ముఖ్యమంత్రుల సమావేశం సంపూర్ణం..!
posted on Jul 6, 2024 @ 9:48PM
విభజన సమస్యల పరిష్కారమే ప్రధానాంశంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు వుండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరంగా తలెత్తే చిక్కుల గురించి కూడా చర్చించారు. షెడ్యూలు 10లోని అంశాల పైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు.
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఏడీజీ ఇంటెలిజెన్స్ శేషాద్రి, ఐఏఎస్ అధికారులు రఘునందన్ రావు, కృష్ణభాస్కర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ఐఏఎస్ అధికారులు జానకి, కార్తికేయ మిశ్రా (సీఎంఓ), ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన 15 ప్రాజెక్టులకు సంబంధించి వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు చెల్లింపులు, హైదరాబాద్‌లో వున్న మూడు భవనాలను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాల గురించి చర్చించారు.
అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల వివరాలను వెల్లడించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీ, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మంత్రులతో కూడా కమిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు రాష్ట్రాలూ సంయుక్త కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.