ఇలా అయితే కష్టం.. జగన్‌కు సీనియర్లు బైబై!
posted on Aug 11, 2024 7:40AM
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధిపై దృష్టి సారించింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అధిగమిస్తూ తన అపార పాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో జగన్ హయాంలో అరాచక పాలన సాగింది. డ్రగ్స్, గంజాయి విచ్చలవిడి రవాణా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీంతో ఏపీలో ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా లేకుండా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఏపీలో జనమే కాదు వైసీపీ నేతలు కూడా అంటున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రాకుండా కుట్రలు చేస్తున్నారు. తన ఐదేళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి గురించి ఇసుమంతైనా పట్టించుకోని జగన్.. చంద్రబాబు అధిరాన పగ్గాలు చేపట్టీ పట్టగానే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుంటూ చూసి ఓర్చుకోలేక పోతున్నారు. తాను
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఏపీలో అరాచక పాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత కూడా తన తీరు మార్చుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఘర్షణలు జరిగి ఎవరు చనిపోయినా.. చనిపోయింది వైసీపీ కార్యకర్త.. హత్య చేసింది తెలుగుదేశం కార్యకర్తలు అంటూ తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకొని పరామర్శకు వెళ్తున్నారు. పరామర్శకు వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చాల్సిన జగన్.. అమ్మ ఒడి డబ్బులు వచ్చాయా అంటూ వారిని ప్రశ్నిస్తుండటంతో వైసీపీ నేతలు సైతం జగన్ తీరును ఏవగించుకుంటున్నారు. జగన్ కు అసలు మైండ్ పనిచేస్తుందా.. ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అంటూ వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు కూటమి ప్రభుత్వంపై తన నోటికొచ్చినట్లు మీడియా ముందు విమర్శలు చేస్తున్న జగన్.. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతుండటం గమనార్హం. దీంతో ప్రభుత్వంపై జగన్ చేసే ఆరోపణలు నిజం కాదని ప్రజలు నిర్దారణకు వస్తున్నారు. విపక్ష నేతగా హూందాగా నడుచుకోవాల్సిన జగన్.. తన తీరుతో సొంత పార్టీ నేతలు సైతం తలెత్తుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఈ మాట వైసీపీలోని సీనియర్ నేతలే అంటున్నారు. జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జగన్ తరహా రాజకీయాలతో మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావనకు వచ్చి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు. మరో వైపు మరికొందరు మాజీ మంత్రులు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణమే వారు వైసీపీకి బైబై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో ముందు వరుసలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని కేతిరెడ్డి సైతం పరోక్షంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే జగన్ విమర్శలు చేయడాన్ని కేతిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైనా సమయం ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన తెలుగుదేశం గూటికి వెళ్లబోతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేతిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇలా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేతల జాబితా చాలా పెద్దగానే ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే తెలుగుదేశంతో టచ్ లోకి వచ్చారని అంటున్నారు. వీరంతా వైసీపీని వీడేందుకు సిద్ధమవ్వడానికి ప్రధాన కారణం జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి. జగన్ కావాలనే అధికార పార్టీ నేతలను రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకుండా అల్లర్లు సృష్టించాలని, కులాల మధ్య ఘర్షణలు తలెత్తేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ తీరు ఇలానే ఉంటే రాబోయే కాలంలో ప్రజలు వైసీపీ నేతలను రోడ్లపైకికూడా రానివ్వరని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీలో ఉండటం కంటే రాజీనామా చేసి పార్టీకి దూరం కావడమే మేలని వారు భావిస్తున్నారు. జగన్ తీరు ఇలానే ఉంటే రాబోయేకాలంలో వైసీపీ నేతలంతా కూటమి పార్టీల్లోకి క్యూ కట్టడం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.