నేను ఒక సూపర్ మ్యాన్ ని: రామ్ గోపాల్ వర్మ
posted on Mar 8, 2013 @ 2:10PM
మన తెలుగు చిత్రపరిశ్రమలో కొంచెం తలతిక్క మనిషిగా పేరొందిన రాంగోపాల్ వర్మ, తానూ ఇటీవల విడుదలయిన ‘26/11’ సినిమా నిర్మిస్తున్నపుడు తనకు ఎదురయిన అనుభవాలతో పూర్తిగా మారిపోయానని చెప్పడం మొదలుపెట్టినప్పుడు, కొందరు ఆయన మాటలు నమ్మినా చాలామంది ఈ డ్రామా కూడా ఆయన సినిమా ప్రచారంలో భాగమేనని తేల్చిపడేశారు. ‘వర్మ మారడం అసంభవం’ అని వారు బల్లగుద్ది మరీ చెప్పారు. బహుశః వారి మాటలను నిజం చేస్తున్నట్లు, వర్మలోంచి ఈ మద్యనే మన పాత వర్మ బయటకి వచ్చాడు.
‘26/11’ సినిమా విజయవంతం అయిన సందర్భంగా మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు తనదయిన శైలిలో ఆయన జవాబులు చెపుతుంటే, మీడియావారు నోరు వెళ్ళబెట్టక తప్పలేదు. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ “నన్ను నేను ఎల్లపుడూ ఒక సూపర్ మ్యాన్ గా భావించుకొంటాను, కనుక నాకు సహజంగానే స్నేహితులు అవసరం ఉండరు. భావోద్వేగంతో నేనెవరి భుజంపైనో తలవాల్చి సేద తీరాలని కూడా ఎన్నడూ అనుకోలేదు. నేను సినిమా నిర్మించే సమయంలో యూనిట్ సభ్యులతో మాట్లాడుతాను, కానీ వారితో ఏవిధమయిన అనుబంధం ఏర్పరుచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల, ఒక సినిమా పూర్తీ కాగానే ఆ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులతో నా సంబందాలు కూడా తెగిపోతాయి."
"నాకు సినిమాలే లోకం. నేను ఎల్లపుడు సినిమాలు తీస్తూనో లేక చూస్తూనో ఉంటాను గనుక పార్టీలు, పెళ్ళిళ్ళు , పండుగల కోసం వెచ్చించేందుకు నాకు సమయం ఉండదు. నా సినిమాలలో పెద్ద హీరోల కంటే చిన్న హీరోలను పెట్టుకోవడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను. పెద్ద హీరోలు వారి ఇమాజ్, అనవసర బేషజాలు వంటి బ్యాగేజ్ వెంట మోసుకువస్తారు. దానిని భరించడం నావల్లకాదు. అందువల్ల నేను చిన్నహీరోలకే ఎక్కువ ప్రాదాన్యం ఇస్తాను,” అన్నారు రామ్ గోపాల్ వర్మ.
‘హమ్మయా! మన రాంగోపాల్ వర్మ ఏమాత్రం మారలేదు’ అని తేలికగా ఊపిరి తీసుకొని మీడియావారు బయట పడ్డారు.