బాలీవుడ్ వెళ్లనున్న 'బాద్ షా'

  బాలివుడ్, టాలివుడ్, కోలీవుడ్ మూడూ కూడా ఒక దాని నుండి మరొకటి సినిమాలు అరువు తెచ్చుకొని రీమేక్ చేసుకొంటూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు వెరైటీ సినిమాలు ఇవ్వాలని తిప్పలు పడుతుండటం అందరికీ తెలిసిందే. ఒక చోట హిట్టయిన సినిమా మరొక చోట రీమేక్-అవతారం వేసుకొని ప్రేక్షకులను పలకరిస్తుంది.   ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో జు.యన్టీఆర్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమా ఇంకా విడుదల కాక మునుపే, ఆ సినిమాను తామే స్వయంగా హిందీలో రీమేక్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్ మీడియాకు తెలిపారు. హిందీ సినిమాకు కూడా శ్రీను వైట్లే దర్శకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. అయితే హిందీ లో సినిమాను బాలివుడ్ లో ప్రముఖహీరోహీరోయిన్లను పెట్టి తీయలను కొంటున్నట్లు ఆయన తెలిపారు. అందుకొరకు ఇప్పటికే బాలివుడ్ లో కొన్ని ప్రముఖ సినిమా సంస్థలను తాము సంప్రదించినట్లు తెలిపారు. త్వరలోనే తమ హినీ సినిమా వివరాలను కూడా తెలియజేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.   ఇక, మన టాలివుడ్ నిర్మాతలు హిందీ సినిమాలు చేయడానికి బాలివుడ్ వైపు అడుగులు వేస్తుంటే, మరో వైపు ప్రముఖ బాలివుడ్ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు మన తెలుగు హీరో నానిని పెట్టి త్వరలో హిందీలో సూపర్ హిట్టయిన ‘బ్యాండ్ బాజా బారాత్’ అనే సినిమాను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు.   అదే విధంగా హిందీలో సూపర్ హిట్టయిన ‘బోల్ బచ్చన్’ తెలుగు రీమేక్ సినిమాలో విక్టరీ వెంకటేష్, రామ్ కలిసి నటించనున్నారు.

అమెరికాలో మిర్చి సరికొత్త రికార్డు

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా, అమెరికాలో మిర్చిని విడుదలచేసిన గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థకు కూడా ఊహించని లాభాలు ఆర్జించిపెడుతోంది. అక్కడి తెలుగువారికి ‘మిర్చి’ఘాటు నచ్చడంతో, ఇటీవలే అక్కడా కూడా 50 రోజులు పూర్తిచేసుకొంది కూడా. అమెరికాలో 50 రోజులు ఆడిన మొట్టమొదటి తెలుగు సినిమాగా మిర్చి సరికొత్త రికార్డు స్వంతం చేసుకొంది. న్యు జెర్సీనగరంలో రీగల్ కామర్స్ సెంటర్ మరియు కారీ అనే ప్రాంతంలో కార్మేక్ పార్క్ వద్దగల రెండు సినిమా దియేటర్లలో మిర్చి 50 రోజులు పూర్తి చేసుకొంది. అంతే కాకుండా, రీగల్ కామర్స్ సెంటర్ వద్ద మిర్చి కలెక్షన్లు హాలివుడ్ సినిమా కలెక్షన్ల కంటే కూడా బాగున్నాయని గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఇటువంటి అవకాశం కల్పించిన నిర్మాతలకు, సినిమాను ఇంత బాగా మలిచిన దర్శకుడు కొరటాల శివకు, హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, రిచాలకు ఆ సంస్థ యాజమాన్యం కృతజ్ఞతలు తెల్పింది.

బాలివుడ్ కి శాపం కానున్న సంజయ్ దత్త్ జైలుశిక్ష

  బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు, అక్రమ ఆయుధాలు కలిగిఉన్న నేరంలో 5ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ సుప్రీం కోర్టు నిన్న ఇచ్చిన తీర్పుతో బాలివుడ్ లో కలకలం రేగింది. గతంలో ఆయన 18 నెలలు శిక్ష అనుభవించినందున మిగిలిన కాలం 42 నెలలు అంటే మూడున్నర సం.లు జైలులో ఉండక తప్పదు.   గతంలో జైలు జీవితం అనుభవించిన తరువాత ఆయనలో చాలా మంచి మార్పు రావడంతో, బాలివుడ్ లో ఆయన మంచి పేరు సంపాదించుకొని అనేక సినిమాలు కూడా చేస్తున్నారు. ఆ కారణంగానే నేడు ఆయనకీ అందరూ సానుభూతి చూపిస్తున్నారు.   అయితే ఆయన ఇప్పుడు ఏకంగా మూడున్నర సం.లు జైలులో గడపాల్సివస్తే వివిధ స్థాయిల్లో ఉన్నఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోక తప్పదు. బాలివుడ్ నిర్మాతలు దాదాపు రూ.250 కోట్లు ఆయన సినిమాలపై పెట్టినట్లు సమాచారం.   ఈ క్రమంలో అన్నిటికంటే ముందుగా చెప్పుకోవలసింది మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ మొట్ట మొదటిసారిగా హిందీ లో చేస్తున్న ‘జంజీర్’ సినిమా. అందులో సంజయ్ దత్త్ గతంలో ప్రాణ్ చోప్రా చేసిన షేర్ ఖాన్ పాత్రను పోషిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సినిమా షూటింగు ఇటీవలే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది గనుక, ఆయన జైలుకి వెళ్ళడం వలన తమ సినిమా ఆగిపోయే ప్రమాదం లేదని ఆ సినిమా నిర్మాత అమిత్ మెహరా అన్నారు. దాదాపు రూ.50-60 కోట్ల భారీ వ్యయంతో తెలుగు(తుఫాన్) హిందీ బాషలలో నిర్మిస్తున్నఈ సినిమా గండం గట్టెక్కినప్పటికీ, అందరికీ ఆ అదృష్టం ఉండదు.   సంజయ్ దత్త్ ప్రస్తుతం ‘ఉంగ్లీ’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. పీపీ అగర్వాల్ నిర్మిస్తున్న ‘పోలీస్ గిరి’ అనే మరో సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఉంది. రెంటిలో కూడా సంజయ్ దత్త్ చేయవలసిన పోర్షనులో చాల భాగం షూటింగు పూర్తయిందని, ఇప్పుడు మిగిలిన భాగం ఏవిధంగా పూర్తిచేయలో అర్ధం కావట్లేదని నిర్మాతలు అన్నారు.   కోర్టు ఇచ్చిన నాలుగు వారాలలో సంజయ్ దత్త్ తో మిగిలిన భాగం పూర్తిచేయడం అసాద్యం గనుక, ఆయన వేసే రివ్యు పిటిషన్ పై కోర్టు స్పందన చూసిన తరువాత, అర్ధంతరంగా ఆగిపోయిన తమ సినిమాలను పూర్తి చేసేందుకు తామే కోర్టును ఆశ్రయించి ఆయనను తాత్కాలికంగా బెయిలుపై విడుదల చేయవలసిందిగా కోరుతామని వారు అన్నారు.   ఇక ఈ రెండు సినిమాల పరిస్థితి ఈ విధంగా ఉంటే, సంజయ్ దత్త్ ‘పీకే’, మున్నాభాయ్’ అనే మరో రెండు హిందీ సినిమాలకు కూడా ఇటీవలే ఒప్పందాలు చేసుకొన్నారు. ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు, సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ‘మున్నాభాయ్ యమ్బీ బీయస్’ (తెలుగులో శంకర్ దాదా యమ్బీ బీయస్) సినిమాకు మూడో భాగంగా తీయబోయే ఈ సినిమా మరియు ‘పీకే’ రెండూ కూడా ఇక ఇప్పుడు పూర్తిగా ఆగిపోయినట్లే భావించవచ్చును.

'బాద్‌షా' దుర్ఘటన పై...రామ్ చరణ్ స్పందన

        ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో రీలీజ్ ఫంక్షన్ లో తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దుర్ఘటన పై రామ్ చరణ్ స్పందించారు. అభిమాని మృతికి ప్రణాళిక లోపమే కారణమని అన్నారు. మేం ఏం చేసినా పక్కా ప్రణాళికతో చేశాం. అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మా కార్యక్రమాలు చూసే స్వామినాయుడుకు చెబుతాం. నా పెళ్లికి అభిమానులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. అన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తాం. బారీకేడ్ల నుండి అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటాం అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. “మన కార్యక్రమం ఏంటి ? అక్కడ ఎంత మంది పడతారు...అన్నది చూసుకోవాలి. లేకపోతే అవాంఛనీయ సంఘటనలు తప్పవు” అని రామ్ చరణ్ అన్నారు.

40 కోట్ల బిజినెస్ చేసిన ప్రభాస్ మిర్చీ

  కొరటాల శివ మొట్టమొదటి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన చిత్రం మిర్చీ. 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40కోట్ల రూపాయలు వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ప్రభాస్ కెరీర్ లో 17రోజుల్లో 40కోట్ల బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. నిజాం, సీడెడ్ ప్రాంతాల్లో  17రోజుల్లో 18కోట్లు, యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 3.36కోట్లు, దేశంలోని మిగతా ప్రాంతాల్లో కలిపి 17రోజుల్లో 40 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కొరటాల శివ కథ, స్క్రీన్ ప్లే, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ అభినయం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

అవార్డులెందుకు కలెక్షన్లుండగా!

  రాజమౌళి దర్శకత్వం వహించిన చిన్నజీవితో చేసిన చిన్న సినిమా ‘ఈగ’ రెండు జాతీయ అవార్డులు స్వంతం చేసుకోవడం చాలా సంతోషించవలసిన విషయమే. గత మూడేళ్ళుగా ఒక్క జాతీయ అవార్డు కూడా ఖాతాలో పడని టాలివుడ్ కి ఇది కొంచెం ఉపశమనం కలిగించేదే అయినా పొంగిపోవలసిన విషయం మాత్రం కాదు.   2008లో కూడా రాజమౌళి తీసిన సినిమా ‘మగధీర’ వల్లనే మన సినీ పరిశ్రమకు అవార్డు దక్కింది. అప్పుడు ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ మరియు కొరియోగ్రఫీకి అవార్డులు దక్కగా ఈ సారి కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ బాష చిత్రం అవార్డులు దక్కడం గమనిస్తే, మన సినీ పరిశ్రమ సాంకేతికంగా దేశంలో ఇతర చిత్ర పరిశ్రమల కంటే చాల ముందు ఉన్నట్లు స్పష్టం అవుతున్నపటికీ, మిగిలిన అంశాలలో పూర్తిగా వెనుకబడిపోయామని స్పష్టం చేస్తోంది.   బహుశః మన తెలుగు సినీ నిర్మాతలు, ప్రేక్షకులు కూడా కేవలం కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఈయడమే దీనికి కారణం అని చెప్పవచ్చును. కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న సినిమాలు విజయవంతంగా ఆడాలంటే తప్పనిసరిగా మూస ఫార్ములాలో వెళ్ళక తప్పదనే దృడమయిన అభిప్రాయం నిర్మాతలు కలిగిఉంటే, నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు, ఒక ఐటెం సాంగు లేకపోతే ధియేటర్లవైపు కన్నెత్తి కూడా చూడని ప్రేక్షకులు, మంచి సినిమాలు, అవార్డుల గురించి పెద్దగా పట్టించుకోవడం మానేసి చాలాకాలం అయింది. ఒక పెద్ద హీరో సినిమాకి వచ్చిన కలెక్షన్లే సినిమా గొప్పదన్నాన్ని తెలియజేసే ప్రామాణికంగా ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. అందువల్ల నిర్మాతలు, హీరోలు కూడా అదే దిశలో ముందుకు సాగిపోతున్నారు.   ఇక, అటువంటప్పుడు మన కంటే చిన్న పరిశ్రమలుగా భావిస్తున్న మాలీవుడ్ (మలయాళ సినీ పరిశ్రమ) 12 అవార్డులను, మరాఠీ, తమిళ్ చిత్ర సీమలు చెరో ఐదేసి అవార్డులను పట్టుకుపోయాని వాపోవడం కూడా అనవసరం. ఎందుకంటే మన పెద్ద సినిమా కలెక్షన్ల రికార్డులు వారెవరూ ఎన్నడూ కూడా బ్రద్దలు గొట్టలేరు గనుక.

'బాద్‌షా' ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి: 10 లక్షల ఆర్ధిక సహాయం

    బాద్ షా’ ఆడియో వేడుకలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా మరో ఐదు లక్షలు అందించారు. ఈ మేరకు మృతుడు రాజు తల్లి ఈశ్వరమ్మతో స్వయంగా మాట్లాడి రూ.ఐదులక్షల చెక్కు అందించారు. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ బాబు తన వంతుగా నిన్నరాత్రి ఐదు లక్షలు ప్రకటించారు. మొత్తం 10 లక్షల చెక్కులు ఆమె తల్లికి అందించారు. పాత ఇనుప సామాను వ్యాపారం చేసే రాజు తండ్రి ఇటీవల మరణించాడు. దీంతో ఆ కుటుంబానికి రాజు ఆధారంగా ఉన్నాడు. అయితే అభిమాని మరణానికి సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులపై రాయదుర్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయ అవార్డుల్లో ఈగ సంచలనం

        2012 ఏడాదికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలను జాతీయ చలన చిత్ర అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఈగ సంచలనం సృష్టించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'ఈగ' ఎంపికైంది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రంగా కూడా 'ఈగ'కు అవార్డు లభించింది. ఉత్తమ జాతీయ చిత్రంగా 'కహానీ' ఎంపికైంది. ఉత్తమ నటుడు ఇర్ఫాన్ఖాన్కు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు ఇళయరాజాకు అభించింది.   అవార్డుల వివరాలు : ఉత్తమ జాతీయ చిత్రం - కహానీ ఉత్తమ ప్రాంతీయ చిత్రం - ఈగ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - ఈగ ఉత్తమ హిందీ చిత్రం - పాన్‌సింగ్ తోమర్ ఉత్తమ నటుడు - ఇర్ఫాన్ ఖాన్(పాన్‌సింగ్ తోమర్) ఉత్తమ నటి - ఉషా జాదవ్(దాగ్ - మరాఠీ) ఉత్తమ గాయని - సంహిత(మరాఠి) ఉత్తమ గాయకుడు - శంకర్ మహాదేవన్(చిట్టగాంగ్) ఉత్తమ పాట- ప్రసూన్ జోషి (చిట్టగాంగ్ ) ఉత్తమ సహాయ నటుడు- అనూకపూర్( విక్కీ డోనర్) ఉత్తమ సహాయ నటి - డాలి అహ్లువాలియా(విక్కీ డోనర్) ఉత్తమ సంగీత దర్శకుడు - ఇళయా రాజా ఉత్తమ జనరంజిక చిత్రాలు - విక్కీ డోనర్ (హిందీ), ఉస్తాద్ హొటల్ (మళయాళం) ఉత్తమ బాల నటుడు- వీరేంద్ర ప్రతాప్(హిందీ), మీనన్(మలయాళం) ఉత్తమ డైలాగ్స్- అంజలీ మీనన్(ఉస్తాద్ హోటల్- మలయాళం) ఉత్తమ కళా దర్శకత్వం - విశ్వరూపం స్పెషల్ జ్యూరీ అవార్డులు - చిత్రాంగద(బెంగాలీ), కహానీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, దేఖ్ ఇండియన్ సర్కస్, తలాష్

'బాద్‌షా' ఆడియో: కన్నీళ్లు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్

        ‘బాద్ షా’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అంతలోనే ఒక విషాద వార్త. వరంగల్ జిల్లా కరీమాబాద్ బీరన్న కుంటకు చెందిన మక్కల రాజు (20) ఆడియో విడుదల కార్యక్రమం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక మృతిచెందాడు. పాపం జూనియర్ ఎన్టీఆర్ వేదిక మీదనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తోబుట్టువును పోగొట్టుకున్నానని బాధపడ్డారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అభిమానులు వారి కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకోవాలని, క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. నిర్మాత బండ్ల గణేష్ ఉడతాభక్తిగా ఆ కుటుంబానికి తాను రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం చేస్తున్నానని ప్రకటించారు. డబ్బులెన్ని ఇచ్చినా ఆ కుటుంబానికి కొడుకు లేని లోటు పూడ్చలేమని అన్నారు.

'బాద్ షా'తో బన్నికి సవాల్

        టాలీవుడ్ లో సూపర్ డ్యాన్సర్లు అంటే.... ఎన్టీఆర్, అల్లు అర్జున్ లేనని అంటారు. కానీ, “అదుర్స్” షూటింగ్ టైంలో ఎన్టీఆర్ గాయపడటంతో... యంగ్ టైగర్ అద్దిరిపోయే డాన్స్ మూవ్స్ కు బ్రేక్ పడింది. ఈలోగా... బన్నీ “ఆర్యా-2”, “బద్రినాథ్” సినిమాల్లో... కొత్త కొత్త స్టెప్పులు వేసేసి... డాన్సింగ్ లోనే ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసేశాడు. ఈ విధంగా డిసప్పాయింట్ అయిన నందమూరి అభిమానులకు మళ్లీ “బాద్షా” తో... కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాలో.. ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోయాతని ఇప్పటికే యూనిట్ సభ్యులు ఊదరగొట్టేస్తున్నారు. కాబట్టీ.... అల్లు అర్జున్ టాప్ ప్లేస్ కు ఈ సినిమా గట్టి సవాలే విసిరేట్లు కనిపిస్తోంది.

బాలీవుడ్ లో అడుగుపెడుతున్న శరణ్యామోహన్

        “భీమిలీ కబడ్డీ జట్టు”, “విలేజ్ లో వినాయకుడు” సినిమాల్లో.. చక్కని చుక్కలా తెలుగింటి వారిని ఆకట్టుకున్న కేరళ కుట్టి శరణ్యా మోహన్. ఈ మధ్య తెలుగులో అంతగా కనిపించకపోయే సరికి ఫేడ్ అవుట్ అయిపోయిందేమో అని అంతా అనుకున్నారు. కానీ, అందరికీ షాక్ నిస్తూ... ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. ఇంతకూ విషయం ఏమిటంటే... “భీమిలీ కబడ్డీ జట్టు” సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక విషయం వచ్చేసరికి ... తెలుగు, తమిళ వర్షన్ నాయకి అయిన శరణ్యే మంచి ఛాయిస్ అని ప్రొడ్యూసర్లు ఫిక్స్ అయ్యారట. అలా... మన కేరళ కుట్టి... బాలీవుడ్ లో హీరోయిన్ అయిపోతోంది. ఎనీ వేస్ ఆల్ ది బెస్ట్ శరణ్య…!

తమ్ముడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న డైరెక్టర్

        అడివి శేష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ 'కిస్'. ఈ సినిమాను సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని గురించి ప్రొడ్యూసర్ సాయికిరణ్ అడివి మాట్లాడుతూ... మై బ్రదర్ శేష్ పంజా సినిమాలో చేసిన నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత అతనితో సినిమా చేయాలని అనుకున్నాను. ఒక రోజు శేష్ 'కిస్' మూవీ కథ తో నా దగ్గరికి వచ్చాడు. కథ కొత్తగా అనిపించడంతో... పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయడానికి మాకు రెండు నెలల సమయం పట్టింది.     ఈ సినిమాని షూటింగ్ మొదలు పెట్టె ముందు నేనే డైరెక్ట్ చేద్దామనే ఆలోచన వచ్చింది. కాని వేరే స్క్రిప్ట్ లో బిజీ గా వుండడం వల్ల చేయలేకపోయాను. కిస్ మూవీ చాలా బాగా వస్తోంది. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నమ్ముతాను.. దీని గురించి చెప్పడం కంటే విడుదలైన తరువాత చితాన్ని చూసే ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమాను చూసి ఎంజాయ్ చేశానన్న ఫీలింగ్ పొందుతారన్న నమ్మకం ఉంది. ఈ సమ్మర్ లో సినిమా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

రామ్ చరణ్ 'తుఫాన్'

        మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘తుఫాన్’ సృష్టించబోతున్నారు. జంజీర్ చిత్రంతో రామ్ చరణ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి టైటిల్ గా ‘తుఫాన్’ ఖరారు చేసినట్లు దర్శకుడు అపూర్వ లిఖియా ట్విట్టర్ లో తెలియజేశారు. తెలుగు వెర్షన్ యోగి (చింతకాయల రవి డైరెక్టర్) పర్యవేక్షణలో జరుగుతుంది. షేర్ ఖాన్ గా శ్రీ హరి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ టాలీవుడ్, బాలీవుడ్ లలో కలెక్షన్ల తుఫాన్ సృష్టించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.    

‘అష్టా చెమ్మా’ కలిసి రాలేదు: స్వాతి

  కలర్స్ స్వాతి పేరు వినగానే గలగలా మాట్లాడేసే ఒక చిలిపి అమ్మాయి మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె తెలుగు సినిమాలో ‘అష్టా చెమ్మా’ ఆట మొదలుపెట్టి చాలా కాలం అయినప్పటికీ ఇంతవరకు పట్టుమని పది సినిమాలు కూడా ఆమె చేయలేదు. ‘చేయలేదు అనే కంటే సినిమా ఆఫర్లు దొరకట్లేదు అని చెపితే ఇంకా బాగుంటుందని’ ఆమె నిర్మొహమాటంగా అంది.   “అసలు అష్టా చెమ్మా సినిమా విజయవంతం అయిన తరువాత నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చిపడిపోతాయని అనుకొన్నాను. అందరూ చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకొనేవారే కానీ, ఎవరూ కూడా సినిమా ఆఫర్ ఇచ్చిన పాపాన్న పోలేదు. దానికి తోడూ ఓ నంది అవార్డు కూడా అందుకోవడంతో దర్శక నిర్మాతల దృష్టిలో నేనొక ప్రత్యేక నటిగా మిగిలిపోయి మామూలు పాత్రలకు ఆనకుండా పోయాను. అందువల్లే అడపా దడపా తమిళ్ సినిమాల వైపు కూడా వెళ్లి రావలసి వస్తోంది. అలాగని అక్కడికి వెళ్లి నేనేమి వేలు, లక్షలు సంపాదించేయట్లేదు. ఇప్పటికీ, నేను నా ఖర్చులకి అప్పుడప్పుడు మా డాడీ దగ్గర డబ్బులు అడగక తప్పట్లేదంటే నా పరిస్థితి అర్ధం అవుతుంది. త్వరలో విడుదల కానున్న ‘స్వామీ రారా’ హిట్టయితే కొత్త సినిమాలేమయినా దొరుకుతాయేమో చూడాలి మరి” అంటోంది కలర్స్ స్వాతి.

తమన్ కు ఎక్కువైంది.!

        కుర్రకారును ఊపేసే ట్యూన్స్ ఇస్తూ... రచ్చ చేస్తోన్న సంగీత దర్శకుడు తమన్ కు కాస్త ఎక్కువైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదివరకు... ఒక్క సినిమా కోసం నిర్మాత 5-6 పాటలు ఎంపిక చేసుకోవాల్సి వస్తే... వారికి తమన్ 20 ట్యూన్ల దాకా వినిపించేవాడట. అందులో నిర్మాతకు ఏది నచ్చితే అది ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించేవాడు. కానీ, స్టార్ డమ్ కు చేరుకున్న తరువాత.... ప్రతి నిర్మాతకు సరిగ్గా 5 లేదా 6 ట్యూన్లు మాత్రమే వినిపించి సరిపెట్టేస్తున్నాడట. ఇక నిర్మాతకు వేరే గతి లేక... వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఫిల్మ్ నగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. దీన్ని బట్టే అర్ధమవుతోంది తమన్ కు ఎంత ఎక్కువైందో...!