ముగింపు దశకు మహా కుంభమేళా.. అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక
posted on Feb 26, 2025 8:52AM
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గత 45 రోజులుగా అత్యంత వైభవోపేతంగా, ఆశేష భక్త జనవాహినితో జరుగుతున్న మహా కుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26) శివరాత్రి తో ముగియనున్నది. ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా.. అంచనాలకు అందని వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు.
మహాకుంభమేళాలో ఫిబ్రవరి 22 నాటికే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరింది. బుధవారంతో ఈ కుంభమేళా ముగియనున్నది. కుంభమేళా ముగిసే సరికి పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గంగ,యమునా,సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు అచరించడానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇంతటి మహోత్తర ఆధ్మాత్మిక పండుగ మళ్లీ 144 ఏళ్ల తరువాత గానీ రాదు. దీతో జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముగింపు సమీపిస్తున్నప్పటికీ మహాకుంభ్ కు వస్తున్న భక్త జనం పోటెత్తుతూనే ఉన్నారు.
మహాకుంభ మేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయగలిగినంతా చేసింది. అయితే మౌనీ అమావాస్య రోజు న అంచనాలకు మించి భక్త జనం పోటెత్తడంతో దురదృష్ట వశాత్తూ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. రెండు మూడు సార్లు టెంట్లలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ చిన్నచిన్న అపశ్రుతులు వినా మహాకుంభమేళా నిర్వహించడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
అధ్యాత్మిక సౌరభాల సంగతి అలా ఉంచితే.. మహా కుంభమేళా అతి పెద్ద వ్యాపార కేంద్రంగా నిలిచిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఈవేడుక సందర్భంగా వస్తువులు,సేవలు ద్వారా 3లక్షలకోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని సీఏఐటీ పేర్కొంది.ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, దుస్తులు, పూజా సామాగ్రి, హస్తకళలు, ఆరోగ్యరక్షణ, ప్రకటనలు, పౌరసేవలు,టెలీకం,మోబైల్,సీసీ టీవీకేమెరాలు,ఇతర పరికరాల వ్యాపారాలు భారీ స్థాయిలో జరిగాయని గణాంకాలతో సహా వివరించింది.
ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టతకు మహాకుంభమేళా ఎంతగానో దోహదపడింది. .యూపీ ప్రభుత్వం మహా కుంభమేళా నిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా ఉపయోగించింది. కుంభమేళా ప్రదేశం 4 వేల ఎకరాల వైశాల్యంలో 2750 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంది.ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు నిరంతరం అందించాయి. ఎంతమంది వస్తున్నారు,పార్కింగ్ స్థలంలో వాహనాలు సంఖ్య, కూడళ్లలో రద్దీ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా యూసీ సర్కార్ ఈ ఏర్పాట్లు చేసింది. మహాకుంభ్ సందర్బంగా 45 రోజులపాటు 24X7 దేదీప్యమానంగా వెలుగొందిన ప్రయాగ్ రాజ్ మహాశివరాత్రి తరువాత వెలవెలబోతుంది. దేశ జనాభా 145 కోట్లు. వీరిలో 110 కోట్ల మంది హిందువులు. మహాకుంభ్ ముగిసే సరికి 65 కోట్లమంది పైగా పుణ్య స్నానాలు ఆచరించారంటే.. దాదాపు దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యారని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి.