అదానీ మీద హిండెన్‌బర్గ్ భారీ బాంబు!
posted on Aug 11, 2024 6:52AM
అదానీ సంస్థ మీద, సెబీ (SEBI) ఛైర్ పర్సన్ మాధబి పురి బచ్ మీద అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ కృత్రిమంగా పెరగడానికి వినియోగించిన మారిషస్ పండ్లలో మాధబి బచ్, ఆమె భర్తకు వాటాలు ఇచ్చారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అదానికి చెందిన మారిషస్, ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఎంతమాత్రం ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. 'నియంత్రణ సంస్థల కంట్రోల్ లేకుండా అదానీ కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ ఛైర్ పర్సన్ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను గమనించడం ద్వారా దీని వెనుక వున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవచ్చు. కీలక పత్రాల ప్రకారం.. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నాయి. ఇందులో మాధబి బచ్, ఆమె భర్త ధావల్ బచ్‌కి వాటాలు ఉన్నాయి' అని హిండెన్‌బర్గ్ తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (83 కోట్ల రూపాయలు) వరకు ఉండొచ్చని తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచడానికి అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక బయటపెట్టింది, దాంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఆ తర్వాత ఒక ‘పెద్దమనిషి’ అండతో మళ్లీ కోలుకుంది.