మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ ఏడాది హోలీ పండుగ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలకి కొత్త రంగులద్దింది. 2007లో చిరుత పులిలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రామ్ చరణ్ తేజ్ బాక్సాఫీసులు బద్దలు కొట్టగల అసలుసిసలయిన మగధీరుడుగా నిలిచి, టాలివుడ్ లో అంతటా తానే అన్నట్లు రచ్చరచ్చ చేసేస్తూ నాయక్ అనిపించుకొన్నాడు.
ఇప్పుడు హిందీ చిత్ర సీమలోకి జంజీర్ (సంకెళ్ళు)తో అడుగుపెడుతున్నరామ్ చరణ్ తేజ్, బాలివుడ్ ను కూడా తన జంజీర్ లో బందించకమానడని చెప్పవచ్చును. జంజీర్ సినిమా ట్రైలర్ చూసిన అమితాబ్ బచ్చన్, రామ్ చరణ్ తేజ్ పై ట్వీట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారంటే ఆ సినిమా ఏవిధంగా ఉండబోతోందో అర్ధం అవుతుంది.
ఇక, రాష్ట్రంలో ఇంతవరకు వచ్చిన అన్ని తుఫాన్లు ప్రజలకి తీవ్ర నష్టాలు, కష్టాలు తెచ్చిపెట్టగా, ఇప్పుడు రాష్ట్రం మీదకి దూసుకు వస్తున్నఈ తుఫాన్ మాత్రం అటు నిర్మాతలకి కాసుల వర్షం, ఇటు ప్రజలకి ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ మెగాభిమానులకి ఎంతో ఆనందం తెచ్చిపెట్టబోతోంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ తుఫాన్ వీలయినంత త్వరగా రావాలని కోరుకొంటున్నారు.
రామ్ చరణ్ తేజ్ ఇంత వరకు చేసిన 5 సినిమాలలో 4 సినిమాలు- చిరుత, మగధీర, రచ్చ, నాయక్ సూపర్ హిట్టవగా, త్వరలో విడుదల కానున్న ‘తుఫాన్’ మరియు ‘జంజీర్’ సినిమాలు ఆ లిస్టుకి మరో రెండు సినిమాలను జతచేయనున్నాయి. అంటే రామ్ చరణ్ తేజ్ చేసిన 7 సినిమాలలో 6 హిట్స్ అన్నమాట. రామ్ చరణ్ తేజ్ ఈ 7 సం.లలో చేసిన కృషి, పడిన కష్టం వలననే ఇటువంటి అరుదయిన రికార్డులు సాధించగలిగాడని చెప్పవచ్చును.
రాశి కంటే వాసి మిన్న అని నమ్మే మెగా కుటుంబం నుండి వచ్చిన వాడవడం వలన రామ్ చరణ్ తేజ్ ఆలస్యమయినా తనకు తగిన కధలను ఎంచుకోవడంలో చూపిన నేర్పు, అదృష్టవశాత్తు వాటిని అంత చక్కగా తీర్చి దిద్దగలిగిన ప్రతిభావంతులయిన దర్శకులు ఆయనకు దొరకడంతో ఈ అరుదయిన రికార్డు సాదించగలిగారు.
ఇప్పుడు జంజీర్, తుఫాన్ సినిమాలకు దర్శకత్వం వహించిన అపూర్వ లకియా కూడా రామ్ చరణ్ తేజ్ సినీ జీవితంలో మరో రెండు మైలు రాళ్ళు ఏర్పాటు చేస్తాడని ఆశిద్దాము. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రామ్ చరణ్ ఎవడు ఎంతటి వాడో త్వరలో మనకి చూపించనున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి తెలుగు వన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అయన మరిన్ని మంచి సినిమాలు చేసి తెలుగు చిత్ర సీమ కీర్తి పతాకను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని కోరుకొంటోంది. …