అయ్యో పాపం... సైబరాబాద్ మొక్క!
posted on Jul 20, 2024 @ 11:33AM
శుక్రవారం నాడు వినుకొండలో జగన్ జరిపిన ఓదార్పు పర్యటన ఒక పెద్ద కామెడీ ఎపిసోడ్‌గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద కామెడీ ఎపిసోడ్‌లో కూడా ఒక ‘అయ్యో పాపం’ అనిపించే విషయాలు కూడా వున్నాయి. చనిపోయిన రషీద్ కుటుంబాన్ని చూస్తే కలిగే జాలి ఒకటి. అది కూడా చెట్టంత మనిషి చనిపోయిన బాధలో వుండి కూడా, జగన్ చెప్పినట్టు చిలక పలుకులు పలకాల్సిన పరిస్థితి వచ్చిందేంటా అనే జాలి. ఇది కాకుండా మరో వ్యక్తిని చూసినా చాలా జాలి కలిగింది. ఈ ఆర్టికల్ చూసి ఆ వ్యక్తి ఎవరో చాలామందికి అర్థమయ్యే వుంటుంది. కరెక్ట్.. మన సైబరాబాద్ మొక్క విడదల రజినిని ఆ సందర్భంలో చూసినప్పుడు కూడా ‘అయ్యో పాపం’ అని చాలా జాలి కలిగింది.
మృతుడు రషీద్ ఇంట్లోకి వెళ్లిన జగన్, అతని కుటుంబాన్ని పరామర్శించింది తక్కువ... రాజకీయాలు మాట్లాడింది ఎక్కువ. మొత్తానికి ఆ రాజకీయ పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వెనుక సైబరాబాద్ మొక్క దీనంగా నిల్చుని వున్నారు. కళ లేని ముఖంతో, జీవం లేని కళ్ళతో నిస్తేజంగా నిలబడి వున్న సైబరాబాద్ మొక్కని చూసి చాలామందికి గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు విడదల రజిని అంటే ఎంత బిల్డప్పుడు వుండేది.. ఇప్పుడు ఆ బిల్డప్పు ఏమీ లేదు. జగన్ వెనుక నిలబడి కెమెరాల్లో పడటానికి తాపత్రయపడే బడ్డింగ్ కార్యకర్తలాగా విడదల రజిని పరిస్థితి తయారైంది. జగన్ మాట్లాడుతూ వుండగా, ‘‘అవును.. మా జగన్ సార్ చెబుతున్నదంతా పచ్చి నిజం’’ అన్నట్టుగా మధ్యమధ్యలో సైబరాబాద్ మొక్క తల ఆడిస్తూ ఎక్స్.ప్రెషన్లు ఇవ్వడం చూసి నిజంగా చాలా జాలి వేసింది. ఆల్రెడీ సైబరాబాద్ మొక్క, తనకు ఈ జగన్ పార్టీ నుంచి ఎప్పుడు ‘విడుదల’ లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు చూపులు కూడా విడదల రజిని ముఖంలో కనిపించాయి.