రామోజీరావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
posted on Jun 8, 2024 8:47AM
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జూన్ 8) తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈనాడు తెలుగువారి గుండె చప్పుడుగా మారిపోయింది.
అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీ సృష్టికర్త రామోజీరావు. రామోజీరావు మృతి పట్ల తెలుగుదుశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీ మృతి తీరని లోటుగా పేర్కొన్న చంద్రబాబు సమాజహితం కోసం నిలబడిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు.
రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న ఆయన రామోజీ అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతకు మారుపేరని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.