విడదల రజని.. రూటు మార్చేశారా?!
posted on Jun 16, 2024 7:18AM
సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను..అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మహిళా నేత.. అవసరాన్ని బట్టి రాజకీయాల్లో తన పాత్రను మార్చుకోవటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయల్లో అండగా నిలిచిన నేతలకే పంగనామాలు పెట్టడంలో ఆమె దిట్ట. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరా అని అనుకుంటున్నారా? ఈ ఉపోద్ఘాతమే చాలు ఆమె ఎవరో ఇట్టే తెలిసిపోవడానికి.. ఆమె మాజీ మంత్రి, విడ దల రజనీ. వైసీపీ అధికారంలోఉన్న ఐదేళ్ల కాలంలో విడదల రజనీ పేరు ఏపీ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ మారుమోగిపోయింది. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విడదల రజనీ.. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆమెకు కొద్దికాలంలోనే రాజకీయాల్లో గొప్ప మహిళానేతగా, రాష్ట్ర రాజకీయాల్లో చక్రంతిప్పే నేతగా ఎదగాలని ఆరాటం మెండు. రాజకీయాల్లో గొప్ప నేతగా, ప్రజానేతగా ఎదగాలంటే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో కీలకభూమిక పోషించాలి. ఆయితే ఆమెకు ఆ తీరాకలేకపోయో, లేక షార్ట్ కట్ లు ఉండగా కష్టపడటం ఎందుకనుకున్నారో కానీ తన ఎదుగుదలకు ఆమె జనాలను కాకుండా సోషల్ మీడియాను నమ్ముకున్నారు. అయితే తనను గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోకపోవటంతో నియోజకవర్గం ప్రజలు ఆమెను లైట్ తీసుకున్నారు.
2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం సర్వే నిర్వహించగా.. చిలకలూరి పేట నియోజకవర్గంలో విడదల రజనీ ఓటమి ఖాయమని స్పష్టమైంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పంపించారు. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆమె.. జగన్ నిర్ణయానికి ఎదురుచెబితే ఉన్నసీటుకూడా పోతుందన్న భయంతో గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. తెలుగుదేశం అభ్యర్థి గెల్లా మాధవిపై పోటీలో నిలిచారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు విడదల రజనీ అండ్ ఆమె గ్యాంగ్ అనేక కుట్రలు చేశారు. కానీ, గుంటూరు వెస్ట్ ప్రజలు రజనీ కుట్రలను తిప్పికొట్టి 49,772 ఓట్ల మెజార్టీతో గెల్లా మాధవిని గెలిపించారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే రజనికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిపదవి దక్కినప్పటికీ.. ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేక పోయారు. మంత్రి పదవిని ప్రజల కోసం కాకుండా అక్రమార్జనకు ఉపయోగించినట్లు ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విడ దల రజనీ నోరు మూగబోయింది. ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఇటీవల జగన్ తో వైసీపీ నేతల భేటీలో ఆమె ప్రత్యక్షమయ్యారు.
జగన్ తో సమావేశం సందర్భంగా విడుదల రజనీ తన ఆవేదనను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తనకు చిలకలూరి పేట నియోకవర్గంనుంచే పోటీకి అవకాశం ఇస్తే విజయం సాధించేదానినని చెప్పుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ ఘోర ఓటమి తరువాత సోషల్ మీడియాలో బూతుపురాణంతో రెచ్చిపోయే వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విడదల రజనీ లాంటి నేతల మూలంగానే వైసీపీ దారుణ ఓటమికి గురైందని శ్రీరెడ్డి తనదైనశైలిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రజనీ లాంటి నేతలకు పార్టీలో హైప్ ఇవ్వవద్దని ముందు నుంచే చెబుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని, ఫలితంగా ప్రజలు ఘోరంగా ఓడించారంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత పరిణామాలు ఎలాఉన్నా.. ప్రస్తుతం విడదల రజనీ వైసీపీలోనే ఉంటారా? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతున్నది. పరిస్థితులను బట్టి తన పాత్రను మార్చుకోవటంలో దిట్టగా పేరున్న విడదల రజనీ వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది
విడదల రజనీ తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభించారు. కొద్దికాలానికి వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విడుదల రజనీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆమెపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం కార్యకర్తలు ఆమె పార్టీ కార్యాలయంపై రాళ్లదాడి చేశారు. తెలుగుదేశంలోకి తిరిగివచ్చేందుకు రజనీకి అవకాశం లేదనే చెప్పొచ్చు. బీజేపీ, జనసేన పార్టీల్లో ఏదోఒక పార్టీలో విడుదల రజనీ చేరడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. బీజేపీలోకి వెళ్లేందుకు ఇప్పటికే ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే, తన భర్త కాపు సామాజిక వర్గం కావటంతో.. కాపు పెద్దల సహకారంతో జనసేన పార్టీలో చేరేందుకు భార్యాభర్తలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పెద్దలు పార్టీలో కీలక పదవి ఇస్తామని రజనీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలోనే కొనసాగితే మంత్రి హోదాలో చేసిన అవినీతి అక్రమాలను అధికార పార్టీ వెలికితీసే అవకాశం ఉంటుందని, అదే జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రజనీ భావిస్తున్నారట. అన్నిఅంశాలను బేరీజు వేసుకొని తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన లేదా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విడుదల రజనీ సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియా స్టార్‌గా పేరుపొందిన విడుదల రజనీ ఏ పార్టీలోకి వెల్లారన్న అంశంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.