ఏపీ ఫైబర్‌నెట్‌లో 238 కోట్ల స్కామ్!
posted on Aug 12, 2024 @ 11:28AM
జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన మరో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. రాక్షస పాలన జరిగిన ఐదేళ్లలో ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య సగానికి పైగా తగ్గినట్లు లెక్కలు చూపించి, వసూలైన నెల బిల్లుల మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్ళించినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా 14 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 17 నెలల్లో 238 కోట్ల రూపాయల సొమ్మును మధుసూదన్ రెడ్డి అండ్ గ్యాంగ్ గుటకాయస్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ అండదండలతో మధుసూదన్ రెడ్డి విచ్చలవిడిగా చెలరేగిపోయి కొత్తరకం స్కామ్ విజయవంతంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. అవినీతితోపాటు అసమర్థ నాయకత్వం వల్ల ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ మొత్తం 1,258 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ వ్యవహారం మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తోంది.
ప్రీపెయిడ్ విధానం అమల్లోకి వచ్చాక ఆపరేటర్లు ప్రతి నెలా తమ బిల్లులను యాప్ ద్వారా చెల్లించాలన్న నిబంధన పెట్టారు. అప్పటినుంచి కనెక్షన్ల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గినట్లు చూపించారు. నిజానికి కనెక్షన్ల సంఖ్య తగ్గలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. ఎప్పటిలా ప్రతి నెలా యాప్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామంటున్నారు. కేవలం సంస్థ రికార్డుల్లో మాత్రమే కనెక్షన్ల సంఖ్య తగ్గించి.. ఆ మేరకు నాలుగు లక్షల కనెక్షన్లకు సంబంధించి నెల బిల్లుల కింద వసూలయ్యే మొత్తాన్ని బినామీ ఖాతాకు మళ్ళించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఒక ఏజీఎం, డైరెక్టర్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆపరేటర్లు తమ బిల్లులు ప్రతి నెలా చెల్లించడానికి ఉపయోగించిన యాప్‌ని గ్రీన్ లాంటెర్న్ అనే ఐటీ సంస్థ రూపొందించినట్లు తెలుగుస్తోంది. ఆ యాప్ ద్వారా ఆపరేటర్లు జరిపే చెల్లింపులు రికార్డుల్లో చూపిన కనెక్షన్ల సంఖ్య మేరకు ఫైబర్‌నెట్ ఖాతాకి, మిగిలిన సొమ్ముబినామీ ఖాతాకు జమయ్యేలా ప్రోగ్రామింగ్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును ముంబైలోని ఒక బ్యాంకు ఖాతాకు మళ్ళించినట్లు సమాచారం.