దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం!
posted on Aug 11, 2024 @ 10:58PM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ ఎపిసోడ్‌లో మరో భారీ ట్విస్ట్ క్రియేట్ అయింది. శ్రీనివాస్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి, కుమార్తెలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం టెక్కలి వైసీపీ నాయకురాలు, దువ్వాడ శ్రీనివాస్‌తో ‘అడల్ట్రీ’ చేస్తున్న దివ్వెల మాధురి కారు ప్రమాదంలో గాయపడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న కారును మాధురి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో తన కారుతో ఢీ కొట్టింది. దాంతో రెండు కార్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనపై ట్రోల్ చేస్తున్న వార్తలకు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. డిప్రెషన్లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు మాధురి తెలిపారు. తాను మొదట లారీని ఢీకొట్టాలని అనుకున్నానని, కానీ కారుకు ఢీకొట్టానని ఆమె చెబుతున్నారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు రాజకీయ రంగు పులమటానికి మాధురి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అలాగే మాధురి ఢీకొట్టిన కారులో వున్న వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్‌గా వున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ సినిమా ఫలితంగా ఏ పాపమూ ఎరుగని వాళ్ళు మృత్యువుతో పోరాడుతున్నారు.