జగన్ విషాద యోగం.. వైసీపీ ఎమ్మెల్సీలు జంప్?

జగన్ తన పార్టీ పరాజయం తరువాత అసెంబ్లీలో బలం లేకపోయినా తమకు శాసనమండలిలో బలం ఉందనీ, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామనీ ధీమాగా మాట్లాడారు. అయితే రోజుల వ్యవధిలోనే జగన్ లో ఆ ధీమా మాయమైపోయింది. పరాజయం తరువాత పులివెందుల, అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఏపీకి తిరిగి వచ్చిన తరువాత ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయనే స్వయంగా రాజ్యసభలో మనకు ఇప్పుడు బలం ఉన్నా ముందు ముందు వారిలో ఎందరు తమ పార్టీలో ఉంటారో? ఎందరు పార్టీని వీడతారో క్లారిటీ లేదని చెప్పారు. ఎమ్మెల్సీలు మాత్రమే కాదు.. అసలు పార్టీలో ఎందరు ఉంటారు? ఎందరు గోడ దూకేస్తారు? అన్నది తనకు అర్ధం కావడం లేదంటూ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలిలో ఉన్నబలంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెడదామన్న జగన్ ఆశలు ఆవిరి అయిపోయినట్లు ఆయన మాటలే తేటతెల్లం చేస్తున్నాయి.  జగన్ ఆవేదన ఇక్కడితో ఆగలేదు.. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెడతారు. అటువంటి వారిని నిలువరించడం సాధ్యం కాదని, వారెవరూ చెప్పినా వినే పరిస్థితి లేదు. మనమేం చేయలేం.. వెళ్ళేవారు వెళ్ళనివ్వండి.. నిలబడాలనుకునే వారు నాతో ఉంటారంటూ జగన్ పార్టీ నుంచి వలసలను నిలువరించడం తన వల్ల కాదు..  తన మాట వినేవారెవరూ లేరని చెబుతూ చేతులెత్తేశారు. జగన్ ప్రసంగం విన్న పార్టీ నేతలు విస్తుపోయారు. సమావేశం తరువాత అంతర్గత సంభాషణల్లో తమ దారి తాము చూసుకోవడమే మేలు, జగన్ రెడ్డి కూడా అదే చెబుతున్నారని చర్చించుకున్నారు. జగన్ అక్కడితో ఆగలేదు. పార్టీ పెట్టినప్పుడు అమ్మా, తానూ మాత్రమే ఉన్నామని, అయినా ఇంత దూరం వచ్చాం. మళ్లీ మొదటి నుంచీ ప్రారంభిద్దాం అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు అమ్మ కూడా నీతో లేదుగా జగన్ అని పార్టీ వర్గాల నుంచే సెటైర్లు పేలుతున్నాయి.   జగన్ పార్టీలోనే కొనసాగుదామనుకునే ఎమ్మెల్సీలు సైతం మండలిలో  అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను వ్యతిరేకించి తమ రాజకీయ భవిష్యత్ ను మరింత అంధకారబంధురమౌతుందని భయపడుతున్నారు.  సరే మొత్తం మీద జగన్ ప్రసంగం మండలిలో కూడా బలం ఉండే అవకాశం లేదని తేటతెల్లం చేసేసింది.  అయితే  ఎంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు గోడదూకేస్తారు, వారిలో ఎంత మంది తెలుగుదేశం గూటికి చేరతారు అన్న స్పష్టత లేదు. కానీ వైసీపీ వర్గాలు మాత్రం మండలిలో వైసీపీ పక్షాన్ని టీడీపీలో విలీనం విలీనం అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు.  

సీఎం హోదాలో ఎన్టీఆర్‌ ట్రస్టుకి చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టుకు రానున్నారు. ఈనెల 7వ తేదీన చంద్రబాబు రాకను పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఆ సమావేశం ముగిసిన మర్నాడు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి రానున్నారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ  తెలుగుదేశం నాయకులతో భేటీ అవుతారు. తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాల గురించి తెలంగాణ తెలుగుదేశం నాయకులతో చర్చించే అవకాశం వుంది.

టిడిపికి టాప్ ప్రియారిటీ... రామ్మోహన్ నాయుడుకు రెండు కమిటీల్లో చోటు

కేంద్రంలో బిజెపి  మూడోసారి అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమిక వహించింది. మేజిక్ ఫిగర్ దాటేయడానికి ఆ పార్టీ దోహదపడింది. కేంద్రంలో మూడోసారి అధికార బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సర్కారు.. మూడు వారాల తర్వాత కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. దేశ భద్రత, పార్లమెంట్ వ్యవహారాలు సహా పలు కీలక కమిటీలను బుధవారం ప్రకటించింది. ఈ కమిటీలలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీకి విశేష ప్రాధాన్యం దక్కింది. టీడీపీతో పాటు జేడీయూ, ఎల్జేపీ సహా ఇతరత్రా చిన్న పార్టీలకు కూడా బీజేపీ తగిన ప్రాధాన్యత కల్పించింది. దేశ భద్రత, రక్షణ శాఖ కొనుగోలు వ్యవహారాలు చూసే అత్యున్నత కమిటీలో ప్రధాని మోదీ హెడ్ గా, హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులు మెంబర్లుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రెండు కమిటీల్లో చోటు దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయన ఉన్నారు. అదేవిధంగా, రాజకీయ వ్యవహారాల కమిటీలో బొగ్గు గనుల శాఖ మంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో మోదీ చోటిచ్చారు.

చంద్రబాబు హస్తిన పర్యటన... అందరి దృష్టీ మోడీతో భేటీపైనే!

చంద్రబాబు ఢిల్లీ  పర్యటనతో  రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఆశ సర్వత్రా వ్యక్తమౌతోంది.  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్  నేపథ్యంలో చంద్రబాబు మోడీతో భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  మోదీతో సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తారా అన్నదానిపైనే  రాష్ట్రంలో   చర్చ జరుగుతున్నది. పోలవరం డయాఫ్రేం వాల్  కొత్తగా నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు కుష్విందర్ ఓహ్రీ స్పష్టంగా ప్రకటించడం, విదేశీ నిపుణుల మధ్యంతర నివేదికలో పోలవరం పనులు ఇక వేగంగా ముందుకు సాగే అవకాశాలున్నాయని తేలడంతో  బాబు హయాంలో ఏపీ ప్రగతి బాటలో పరుగులు తీస్తుందన్న నమ్మకం అందరిలో కలిగింది. గతంలోలా కేంద్రం కూడా రాష్ట్రం విషయంలో పట్టీపట్టనట్టుగా ఉండే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో  గతంలో వాజ్ పేయి హయాంలో ఎలా అయితే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సమృద్ధిగా నిధులు రాబట్టుకున్నారో.. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇతోధిక సహకారం, సహాయాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు.  ప్రజా రాజధాని అమరావతిపై  మంగళవారం (జులై 3) సీఎం శ్వేత పత్రం విడుదల చేసారు. అంతకు ముందే  పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ హయాంలో ఆ రెండింటినీ ఎలా నిర్వీర్యం చేశారు. అరాచకత్వంతో వాటిని ఎలా పాడుబెట్టారో ఆ శ్వేతపత్రాల్లో సవివరంగా పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు మోడీతో భేటీలో ఈ రెండింటి పూర్తికి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలపై గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని అంటున్నారు.   త్వరలో కేంద్రం బడ్జెట్ పెట్టనుంది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నది కూడా చంద్రబాబు ప్రధాన డిమాండ్ గా ఉంటుందని చెబుతున్నారు.  అమరావతి,పోలవరంతో పాటు రాష్ట్రాభివృద్ధి నిధులకోసమే అయన తన వెంట ఆర్థికమంత్రి ని కూడా తీసుకుని వెళ్లారని అంటున్నారు. చంద్రబాబు ప్రధానిమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. ఆ భేటీల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చించనున్నారు.  మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి, కూటమికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

జగన్‌కి కేతిరెడ్డి బైబై!

జగన్ పార్టీకి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్‌బై కొట్టబోతున్నట్టు సమాచారం. జగన్ చేసిన దుర్మార్గపు పాలన కారణంగా మొన్నటి ఎన్నికలలో గెలవాల్సిన వాళ్ళు కూడా ఓడిపోయారు. వాళ్ళలో కేతిరెడ్డి కూడా ఒకరనే అభిప్రాయాలు వున్నాయి. ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పటి నుంచి గుడ్మాణింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల దగ్గరకి వెళ్తూ వుండేవారు. ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల గురించి అలా వుంచితే, కేతిరెడ్డి అంత ఈజీగా ఓడిపోయే నాయకుడు కాదన్న అభిప్రాయాలైతే వున్నాయి. ఓడిపోయినప్పటి నుంచి తీవ్రమైన డిప్రెషన్లో  పడిపోయిన కేతిరెడ్డి ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. ఇక జగన్‌తో వుంటే తనకు రాజకీయ భవిష్యత్తే వుండదని అర్థం చేసుకున్న ఆయన త్వరలో జంపింగ్ జపాంగ్ మంత్రం పఠించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన చేరబోయే పార్టీ తెలుగుదేశం మాత్రం కాదు.. ఎందుకంటే, వైసీపీ నాయకులకెవరికీ టీడీపీలోకి నో ఎంట్రీ! 

రేవంత్ కు మొదలైన అసమ్మతి సెగ.. ఇంటా బయటా చిక్కులేనా?

తెలంగాణలో రేవంత్  సర్కార్ కు లోపలా బయటా కూడా సమస్యలు పెరుగుతున్నాయి.  రైతులకు ఇచ్చిన పెట్టుబడి, రుణమాఫీలపై దృష్టి పెట్టి ఆ హామీలు త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్షం నుంచే కాదు స్వపక్షం నుంచి కూడా రేవంత్ పై ఈ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతోంది. అంతే కాకుండా ఆయన అందరినీ  కలుపుకుని పోవటంలేదన్న ఆరోపణలు కాంగ్రెస్ సీనియర్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెసును అధికారంలోకి తీసుకురావటంలో దూకుడు పెంచి బీఆర్ఎస్ ను అధ:పాతాళానికి నెట్టడంతో   ఆయన ఒక్కసారిగా ప్రజానాయకుడిగా ఎదగడమే కాకుండా..  రాష్ట్ర కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా మారారు. అధిష్ఠానం సైతం ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పట్టడంతోనే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉదాహరణకు ప్రగతి భవన్ పేరును ఫూలే ప్రజాభవన్ గా మార్చడం, ప్రజాభవన్ కు ముందున్న బారికేడ్లను, ఇనుప కంచెలను తొలగగించడంతో ప్రజలకు చేరువయ్యారు. ఇక ఎన్నికల హామీలను వంద రోజుల గడువులో నెరవేర్చడంలో చాలా వరకూ కృతకృత్యుడు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై జనంలో  హర్షం వ్యక్తమైంది. అయితే ఇక మిగిలిన హామీలను నెరవేర్చేందుకు నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది.  రాజకీయం వేరు, పాలన వేరు అంటూ రేవంత్ రెడ్డి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉంటున్నారు. దీని వల్ల రాష్ట్రంలో ఎదో మేరకు పనులు సాగుతున్నాయి.  భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని  పౌర ప్రాంతాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రేవంత్ తీసుకురాగలిగారంటే అందుకు ఆయన కేంద్రంతో వ్యవహరించిన తీరే కారణమనడంలో సందేహం లేదు.   అయితే గతంలో మేడిగడ్డ పూర్తిగా దెబ్బతిందని మరమ్మతులు  సాధ్యం కాదని  ప్రకటించి రేవంత్ ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు.  ఎల్అండ్ టీ కంపెనీ విజయవంతంగా మేడిగడ్డ మరమ్మతు లు చేయడంతో  విపక్ష విమర్శలకు టార్గెట్ గా మారారు.    ఇక ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేర్చడంలో సక్సెస్ అయిన రేవంత్.. ఆ వ్యవహారంలో సొంత పార్టీ నేతలను ఒకింత నొచ్చుకునేలా చేశారు. దీంతో సొంత పార్టీలోనే రేవంత్ కు ఇప్పుడు అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. అదే సమయంలో మేడిగడ్డ మరమ్మతులు విజయవంతం కావడం బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ సర్కార్ ను దుయ్యబట్టడానికి ఒక అవకాశం లభించింది. మేడిగడ్డ విషయంలో రేవంత్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలడంతో బీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది.   ఏదిఏమైనా రేవంత్ నిధులను సమకూర్చుకుని రైతుల హామీలను నేరవేర్చడం ఆయన ముందు ఉన్న ప్రధాన టాస్క్. దాన్ని నెరవేర్చి రేవంత్ చేతలమనిషి అని రుజువు చేసుకోవడం ద్వారా పార్టీలోనూ ప్రభుత్వంలోని పట్టు సాధిస్తేనే విమర్శకుల నోళ్లు మూతలు పడే అవకాశం ఉంది. లేకుంటే ముందు ముందు ఇంటా బయటా కూడా రేవంత్ కు చిక్కులు తప్పక పోవచ్చు. 

ఎపిలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా 

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. ఏప్రిల్‌లో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్‌కు 92 వేలమంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అయితే సిలబస్‌లో మార్పులు, ఎన్నికల ప్రక్రియ కారణంగా పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని, కాబట్టి పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

పీఎం మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ!

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పాతాళంలోకి పడిపోయిన ఆంధ్రప్రదేశ్  ఆర్థిక పరిస్థితిని ఎలా పైకి తీసుకురావాలన్న అంశం మీద ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు వివిధ అంశాల మీద చర్చించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా చంద్రబాబు భేటీ అవనున్నారు.

పోలవరం డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలి.. మరమ్మతులకు చాన్స్ లేదు!

జగన్ నిర్వాకం వల్ల పోలవరం నిర్మాణం మళ్లీ మొదటికొచ్చినట్లైంది. జగన్ రివర్స్ వ్యవహారం కారణంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే అది అలా ఇలా కాదు.. ఇంకెందుకూ పనికిరానంతగా దెబ్బతిన్నదన్న సంగతి నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడం తప్ప మరో మార్గం లేదని కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్విందర్ ఓహ్రా వెల్లడించారు. కాగా పోలవరం ప్రాజెక్టు సమస్యలపై పరిశీలిస్తున్న విదేశీ నిపుణులు రెండు వారాలలోగా పూర్తి స్థాయి నివేదిక అందించే అవకాశాలు ఉన్నాయి. వారి నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి. ఇప్పటికైతే దెబ్బతిన్న డయాఫ్రం వాల్ విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కుష్విందర్ ఓహ్రీ చెప్పారు. ఇక పాత డయాఫ్రం వాల్ కు మరమ్మతులు అన్న ప్రశక్తే లేదనీ, ఆ విషయంలో చర్చకు తావులేదని స్పష్టం చేశారు. పాత డయాఫ్రం వాల్ ముగిసిన అంశమని తేల్చేశారు.  ఇక ఇప్పుడు ఉన్న చర్చ అంతా కొత్త డయాఫ్రం వాల్ ఎక్కడ నిర్మించాలి, ప్రస్తుతం దెబ్బతిన్న డయాఫ్రం వాల్ కు ఎంత దూరంలో నిర్మించాలి? తదితర అంశాలపై నిపుణుల నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటారు.   నాలుగు రోజులు  పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేశారు. నిపుణులు గమనించిన అంశాలపై వారితో బుధవారం(జులై 3)  కుష్విందర్ ఓహ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ పాల్, సీస్‌ హించ్‌ బెర్గర్, రిచర్డ్‌ డొన్నెల్లీ, గియాస్‌ ఫ్రాంక్‌ డి సిస్కో, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇంఛార్జ్​ చీఫ్‌ ఇంజినీర్‌ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జల సంఘం డిజైన్ల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్, గౌరవ్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.  ఇప్పటికే కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్, విదేశీ నిపుణులు ఛైర్మన్‌ ఓహ్రాకు ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీలించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్‌ ఓహ్రా భేటీ నిర్వహించారు. విదేశీ నిపుణులు నలుగురూ ఓహ్రాకు తమ అభిప్రాయాలు  తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని, వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లో  మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు విదేశీ నిపుణులు వివరించారు.  పోలవరం వద్ద గోదావరిలో బంకమట్టి ఉన్నందున కట్టడాల నిర్మాణంలో స్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం తదితర అంశాలపైనా విదేశీ నిపుణలు మాట్లాడారు. బంకమట్టి పరిస్థితులున్నా నిర్మాణాలు చేపట్టవచ్చని భరోసా ఇచ్చారు. మొత్తం మీద విదేశీ నిపుణుల రాకతో పోలవరంలో ఒక భరోసా, సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. 

కేసీఆర్ బాటలో జగన్ గ్యాంగ్!

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఇద్దరూ ఒకే తానులో ముక్కలేనని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో విషయంలో కూడా మేమిద్దరం ఒకే బ్యాచ్ నంబర్ అని తేటతెల్లం చేసుకున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన ఆధారాలను మొత్తం ధ్వంసం చేశారు. అప్పట్లో అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేమ్ టు సేమ్.  జగన్ ప్రభుత్వం కాలంలోని మైనింగ్ డాక్యుమెంట్స్.ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్యాంగ్ దగ్ధం చేస్తుండగా దొరికిపోయారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు దగ్ధం చేసినట్టు డ్రైవర్ నాగరాజు చెబుతున్నాడు.  సీఎంఓ అధికారి ముత్యాలరాజు ఓఎస్డీగా వున్న సాయి గంగాధర్, సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ ఓఎస్డీ రామారావుల పాత్ర ఇందులో వున్నట్టు నాగరాజు  చెబుతున్నాడు. సమీర్ శర్మ  ఆదేశాలతోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు గోనెసంచుల్లో తెచ్చి దగ్దం చేస్తున్ట్టు నాగరాజు వెల్లడి. పోలీసులకు దొరికిన సమయంలో డ్రైవర్ నాగరాజు తప్పతాగి వున్నాడు.

హస్తినలో బాబు బిజీబిజీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు హస్తిన పర్యటన జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం తరువాత ఆయన హస్తిన పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన ప్రధాన లక్ష్యం రాష్ట్ర అవసరాలను, ప్రాధాన్యతలను ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులకు వివరించడం, బడ్జెట్ లో ఏపీకి భారీ కేటాయింపులు ఇవ్వాలని కోరడం.   ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రమంత్రులకు వివరించి ఆర్థికంగా రాష్ట్రానికి సహాయం అందించాలని చంద్రబాబు తన పర్యటనలో  భాగంగా మోడీతో భేటీలో కోరే అవకాశాలున్నాయి. అలాగే మౌలిక వసతుల కల్పన విషయంలోనూ ఏపీకి సాయం చేయాలని చంద్రబాబు కోరతారని తెలుస్తోంది.  ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి , రహదారుల మరమ్మతులు, పేదలకు ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు తదితర అంశాలలో కేంద్రం ఇతోధికంగా సహకారం అందించాలని  చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. కాగా తన హస్తిన పర్యటనలో చంద్రబాబు క్షణం తీరిక లేకుండా బిజీగా గడపనున్నారు. గురువారం (జులై 4)  వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ  అయ్యారు. ఆ తరువాత  ప్రధాని మోడీతో భేటీ , మధ్యాహ్నం 12 : 15గంటలకు రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఉన్నాయి.  ఇక మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , తదుపరి   కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో  అవుతారు. శుక్రవారం (జులై 5)   ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో భేటీ , అనంతరం 10 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం, అలాగే 10 : 45 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ  ఉంటుంది. మధ్యాహ్నం 12 : 30గంటలకు మంత్రి అథవాలేతో సమావేశం అవుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం హస్తిన నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.  శనివారం(జులై6) తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రె్డితో భేటీ అవుతారు. ఈ భేటీలో విభజన సమస్యలపై చర్చిస్తారు. 

ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్‌ భేటీ!

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి   ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ గురువారం (జులై 4) భేటీ కానున్నారు.  త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేవంత్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. ఇప్పుడు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి రాష్ట్రసమస్యల పరిష్కారానికి కేంద్ర బడ్జెట్ లో ఇతోధికంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరనున్నారు.  అయితే సీఎం రేవంత్, మోడీ భేటీకి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రేవంత్ మోడీతో భేటీ సందర్భంగా   రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం తదితర పలు అంశాలపై  చర్చించనున్నారు.   పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూలు ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్సిటీకి నిధుల కేటాయింపు.. ఇలాంటి అనేక సమస్యలను ఈ  సందర్భంగా రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నది.  

జగన్ నిర్వాకం ఏపీకి శాపం.. బాబు విజనే ఇప్పుడు ఆశాదీపం!

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఎంత దెబ్బతిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తెలిసిన దాని కంటే  చాలా చాలా ఎక్కువ నష్టం జరిగిందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం (జులై 3) అమరావతిపై విడుదల చేసిన శ్వేతపత్రం తేటతెల్ల చేసింది.  జగన్ తన హయాంలో పనిగట్టుకుని మరీ రాష్ట్రం పరువును గంగలో కలిపేయడానికి కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఉంది.  రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుల కుప్పలా మార్చేసింది. ఆ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ఎన్నో నివేదికలు బట్టబయలు చేశాయి.  అయితే జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకంపై ఆర్థిక నిపుణులు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా, రాష్ట్రం దివాళా అంచుకు చేరుకుందని నవేదికలు స్పష్టం చేసినా, చివరాఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా, జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినంత నెప్పి కూడా కలగలేదు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఏపీ పరువు గంగలో కలిసిపోతోందని అప్పట్లో తెలుగువన్ కూడా   హెచ్చరించింది.   అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ, బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేసి అప్పులు చేసేస్తోందని గణాంకాలతో సహా వివరించింది.  ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పుల పరిధికి మించి జగన్ సర్కార్ అప్పులు చేసేసింది. అలా అప్పు చేసి తెచ్చిన సొమ్ములతో   అభివృద్ధి, ఉపాధి రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టిందా అంటే అదీ లేదు. కేవలం బటన్ నొక్కి  పప్పు బెల్లాల మాదిరి సొమ్ములు పంచుకుంటూ వెళ్లింది.  దీంతో జగన్ హయాంలో ఆయన ప్రభుత్వం  ప్పుల మీదనే  నడిచింది. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల విషయంలో రాష్ట్రం డేంజర్ లిస్టులోకి వెళ్ళింది. ఏపీకి కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ ఇచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని గతంలోనే తెలుగువన్ విస్పష్టంగా పేర్కొంది. అదే విషయాన్ని చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చెప్పారు.    రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది.   ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు స్టాక్ ఎక్సేంజ్‌  కూడా షాక్ ఇచ్చింది. ఏకంగా ఏపీ బాండ్లకు సీ గ్రేడ్ కేటాయించింది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజ్‌లకు రేటింగ్ సంస్థలు నోట్ పంపాయి. హై రిస్క్‌తో కూడిన బాండ్స్‌గా అక్యూట్ రేటింగ్ సంస్థ పేర్కొంది. దీనికి కారణం జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వమేనని అక్యూట్  సంస్థ గతంలోనే పేర్కొంది. ఈ బాండ్స్‌కు చెల్లించాల్సిన రూ.14 కోట్లు వడ్డీ కూడా నెల రోజులు ఆలస్యంగా చెల్లించారని రేటింగ్ సంస్థ వెల్లడించింది.  రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో ఉండాల్సిన రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకోవడంతో క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. ఆ తరువాత రూ.14 కోట్లు వడ్డీ కూడా సమయానికి కట్టలేదని స్టాక్ ఎక్సేంజ్‌ సీ గ్రేడ్ కేటాయించింది.   అంతకు ముందు అంటే 2014-2019 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్  అయ్యాయి. ఆ వెంటనే రూ.2000 కోట్లకి బాండ్స్ రిలీజ్  చేస్తే హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ జారీచేస్తే, చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి, పురోగతి, ఆర్థిక క్రమశిక్షణ విసయంలో ఉన్న విశ్వసనీయత అటువంటిది. అలాంటిది జగన్ సర్కార్ ఆ బ్రాండ్ ను, ఆ విశ్వసనీయతను కాలరాసేసింది.  ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్‌ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయిన పరిస్థితికి రాష్ట్రం చేరుకుంది.  ఇదే విషయాన్ని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం జరగాల్సి ఉంది. చంద్రబాబు దార్శనికత, ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతే ఆంధ్రప్రదేశ్ ను ఒడ్డెక్కించగలవని జనం నమ్ముతున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌కి ‘జంపింగ్’ మేనియా!

తెలంగాణ కాంగ్రెస్  పార్టీకి ‘జంపింగ్’ మేనియా పట్టినట్టుంది. బీఆర్ఎస్ నుంచి ఎవర్నయినా సరే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఈ మేనియాకి వున్న ప్రధాన లక్షణం. బీఆర్ఎస్, బీజేపీ కలసి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను గానీ, ఎమ్మెల్సీలను కానీ కాంగ్రెస్‌లో చేర్చుకోవడంలో ఒక అర్థం, పర్థం ఏడిచాయి. కానీ, బీఆర్ఎస్‌లో వున్న తప్ప, తాలుని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని మురిసిపోతున్నారు.. అదే ప్రాబ్లం! బుధవారం నాడు ఢిల్లీలో బీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అడుగు తీస్తే అడుగు వేయలేనంత వయసు పెరిగిపోయి వున్న కేశవరావుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గానీ, తెలంగాణ రాష్ట్రానికి గానీ ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేశవరావు చేసినంత ద్రోహం మరే నాయకుడూ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కేశవరావుకు ఎంతో చేసింది. ఎన్నో హోదాలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ అలాంటి జాతీయ స్థాయి పదవులు ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడిని చేసింది. అయినా తనకు ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో వున్న సమయంలో కేశవరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ కష్టాల్లో పడగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో వేలంవెర్రిగా చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులకే తెలియాలి. కె.కేశవరావు ఏమైనా చురుకుగా పనిచేసే యువకుడా? కాదు..! పోనీ ఈయన్ని చూసి ఒక్క ఓటరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? లేదు! ఈయన తన అద్భుతమైన తెలివితేటలతో వ్యూహాలు అందిస్తారా? అవకాశం లేదు! అంత తెలివితేటలే వుంటే, కేసీఆర్ ఎప్పడూ ఈ పెద్దమనిషిని తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు కదా.. తన తెలివితేటలేవో కేసీఆర్‌కి చెప్పి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేసేవారు కదా? కాబట్టి.. ఆ యాంగిల్లో కూడా కేశవరావు ఉపయోగపడే వ్యక్తి కాదు. పైగా, కాంగ్రెస్ పార్టీలో కేశవరావు కంటే చురుకైనవాళ్ళు, వ్యూహాలు పన్నగలవారు చాలామంది వున్నారు. ఆ రకంగా చూసినా కేశవరావు వల్ల ప్రయోజనమేమీ లేదు. ఇన్ని మైనస్సులు వున్నవాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ పోతే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మైనస్సులోకి వెళ్ళే ప్రమాదం వుంది! అందుకే, సాధ్యమైనంత త్వరగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తనలో పెరిగిపోతున్న ‘జంపింగ్ మేనియా’కి చికిత్స తీసుకుంటే మంచిది.

అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం!

ఆంధ్రుల ప్రజా రాజధాని ‘అమరావతి’ స్థితిగతులను వివరించే శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సమర్పించారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన అమరావతి ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల చెంతనే సైబరాబాద్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు, హైదరాబాద్ అభివృద్ధికి తాను ముందుకు వెళ్ళినప్పుడు ఏర్పడిన సవాళ్ళను వివరిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ రోజున ముందు చూపుతో తాను తీసుకున్న నిర్ణయం హైదరాబాద్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిందని చంద్రబాబు చెప్పారు.  ఊహించని విధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్థిక బలం లేకుండా, రాజధాని లేకుండా మిగిలిపోయినప్పుడు గొప్ప రాజధానిని నిర్మించడం ద్వారా ఒక మంచి ముందడుగు వేయాలని తాను భావించానని, చారిత్రక ప్రాధాన్యం వున్న, అన్ని ప్రాంతాలకూ సమదూరంలో వున్న అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ముందడుగు వేసినప్పుడు అమరావతి ప్రాంత రైతుల నుంచి సానుకూల స్పందన లభించిందని  చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణం పుంజుకుంటున్న దశలో జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు అధికారంలోకి రావడం, మూడు రాజధానుల డ్రామా ప్రారంభించడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. దైవానుగ్రహం వల్ల మళ్ళీ అమరావతి తన పూర్వవైభవాన్ని సంపాదించుకునే దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతికి సంబంధించిన  గణాంకాలను, తన గత ప్రభుత్వం వున్న సమయంలో జరిగిన అభివృద్ధిని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసాన్నిపవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జగన్ అనుసరించిన దుర్మార్గపు విధానాల వల్ల ప్రపంచం దృష్టిలో రాష్ట్రం నమ్మకాన్ని కోల్పోయిందని, ఎంతోమంది పెట్టుబడి పెట్టినవారు వెనక్కి వెళ్ళిపోయారని చంద్రబాబు వివరించారు. జగన్ వల్ల రాష్ట్రం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పాదుకొల్పడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అమరావతి గురించి, ఇతర అన్ని అంశాల గురించి తమ మిత్రపక్షమైన ఎన్డీయే ప్రభుత్వానికి వివరించి సహకారం కోసం ప్రయత్నిస్తానని  చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి.. మరోసారి అమరావతికి ఎవరైనా అన్యాయం తలపెట్టకుండా ఏమి చేయాలి.. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేయాలి.. ఇలాంటి ఎన్నో అంశాలు వున్నాయని, వాటన్నిటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వివరించారు.

ఉప్పాడలో పవన్ కళ్యాణ్ పర్యటన 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు.  ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడో రోజు కాకినాడ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనానికి స్థానిక నేత‌లు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక‌ ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న సూర‌ప్ప తాగునీటి చెరువు, వాకతిప్ప‌ ఫిషింగ్ హార్బ‌ర్‌తో పాటు ఉప్పాడ‌లో కోత‌కు గురైన తీర ప్రాంతాన్ని ప‌రిశీలించారు. తుపాన్ ప‌రిస్థితుల‌పై ఫొటో గ్యాల‌రీని కూడా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా తీర ప్రాంతం కోత‌కు గురికాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌వ‌న్ అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. సాయంత్రం పిఠాపురంలో వారాహి స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొననున్నారు. ఈ స‌భ‌లో డిప్యూటీ సీఎం హోదాలో ఆయ‌న ఇచ్చే ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.