ఏడుపాయల జాతర.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర రాజనర్సింహ
posted on Feb 26, 2025 @ 12:26PM
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతర బుధవారం (ఫిబ్రవరి 26) మొదలైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య 15లక్షలకు పైగా ఉంటుందన్నది అధికారుల అంచనా. మహాశివరాత్రి పర్వదినం కూడా కావడంతో జాతర మొదటి రోజైన బుధవారం (ఫిబ్రవరి 26) భక్తులు పోటెత్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు అచరించి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక గురువారం (ఫిబ్రవరి 27)గురువారం ఎద్దుల బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. తొలుత పాపన్నపేట సంస్థానాధీశుల బండి తిరుగుతుంది. ఇక జాతర చివరి రోజు రథోత్సవం ఉంటుంది.