అసెంబ్లీకి జగన్.. పోరాటమా.. పలాయనమా?!
posted on Jul 19, 2024 @ 6:01PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జులై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ హాజరు కానున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే జగన్ హాజరుపై అనుమానాలు ముప్పిరి గొంటూనే ఉన్నాయి. జగన్ ఐదేళ్ల పాలనలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై వరుస శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంది.
అయితే వినుకొండ ఘటన, పుంగనూరులో ఉద్రిక్తతల వేనుక ఉన్న కుట్ర కోణాన్ని గ్రహించి శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల వేదికను అసెంబ్లీకి మార్చారు. అసెంబ్లీ వేదకగానే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలకు చంద్రబాబు నిర్ణయించారు. అలాగే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారని పేర్ని నాని ప్రకటన నేపథ్యంలో జగన్ ముందే, సభ సాక్షిగా జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టేందుకు రెడీ అయ్యారు.
దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో పునరాలోచనలో పడ్డారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనీ, అలాగే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలనీ కోరుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. అయితే జగన్ కు విపక్ష నేత హోదా, వైసీపీకి విపక్షంగా గుర్తింపు ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా జగన్ వైఖరే కారణమని అంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం విషయంలో చంద్రబాబు చాలా ఉదారంగా జగన్ కు మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. అయితే దానిని జగన్ పాజిటివ్ గా తీసుకోలేదు. పైపెచ్చు.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. తన పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ కూడా ఆగలేదు. బయటకు వెళ్లి తీరిగ్గా ప్రతిపక్ష నేతగా తనకు సముచిత గౌరవం ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా గుర్తింపు రావడానికి అవసరమైనంత మంది సభ్యులు లేరన్న విషయం జగన్ కు తెలుసు. అయినా ఏవో కారణాలు చెబుతూ తమది ప్రధాన ప్రతిపక్షమేనంటూ వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు స్పీకర్ ఇష్టపడే అవకాశం కనిపించడం లేదు. విపక్ష హోదా లేకుండా సభకు వస్తే.. సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే జగన్ కు ట్రీట్ మెంట్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం ఖాయమని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై గళమెత్తడానికి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వినుకొండ ఘటన, పుంగనూరు ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని ఆయన రాజకీయం చేయడానికి రెడీ అయిపోయారు. ఆ రెండు సంఘటనలకూ కారణం వైసీపీయే అయినా, పెనుకొండ ఘటన వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని స్పష్టంగా తేలినా, పుంగనూరు ఉద్రిక్తతకు కారణం మిథున్ రెడ్డి ముందస్తు సమాచారం లేకుండా పుంగనూరుకు రావడం అ ని పోలీసులు తేల్చే సినా.. జగన్ తెలుగుదేశం ప్రభుత్వ వేధింపులు, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం అంటూ గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మోడీకి వివరించడానికి అప్పాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీకి వెళ్లి గట్టిగా గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు శాంతి భద్రతలపై అసెంబ్లీ వేదికగానే శ్వేతపత్రం విడుదలకు నిర్ణయించుకోవడం జగన్ కు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
తన ఎదుటే తన ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను తిలకించాల్సిరావడం జగన్ కు ఇబ్బందికరమే. ఖండించడానికి కానీ, సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కానీ తగినంత బలం లేదు. ఉన్నవారెవరూ గట్టిగా మాట్లాడగలిగేవారు కాదు. దీంతో సభకు వెళ్లి అవమానపడటం కంటే గైర్హాజరవ్వడమే మేలని భావిస్తున్నారు. అయితే అలా చేస్తే పలాయనం చిత్తగించానన్న విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయం వెంటాడుతోంది. అంటే అసెంబ్లీ సమావేశాల హాజరు విషయం జగన్ కు ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తరారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.