పండ్లని కరిగించిన కూడా కత్తిలా తయారైంది...!

  బుగ్గల్లో ఆపిల్ పండ్లు, పెదవుల్లో చెర్రీ పండ్లు, ఒళ్ళంతా పండ్ల తోటలా ఉండే బొద్దు, ముద్దు గుమ్మ ఛార్మి గురించి అందరికి తెలిసిందే. అయితే అలాంటి ముద్దుగుమ్మలో బొద్దుతనం బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు "మంత్ర-2" సీక్వెల్ లో నటిస్తుంది. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ఏకంగా 9 కిలోలు తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో ఛార్మి కొత్తగా కనిపించబోతుంది. కానీ ఇదివరకు బొద్దుగా కనిపించే ఛార్మి,..సన్నగా మెరుపు తీగల తయారైనప్పటికీ కూడా తన అందాలతో పిచ్చేక్కిస్తుంది. మరి మెరుపు తీగల మారిన చార్మికి హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

అక్కడ రజనీ... ఇక్కడ పవన్...!

  "పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు. పవన్ ఇపుడు హీరోగా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి పేరున్న నటుడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చి తన సినిమా కెరీర్ ని నాశనం చేసుకోలేడు" అని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. తన 52వ పుట్టినరోజు సంధర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ రాజకీయాల్లోకి రాడని, తను కూడా అన్నయ్య కోసం ఎలెక్షన్ల సమయంలో ప్రచారం చేస్తాను తప్ప, రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశ్యం, సమయం రెండు లేవని తేల్చి చెప్పేసారు. దీంతో గత కొద్దిరోజులుగా వస్తున్న పవన్ పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు తెరపడినట్లయింది. మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు సంధర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు వన్.కామ్

మంత్రితో బాలయ్య మంతనాలు

  నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎం.పి. బిల్డింగ్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణకు ఓ మంత్రిగారికి మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నేటితో ఇక్కడ చిత్రకరణ పూర్తవుతుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకోనున్నారు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ధనుష్ హీరోయిన్ పై నయనతార గరం గరం

  కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార.. మలయాళ నటి నజ్రియా నజీమ్‌ పై తీవ్రంగా మండిపడుతుంది. ఎందుకంటే ధనుష్ హీరోగా "నైయాండి" అనే చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్‌ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకోసం దర్శకుడు తనను అసభ్యంగా చూపించారంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి, పెద్ద సంచలనం చేసిన ఈ అమ్మడి ప్రవర్తనపై కోలీవుడ్ చాలా కోపంగా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నయనతార నజ్రియాను తనదైన శైలిలో హెచ్చరించింది. "నిజానికి ఆ సన్నివేశాలను మరీ అంతగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మరీ పద్దతిగా పోతే సినిమా కలెక్షను దెబ్బతింటాయి జాగ్రత్త" అంటూ నజ్రియాపై మండిపడింది. మరి దీనికి నజ్రియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

కోర్టుకెక్కనున్న మహేష్ అత్త

  తెలుగులో మహేష్ హీరోగా నటించిన "అర్జున్" సినిమాలో మహేష్ కు అత్తగా లేడి విలన్ పాత్రలో నటించి, అందరి ప్రశంసలు పొందిన నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత తన భర్త ముఖేష్ మాధవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటుడు, నిర్మాత అయిన ముఖేష్ మాధవన్ తో తనకు 1988లోనే కేరళలో వివాహం జరిగిందని, అయితే ప్రస్తుతం దుబాయ్ లో మెడిసిన్ చదువుతున్న నా పెద్దకొడుకు వద్ద ఉన్న నాకు ఎలాంటి విషయం చెప్పకుండా, విడాకులు కూడా ఇవ్వకుండానే అతడు దేవిక అనే మరో మహిళను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని సరిత పేర్కొంది. ప్రతిరోజూ తాగివచ్చి మానసికంగా, శారీరకంగా తనను ముఖేష్ వేధించే వాడని... అందువల్లే తనపై సివిల్, క్రిమినల్ కోర్టులకెక్కబోతున్నట్టు ఆమె తెలిపింది.

భారతీయ దర్శకులపై వర్మ చిన్న చూపు

  రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన కూడా వ్యంగ్యంగానే ఉంటుంది. అయితే ఇటీవలే విడుదలైన పాకిస్తానీ సినిమా "వార్" రామ్ గోపాల్ వర్మకు తెగ నచ్చేసిందట. దాంతో ... "వార్" చిత్రం చూసిన తర్వాత ఈ డెరైక్షన్ వదిలేసి, పాకిస్తాన్ వెళ్లిపోయి.. ఆ చిత్ర దర్శకుడు బిలాల్ లషారీ వద్ద అసిస్టెంట్‌గా చేరాలనిపించింది.. అంటూ కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా.."భారతీయ దర్శకులు తాము గొప్పవాళ్లము అనే భావన నుంచి బయటపడాలి. భారతీయ చిత్ర ప్రముఖులకు ఈ "వార్" చిత్రం కాపీని పంపి, పుణ్యం కట్టుకోవాలని" సంచలన వ్యాక్యాలు చేసాడు.ఇలాంటి కామెంట్లు చేస్తూ వర్మ తన నోటి దురుసును మరోసారి చాటుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.

పవన్ మరదల్లతో ఎన్టీఆర్ సరసాలు

  "అత్తారింటికి దారేది" చిత్రంలో అక్కచెల్లెలుగా నటించిన సమంత, ప్రణీతలు మరోసారి కలిసి నటించనున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ కథకు మరో హీరోయిన్ అవసరం అవడంతో చాలా మంది హీరోయిన్లను అనుకున్నప్పటికీ, దర్శకుడు మాత్రం చివరకు ప్రణీతను మరో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అంటే త్వరలోనే వీరిద్దరితో ఎన్టీఆర్ ఆడిపాడనున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

డోసు పెంచిన మహేష్ దర్శకుడు

  మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే రామానాయుడు స్టుడియోలో జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.."దూకుడు" చిత్రం కేవలం ట్రైలర్ మాత్రమే. "ఆగడు" చిత్రంలో మహేష్ ను మాస్ హీరోగా చూపించబోతున్నాం. "దూకుడు" కంటే పదింతలు ఎక్కువగా ఈ చిత్రంలో మహేష్ కనిపించనున్నాడు. అభిమానులందరికీ నచ్చే విధంగా ఉంటుంది అని అన్నారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన "దూకుడు" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మరి ఈ విధంగా శ్రీనువైట్ల "ఆగడు" చిత్రానికి ఇంత భారీ స్థాయిలో అంచనాలు పెంచడం వల్ల అభిమానుల్లో మరింత ఉత్కంట ఎక్కువ అవుతుంది. అభిమానులు ఊహించిన స్థాయిలో ఈ చిత్రం ఉండకపోతే "ఆగడు" చిత్రం పరిస్థితి ఎలా ఉంటుందో మరి. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

గుట్టు విప్పనున్న శృంగార తార

  షకీలా అనే పేరు తెలియని వారుండరు. ఒకప్పుడు శృంగార తారగా అభిమానులను అలరించిన షకీలా గతకొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతం షకీలా తన ఆత్మకథ రాస్తుందట. తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలతో కూడిన ఆత్మకథ రాస్తుందట. ఇందులో తను ఎదుర్కొన్న తీపి, చేదు అనుభవాలను పూర్తిగా తెలియజేయబోతున్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సినీ పరిశ్రమ వ్యక్తులు.. ఎక్కడ ఆ ఆత్మకథలో తమ గురించి చెపుతుందోనని భయపడిపోతున్నారు. ఈ ఆత్మకథ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంత మంది నిర్మాతలు షకీలా ఆత్మకథ తో పాటుగా, తన జీవిత చరిత్రను ఓ సినిమాలాగా తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉన్నారని తెలిసింది. మరి దీనికి షకీలా ఏమంటుందో చూడాలి.

పవన్ రికార్డును బ్రేక్ చేసేసాడు.

  పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్ర ట్రైలర్ ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆ రికార్డును ప్రభాస్ బద్దలు కొట్టేశాడు. ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన "బాహుబలి" చిత్ర మొదటి టీజర్ కు అశేష స్పందన వస్తుంది. "బాహుబలి" టీజర్ విడుదలయిన ఒకటిన్నర రోజులోనే యూట్యూబ్ లో 5,92,096 మంది వీక్షించారు. అదే "అత్తారింటికి దారేది" సినిమాకు ఒకటిన్నర రోజులో 4,68,564 మంది వీక్షించారు. అంటే త్వరలోనే ప్రభాస్ "బాహుబలి" రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్రంపై అటు అభిమానులతో పాటు, ఇటు సినీ ఇండస్ట్రీ అంతట కూడా భారీ ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అనుష్క, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

మొదలెట్టిన మహేష్ ఆగడు

  మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8:09ల సమయంలో రామానాయుడు స్టుడియోలో జరిగాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది.14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పూర్తి కమర్షియల్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఎన్ కౌంటర్ శంకర్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది.

రేపే ఆగడు ప్రారంభం

  మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘దూకుడు' తర్వాత తెరకెక్కనున్న రెండో చిత్రం"ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు రేపు ఉదయం 8 గంటలకు రామానాయుడు స్టుడియోలో జరగనున్నాయి. రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా "దూకుడు" కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్టయ్యే సాంగ్స్ ఇవ్వాలని థమన్ ఆశిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ఎంకౌంటర్ శంకర్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది. మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదల కానుంది.