జగన్ లిక్కర్ స్కామ్... 7 వేల కోట్లు!
posted on Jun 16, 2024 @ 7:33PM
ఇంతకాలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చదివి ‘‘అమ్మో ఎంత పెద్ద స్కామో’’ అనుకుంటున్నాం కదా.. ఆ స్కామ్‌కి తాత, ముత్తాత లాంటి భారీ లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కామ్‌తో పోల్చితే, ఢిల్లీలో జరిగింది టుమ్రీ స్కామ్. అది వందల కోట్ల స్కామ్ మాత్రమే.. కానీ, మన జగన్ చేసిన స్కామ్ వాల్యూ 7 వేల కోట్ల కంటే ఎక్కువే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మన మాజీ తెలంగాణ తల్లి కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో వున్న సంగతి తెలిసిందే. ఆ స్కామ్‌లో నిందితుడిగా సాక్షాత్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే వున్నారు. వందల కోట్ల స్కామ్ జరిగిందని భావిస్తున్న ఆ స్కామ్ వల్ల ముఖ్యమంత్రినే జైల్లో వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా వుండబోతోందో ఊహించుకోవచ్చు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఏపీ సీఐడీ ఈ స్కామ్ మీద విచారణ ప్రారంభించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించి, జగన్‌కి వేల కోట్లు దోచిపెట్టిన వాసుదేవరెడ్డి ఇంటిలో మూడు రోజుల పాటు సోదా నిర్వహించింది. స్కామ్‌కి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. అరెస్టు గండం నుంచి గట్టెక్కడానికి వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేసుకుంటే, హైకోర్టు నో చెప్పింది. దాంతో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారిపోయి, ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారన్నది పూస గుచ్చినట్టు చెప్పడానికి సిద్ధమయ్యారని, దానికోసం ప్రభుత్వ అధికారులతో రాయబారాలు కూడా నడిపారన్న వార్తలు వస్తున్నాయి.
ఈ ఏపీ లిక్కర్ స్కామ్ మీద సీఐడీ పూర్తి స్థాయి విచారణ జరుపుతోంది. ఏపీలో ఇంతకాలం అమల్లో వున్న లిక్కర్ పాలసీ పెద్ద స్కామ్ అని సీఐడీ ప్రాథమికంగా తేల్చింది. దీంతో అరెస్టుల పర్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశ చరిత్రలో అతి పెద్ద లిక్కర్ స్కామ్‌కి తెర తీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ కేసులో ఏ1గా నిలవనున్నారు. ఇప్పటికే చాలా కేసులలో ఏ1 హోదా పొందిన జగన్‌కి, మరో ఏ1 హోదా లభించనుంది. ఏది ఏమైనా, విషం లాంటి నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు జగన్ ప్రభుత్వం తీసేసింది. ఆ ఉసురు జగన్‌కి తప్పకుండా తగిలి తీరుతుంది.