వైసీపీవి సంతాపసభలు!
posted on Jun 15, 2024 @ 2:42PM
చరిత్ర కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసిన వైసీపీ ఇప్పుడు ముఖం కాపాడుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఫలితాల వెల్లడి తరువాత కొన్ని రోజుల పాటు వైసీపీ కార్యాలయంలో శ్మసాన నిశ్శబ్దం తాండవించింది. ఆ పార్టీ నాయకుల నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. తరువాత ఎలాగో తమాయించుకుని ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఎవరికి వారు పార్టీ ఓటమికి కుంటి సాకులు చెబుతూ వచ్చారు.
ఇప్పుడు ఆ పని జగన్ కూడా మొదలెట్టేశారు. ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా మేళ్లు చేసినా వారు మనను తిరస్కరించారని పార్టీ రాజ్యసభ, లోక్ సభ సభ్యులతో సమావేశంలో చెప్పారు. అదే సమయంలో తమకు పార్లమెంటులో బలం ఉందనీ, సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే బలం లేని లేని బీజేపీకి పార్లమెంటులో మన అండకావాలనీ పార్టీ సభ్యులకు ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు. ప్రజలు తప్పు తెలుసుకుని త్వరలో మనకు మద్దతుగా నిలుస్తారన్న ధీమా కూడా వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారన్న జగన్ పార్టీ సభ్యులు ధైర్యంగా ఉండాలనీ మంచి రోజులు ముందున్నాయని చెప్పుకొచ్చారు.
అయితే జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు గుప్పించారు. జగన్ కు ఆయన పార్టీ సభ్యులకూ దిమ్మదిరిగేలా జగన్ ఇటీవలి భేటీలను జనం లేని సంతాప సభలుగా అభివర్ణించారు. ఇటీవలి ఎన్నికలలో జనం జగన్ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేని పార్టీగా తేల్చేసినా వైసీపీ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని ఎద్దేవా చేశారు. మొత్తం మీద జగన్ ఇటీవలి కాలంలో పార్టీ నేతలతో నిర్వహిస్తున్న సమావేశాలను సంతాప సభలుగా నెటిజనులు అభివర్ణిస్తున్నారు.