చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా పెద్దిరెడ్డి గెలుపు
posted on Jun 7, 2024 @ 4:42PM
ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిట్లుగా ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి. తన సొంత నియోజకవర్గంలో విజయం కోసం చెమటోడ్చిన పెద్ది రెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానంటూ చేసిన సవాళ్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు, వాస్తవానికి వైసీపీలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేత అనడంలో సందేహం లేదు. ఈ సారి ఎన్ఆనికలలో వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు.
2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లాలో కుప్పం వినా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించడం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డే. ఆ ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజవర్గాలకు గానూ 13 స్థానాలలో వైసీపీ విజయం సాధించడంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో స్థాయికి మించిన సవాళ్లు చేశారు పెద్ది రెడ్డి. 2024 ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబును ఒడిస్తానని శపథం చేశారు.
సరే 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వెలువడ్డాయి. కుప్పం నుంచి నారా చంద్రబాబును ఓడిస్తానంటూ సవాళ్లు, శపథాలు చేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పుంగనూరు నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా విజయం సాధించారు. కుప్పంలో చంద్రబాబు గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే దాదాపు 18 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీ సాధించారు. ఆయనకు 48వేల ఆరు ఓట్ల మెజారిటీ వచ్చింది. అదు పుంగనూరులో పెద్దరెడ్డి విజయం సాధించినా ఆయన మెజారిటీ కేవలం 6 వేల 619 ఓట్లు మాత్రమే.
ఇక పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 76071 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అదే మిథున్ రెడ్డి విజయానికి కారణమైంది. రాజంపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థి నిలబడి ఉంటే మిథున్ రెడ్డి కచ్చితంగా పరాజయం పాలయ్యే వారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాజంపేటలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైతుంది. రాజంపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో ప్రజలు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి లోక్ సభ కు వచ్చే సరికి మిథున్ రెడ్డికి ఓటేశారు. మొత్తం మీద చంద్రబాబును ఓడిస్తానంటూ ఎగిరెగిరి పడిన పెద్దరెడ్డికి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా పుంగనూరు నుంచి గట్టెక్కారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.