ఒక్క ట్వీట్ తో అప్పాయింట్ మెంట్.. బాబు స్పందనకు జనం జేజేలు!
posted on Aug 12, 2024 6:47AM
ఏపీలో గడిచిన ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం హయాంలో విధ్వంస పాలన కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. దొరికిన చోటల్లా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేశారు. దీంతో ఉద్యోగులకు నెలవారి జీతాలు ఇవ్వాలన్నా అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ ప్రభత్వంపై విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టిన నాటి నుంచి సమయం వృథా చేయకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం మంత్రులు, అధికారులతో సమీక్షలతోపాటు.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చంద్రబాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. చంద్రబాబు రోజంతా బిజీబిజీగా ఉంటుండంతో ఆయనను కలిసేందుకు వచ్చినవారికి సమయం కేటాయించలేక పోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత పలు రంగాల ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలోపట్టే ప్రయత్నాల్లో బాబు బిజీబిజీగా ఉండటంతో అందరికీ సమయం కేటాయించలేక పోతున్నారు. దీంతో పలువురు బాబును కలిసేందుకు సమయం కోసం వేచిచూస్తున్నారు. తాజాగా ప్రముఖ సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ చంద్రబాబును కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. సునీతా కృష్ణన్.. అమ్మాయిల అక్రమ రవాణా మాఫియాలకు ఎదురొడ్డి పోరాడి వందల సంఖ్యలో అమ్మాయిలకు స్వేచ్ఛ ప్రసాదించారు. ప్రజ్వల ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం, ఉపాధి కల్పిస్తున్నారు. అయితే, ఆమె చంద్రబాబును కలిసి పలు ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచాలని భావిస్తున్నారు. కానీ, బాబు రోజువారి షెడ్యూల్ లో ఖాళీలేకపోవటంతో ఆమెకు అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె ఎక్స్ (ట్విటర్) వేదిక ద్వారా సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ పది నిమిషాలు అపాయింట్‌మెంట్ కావాలని కోరారు.
సునీతా కృష్ణన్ తాను చేసిన ట్వీట్‌లో.. చంద్రబాబు సర్... ఇలా సంప్రదాయ విరుద్ధ మార్గంలో మీ అపాయింట్ మెంట్ కోరుతున్నాను. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు. వచ్చే వారం నాకోసం 10 నిమిషాల విలువైన సమయాన్ని కేటాయించగలరా? రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసేందుకు గత కొన్ని రోజులుగా సాధారణ మార్గాల్లో ప్రయత్నించాను కానీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా మీ అపాయింట్ మెంట్ అడుగుతున్నాను... క్షమించండి" అంటూ సునీతా కృష్ణన్ పేర్కొన్నారు. కాగా, ఆమె ట్వీట్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. "నో ప్రాబ్లమ్ సునీత గారూ... మనం మంగళవారం కలుద్దాం. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అవుదాం. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. పాలనను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అంతేకాదు, మా అపాయింట్ మెంట్ వ్యవస్థలను మెరుగుపర్చడానికి ఏం చేయగలమో కూడా ఆలోచిస్తాం" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు స్పందనకు సునీతా కృష్ణన్ సంతోషం వ్యక్తం చేశారు. సునీతా కృష్ణన్ ట్వీట్ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందనను చూసి నెటిజన్లు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారు. బహిరంగ సభలు, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో బయటకు వచ్చినా పరదాలు కట్టుకొని వచ్చేవారు. ఇక జగన్ ను కలవాలంటే వైసీపీ నేతలతో పాటు.. పలు సంఘాలు, పలు వర్గాల్లోని ప్రముఖులకు అవకాశమే ఉండేది కాదు. కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందిన ఐదారుగురు నేతలకు మాత్రమే జగన్ వద్దకు నేరుగా వెళ్లే అవకాశం ఉండేది. ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ, చంద్రబాబు నాయుడు అలాకాదు. ముఖ్యంగా నాల్గోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు తన దైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తూనే.. మరోపక్క పేద, మధ్య తరగతి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయినా చంద్రబాబు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఏమాత్రం గర్వం లేకుండా ప్రజల సీఎంగా పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ట్వీట్ కు చంద్రబాబు స్పందించిన తీరుపట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.