని నేను ఒకేలా చూడను. నా కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. నేను గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అందుకు తగ్గట్లే నడుచుకుంటాను. అది కేవలం నా వృత్తికి సంబంధించిన విషయం. ఇక నా ఇంటి విషయానికొస్తే... నా లైఫ్ స్టైలే వేరు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని నేను. అనుబంధాలు, ఆప్యాయతలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు మాది. దేశం గర్వించదగ్గ గొప్ప బ్యాట్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనేకి పుట్టిన అమ్మాయిని. కాబట్టి నా గురించి రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా రాయండి" అంటూ మండిపడింది.

అందాల గనికి గాయాలు...!

  పోర్న్ స్టార్ స్థాయి నుంచి బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మారిపోయింది సన్నీలియోన్. సన్నీలియోన్ నటిస్తున్న తాజా హిందీ చిత్రం "టీనా అండ్ లోలో". ఈ చిత్ర షూటింగ్ లో సన్నీ, కరిష్మా తన్నాలు పాల్గొంటున్నారు. అయితే తాజాగా వీళ్ళిద్దరిపై ఓ ఫైట్ సీన్ చిత్రికరిస్తుండగా సన్నీ గాయపడింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అనుకోకుండా ఒక ఫైటర్ సన్నీ భుజంపై పడిపోయాడని, దాంతో సన్నీకాళ్లు, చేతులకు గాయాలయ్యాయని తెలిసింది. అయితే కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సుచించారంట. దాంతో కొన్ని రోజుల వరకు షూటింగ్ కి బ్రేక్ చెప్పేసారు.

ఆ "గే" పాత్రకు ఆయనే ప్రేరణంట...!

  రామ్, వెంకటేష్ ప్రధాన పాత్రలలో కలిసి నటించిన తాజా చిత్రం "మసాలా". ఈ చిత్రం ఈ నెల 14వ తేదిన విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో హీరో రామ్ రెండు పాత్రలలో నటిస్తున్నాడు. ఒకటి మాములు యువకుడి పాత్రలో, రెండవది గే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ గే షేడ్స్ పాత్ర చేయడానికి తనకు ఒకరు ప్రేరణగా నిలిచారని రామ్ తెలిపాడు. ఇంతకీ ఆ వ్యక్తీ ఎవరా అని అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు. ప్రముఖ డాన్స్ డైరెక్టర్ శివ శంకర్ మాస్టర్. ఈ విషయాల గురించి హీరో రామ్ మాట్లాడుతూ... "ఇందులో గే షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి నాకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓ పాట చిత్రీకరణ జరిగింది. ఆ పాటకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఆ సమయంలో ఆయనను గమనించాను. చివరకు ఆయననే ప్రేరణగా తీసుకుని, ఈ పాత్ర చేశాను అని అన్నాడు. మరి రామ్ చేసిన ఈ పాత్రకు శివశంకర్ ప్రేరణ అవడానికి కారణం ఏమిటి? అంటే ఆయన ఏమైన అలాగే చేస్తాడని రామ్ అనుకున్నాడా? ఏంటో మరి..

ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న లవ్ బర్డ్స్

  సింగర్ గీతామాధురి, నటుడు నందు లు గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీరి వివాహ నిశ్చితార్థం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9న వివాహం జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ... "నేను, నందు ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఏడాది క్రితమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఇపుడు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించి, ఇలా సందడిగా మా నిశ్చితార్థం జరిగింది. మాఘమాసంలో మేం పెళ్లి చేసుకోబోతున్నాం" అని అన్నారు. గీత ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో పాటలు పడుతూ చాలా బిజీగా ఉంది. అదే విధంగా నందు కూడా పలు సినిమాలు చేస్తూ, నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

ఆమె ప్రెగ్నెంట్ కాదంట...!

  హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం "కహాని". ఈ చిత్రంలో విద్యాబాలన్ తన భర్త కోసం వెతికే ప్రెగ్నెంట్ గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో "అనామిక" పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార టైటిల్ పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రీమేక్ లో మాత్రం నయనతార ప్రెగ్నెంట్ గా కనిపించదని చెబుతున్నాడు దర్శకుడు శేఖర్. మరి ఈ చిత్రంలో నయనతారను శేఖర్ కమ్ముల ఎలా చూపించాడో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

ఆమెపై క్రిమినల్ కేసుకు వర్మ సిద్ధం

  వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "సత్య-2". ఈ చిత్రం దేశవ్యాప్తంగా రిలీజైంది. అయితే తెలుగు వెర్షన్‌ విడుదల మాత్రం కొన్నిచోట్ల ఆలస్యమయ్యింది. దీనికి కారణం హైదరాబాద్ సెన్సార్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ ధనలక్ష్మి అహంకారపూరిత వైఖరియే అని అంటున్నాడు వర్మ. తన సినిమాలోని కొన్ని సీన్స్ కత్తెరలు పడటంతో... ఇదేంటని ప్రశ్నించినందుకు తనని "షటప్ యువర్ మౌత్'' అని అసభ్యకరంగా ఆమె మాట్లాడారని వర్మ అంటున్నాడు. ఈ విషయంలో ఊరుకునేది లేదని, అవసరమైతే ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా వెనకాడనని వర్మ అంటున్నాడు.   నిజానికి ధనలక్ష్మి గురించి ఇలాంటి ఆరోపణలు ఈ మధ్య చాలా వస్తున్నాయి. కానీ ఎవ్వరు కూడా ఏం చెయ్యలేకపోతున్నారు. ఇటీవలే మంచు విష్ణు నటించిన "దూసుకెళ్తా" సినిమా సెన్సార్ సమయంలో కూడా ఆ చిత్రం దర్శక, నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టిందట. ఈ విషయంపై హీరో విష్ణు కూడా తన ఆవేదనని వ్యక్తం చేశాడు. మరి ధనలక్ష్మి విషయంపై వర్మ ఇంకెంత దూరం వెళ్తాడో త్వరలోనే తెలియనుంది.

ఈయన అందులో దొంగనట...!

  హిందీలో తెరకెక్కుతున్న "వెల్‌కం బ్యాక్" చిత్రంలో తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం నటించబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బ్రహ్మానందం మాట్లాడుతూ..."వెల్‌కం బ్యాక్" చిత్రంలో ఓ ఇంట్రస్టింగ్ పాత్ర కోసం దర్శకుడు అనీస్ బాజ్మీ తనను కోరాడని బ్రహ్మానందం తెలిపాడు. ఈ చిత్రంలో తను దొంగ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో చాలా బిజీగా వున్న తనకు, బాలీవుడ్‌లో చేయాలనే అనే ఆలోచన లేకపోయినప్పటికీ కూడా... దర్శకుడు అనీస్ తనకు నచ్చజెప్పి ఒప్పించాడు. త్వరలోనే ముంబై, దుబాయ్‌లలో జరిగే షూటింగ్‌లలో పాల్గొంటాను. నా సీన్స్ ఎక్కువగా అనిల్ కపూర్, నానా పటేకర్‌లతో ఉంటాయి అని బ్రహ్మానందం చెప్పాడు.