ఏం మాట్లాడుతున్నానబ్బా.. ప్రసంగం మధ్యలో బుర్రగోక్కున్న జగన్!
posted on Jul 20, 2024 @ 10:58AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకూ చూడలేదు. అధికారంలో ఉండగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్ట లేదు. బహిరంగ సభలలో అయితే విలేకరులు ప్రశ్నలు వేయరు కనుక తడబడుతూనో, నట్టుతూనో స్క్రిప్ట్ చూసుకుని ప్రసంగం పూర్తి చేయడం సులువు. అందుకే ఆయన బటన్ నొక్కుడు సభలలో ప్రసంగాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా సజావుగా సాగిపోయేవి.
ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఇప్పటి వరకూ ఆయన రెండు సార్లు బయటకు వచ్చారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టై నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఒకసారి. వినుకొండలో హత్యకు గురైన జిలానీ కుటుంబాన్ని పరామర్శించడానికి రెండో సారి ఆయన బయటకు వచ్చారు. ఆ రెండు సార్లూ కూడా అనివార్యంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది. నెల్లూరు జైలు వద్ద ఆయన ప్రసంగం చేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఇక వినుకొండలో మాత్రం మీడియా ప్రతినిథి ప్రశ్నకు ఆయన విసుక్కున్నారు. ప్రసంగిస్తుండగా ప్రశ్నించడమేంటని చిరాకు పడ్డారు.
అలా ప్రశ్నలు వేస్తే తన ప్రసంగం ఫ్లో దెబ్బతింటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చిన్నపాటి ఆటంకానికే ఆయన ప్రసంగిస్తున్న విషయమేంటో మర్చిపోయారు. చదువుతున్న స్క్రిప్ట్ లో ఎక్కడ ఆపానో గుర్తుకు రాలేదు. బుర్రగోక్కున్నారు. కంగారు పడిపోయారు. పక్కనున్న వారు అందిస్తే అప్పుడు ప్రసంగాన్ని పున: ప్రారంభించారు.