ఒంగోలు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లలో వైసీపీ ఖాళీ?
posted on Feb 26, 2025 @ 11:17AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అటకెక్కింది. జనం ఛీ కొట్టి మరీ గద్దె దింపేశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో గెలిపించి అందలం ఎక్కించిన జనమే జగన్ ఐదేళ్ల పాలనతో విసిగి, వేసారి ఐదేళ్లకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసి విపక్షంగా గొంతెత్తే అర్హత కూడా లేదని ఓటు ద్వారా ఆ పార్టీని ఊడ్చిపారేశారు. ఇప్పుడు ప్రజాతీర్పు ప్రభావం ఆ పార్టీ చేతిలో ఉన్న స్థానిక సంస్థలపైనా పడుతోంది. దౌర్జన్యాలతో, దాష్టీకాలతో స్థానిక సంస్థలపై ఆధిపత్యం సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు వాటిని కూడా కోల్పోతోంది.
ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ బలం కేవలం నాలుగుకు పడిపోయింది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా 17 మంది కార్పొరేటర్లు పార్టీని వీడి వెళ్లిపోయారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని నేతృత్వంలో 26 మంది కార్పొరేటర్లు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. వీరందరినీ జనసేనాని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలా చేరిన వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ కూడా ఉన్నారు. వీరి చేరికతో ఒకప్పుడు ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి ఉన్న 43 మంది కార్పొరేటర్ల బలం ఇప్పుడు కేవలం నాలుగుకు పడిపోయింది.
అదే విధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. వీరంతా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేతృత్వంలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.