సానుభూతి డ్రామానా..జగన్ ను మించిపోయారు కదా?!
posted on Aug 12, 2024 7:27AM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం సినిమా ట్విస్ట్ లను తలపిస్తోంది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైందవి శ్రీనివాస్ ఇంటి వద్దనే టెంట్ వేసుకొని నిరసన తెలుపుతుంటే.. దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన మరో కారును ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్పగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొద్ది గంటలకే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రమాదం తరువాత ఆమె మాట్లాడతూ.. తాను ఆత్మహత్య చేసుకోవాలనే కారు యాక్సిడెంట్ చేశానని చెప్పారు. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి చనిపోవాలని చూశానని, కానీ, అనుకోకుండా కారును ఢీకొట్టానని చెప్పారు. ఇంతకీ ఎందుకలా చేశావరన్న మీడియా ప్రశ్నకు దువ్వాడ వాణి తన పిల్లల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారనీ, తన పైనా అసత్యపు ఆరోపణలు చేస్తున్నారనీ, మా కుటుంబ సభ్యులు తలెత్తుకోలేక పోతున్నారనీ వాపోయారు. దీంతో తాను మానసికంగా కుంగిపోయానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వాణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనకు ఏమైనా జరిగితే అందుకు వాణియే కారణమని చెప్పారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ ఫ్యామిలీ, దివ్వెల మాధవిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మాధురి కారు ప్రమాదానికి గురికావటంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో దివ్వెల మాధురి వ్యవహార శైలి మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టుగా ఉందన్న వాదన ప్రజల్లో ఉంది. దవ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటూ వాళ్ల ఫ్యామిలీలో రచ్చ రేపడమే కాకుండా.. తిరిగి దువ్వాడ వాణి, ఆమె కుమార్తెపై మాధురి విమర్శలు చేస్తుండటాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, నేను అడల్టరీ బంధంలో ఉన్నామని, అదేమీ చట్ట వ్యతిరేకం కాదని మీడియా ముందు సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పిన మాధురి.. ప్రస్తుతం తన పరువు పోతోందని, తాను, తన పిల్లలు తలెత్తుకోలేక పోతున్నామని అనడం కాస్త విడ్డూరంగానే కాకుండా ఎబ్బెట్టుగా కూడా ఉంది. నా ఫ్యామిలీ పరువు పోతోంది, నా ముగ్గురు పిల్లలు తలెత్తుకోలేక పోతున్నారని కన్నీరు పెట్టుకున్న మాధవి.. దువ్వాడ శ్రీనివాస్‌తో అడల్టరీ సంబంధం పెట్టుకునే ముందే ఈ విషయం గురించి ఆలోచిస్తే ఈ వ్యవహారం ఇంతవరకు రాకపోయేది కదా అని జనం అంటున్నారు.
కాగా దివ్వెల మాధురి కారు ప్రమాదం వ్యవహారాన్ని జనం సానుభూతి డ్రామాగానూ చూస్తున్నారు. ఎన్నికల సమయాల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాళ్లతో, కత్తితో దాడి చేయించుకోవటం అలవాటే. తద్వారా ప్రజల్లో సానుభూతి పొంది అధికారంలోకి రావాలని జగన్ ప్రణాళికలు రచించుకుని వాటిని అమలు చేయడం చూశాం. 2019 ఎన్నికల్లో కోడికత్తి దాడితో జగన్ ఫార్ములా వర్కౌట్ అయింది. 2024 ఎన్నికల్లో జగన్ గులకరాయి దాడితో సానుభూతి పొందాలన్న ప్రయత్నంలో ఆడిన సానుభూతి డ్రామా ఫెయిలైంది. అది వేరే సంగతి. ప్రస్తుతానికి దివ్వెల మాధురి తీరు కూడా జగన్ సానుభూతి డ్రామా ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కారు ప్రమాదం నుంచి బయటపడిన తరువాత మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తనకేమైనా అయితే అందుకు కారణం దువ్వాడ వాణియే అని చెప్పడం ద్వారా ప్రజల్లో సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు తమ తప్పును కప్పిపుచ్చుకుని అధికార తెలుగుదేశంపై నెపం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైందవీలు శ్రీనివాస్ ఇంటిపైకి రావడం వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కుటుంబ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమేందుకు దువ్వాడ, దివ్వెల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వాణి వెనుక తెలుగుదేశం నేతలు ఉన్నారని పదేపదే ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించడం ద్వారా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్లు చెప్పకనే చెబుతున్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిసైతం ఏపీ రాజకీయాల్లో ఏ చెడు జరిగినా దాని వెనక చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. జగన్ పై షర్మిల, ఆయన కుటుంబ సభ్యులు విమర్శలు చేసినా చంద్రబాబు చేయిస్తున్నారని చెబుతూ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. జగన్ తరహాలోనే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల వాణిలు తెలుగుదేశం నేతలపై విమర్శలు చేస్తున్నారు. దివ్వెల మాధురి యాక్సిడెంట్ తో ఆత్మహత్య అంటూ ఆడిన సానుభూతి డ్రామా జనాన్ని నమ్మించ లేదు సరికదా నవ్వుల పాలైంది.