చిరంజీవి 150 సినిమాలో నటిస్తా: డా.రాజశేకర్
posted on Mar 8, 2013 5:43AM
తెలుగు సినిమారంగం నుండి రాజకీయాలలోకి ప్రవేశించిన మెగా స్టార్ చిరంజీవికి, డా. రాజశేఖర్ దంపతులకి మద్య ఉన్నవిరోధం గురించి కొత్తగా చెప్పుకోవలసినది ఏమి లేదు. కానీ, చిరంజీవి ఆ విషయాన్నీ నేరుగా ఎప్పుడుఎవరితోను ప్రస్తావించక పోయినప్పటికీ, డా. రాజశేఖర్ దంపతులు మాత్రం మీడియా ముందు ఆ విషయాన్నీ చాలా సార్లు ప్రస్తావిస్తుంటారు.
ఆయన నటించిన ‘మహంకాళి’ సినిమా ఈ రోజు విడుదల అవుతున్నసందర్భంగా నిన్నఒక తెలుగు న్యూస్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యులో తన మనసులో మాటలు కుండ బద్దలు కొట్టినట్లు బయట పెట్టారు.
ప్రస్తుతం సైద్ధాంతికంగా తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నపటికీ, చిరంజీవి చేరిక తరువాత అక్కడా తమకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, సాక్షాత్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి పార్టీ పెద్దలు సైతం తమతో మాట్లాడేందుకు వెనకాడుతున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం వద్ద చిరంజీవికి ఉన్న పలుకుబడే అందుకు కారణం అన్నారు. అందువల్ల, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇబ్బందులు పడేకంటే, తెలుగుదేశం పార్టీలోకో లేక బీజేపీలోకో మారిపోవాలని అనుకొంటున్నట్లు ఆయన మీడియాకి తెలిపారు.
సినిమా రంగంలో చిరంజీవి ఉన్నంత కాలం తాము అనేక సమస్యలను ఎదుర్కొన్నామని డా.రాజశేకర్ చెప్పారు. అయితే, ఆయన రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత కూడా పరిశ్రమపై ఉన్న ‘మెగా కుటుంబ’ ప్రభావం వల్ల ఇంకా తాము అవే సమస్యలు ఎదుర్కొంటూన్నామని అన్నారు. సినీ పరిశ్రమలో తమ స్నేహితులు వ్యక్తిగతంగా తమ మాటలను మెచ్చుకొన్నపటికీ అదే పనిని నలుగురిలో మాత్రం చేయలేకపోవడానికి కారణం, పరిశ్రమపై ఉన్న ‘మెగా కుటుంబ’ ప్రభావమే అని ఆయన అన్నారు.తమకు అనుకూలంగా మాట్లాడితే మెగా కుటుంబం ఆగ్రహానికి గురయి ఇబ్బందులు వస్తాయనే భయంతో చాలామంది తమను కలిసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారని ఆయన తెలిపారు. మెగా కుటుంబ ప్రభావం వల్లనే తమకు టాలీవుడ్ లో తగినంత సహకారం కూడా కరువయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
కానీ, తానూ మనసులో ద్వేషం పెట్టుకొని ఎవరితోను శత్రుత్వం కోరుకోనని డా.రాజశేకర్ చెప్పారు. ఇదివరకు కొంత మంది తనను చిరంజీవి 150వ సినిమాలో ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా? అని అడిగితే తానూ ఏమాత్రం సంశయించకుండా సరేనన్నాని తెలిపారు. ఇప్పటికీ, అటువంటి అవకాశం వస్తే తప్పకుండా చేసేందుకు సిద్ధం అని తెలిపారు. అయితే, తన పాత్ర తన స్థాయికి తగ్గటుగా ఉండాలని అన్నారు. తన అంకుశం సినిమాతో ప్రభావితులైన చాలామంది యువకులు పోలీసు ఉద్యోగాలపట్ల ఆసక్తి చూపడం మొదలుపెట్టారని, మళ్ళీ ఇప్పుడు తన సరికొత్త సినిమా ‘మహంకాళి’ కూడా ఆ స్థాయికి తగ్గకుండా ఉంటుందని అన్నారు.