22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
posted on Jul 6, 2024 @ 4:37PM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 23వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరుగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అక్కౌంట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల వత్సరం కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ పద్దుల నిర్వహణకు వెసులుబాటు కలిగే విధంగా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు.
ఈ నెల 23న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు సృష్టించనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనతను సొంతం చేసుకుంటారు. ఇంతకు ముందు మాజీ ప్రధాని మొరార్జీదేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆయన వరుసగా ఐదుసార్లు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.