వైజాగే ఏపీ రాజధాని... రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన..!
posted on Dec 24, 2019 @ 11:31AM
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే యథాతథంగా జీఎన్ రావు కమిటీ నివేదిక రూపంలో ఇవ్వడంతో ఇక ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్... వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... అంటూ సింపుల్ స్టేట్-మెంట్ గా చెప్పుకున్నా... ఏదో ఒకటి మాత్రమే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందనేది వాస్తవం. కర్నూలు, అమరావతి, విశాఖల్లో ఏది ఏపీ రాజధాని అంటూ జీఎన్ రావు కమిటీని మీడియా ప్రతినిధులు అడిగితే మాట దాటవేసినా... ఎక్కడ సచివాలయం ఉంటుందో అదే రాజధానిగా చెలామణి అవుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఈ లెక్కన చూస్తే విశాఖపట్టణమే... ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నది తేలిపోతుంది. అంతేకాదు భీమిలి దగ్గరే రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహానగరంగా మారబోతోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది, పార్టీపరంగా దాదాపు అధికారిక ప్రకటనే అయినా... ప్రభుత్వపరంగా మరో మూడ్రోజుల్లో జగన్ సర్కారు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.
జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించనున్న జగన్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే మీడియా ముందుకొచ్చి ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్ మీటింగ్ తర్వాత రోజు అంటే డిసెంబర్ 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే పనులకు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. అదేవిధంగా త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు... భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స తెలిపారు. ముంబై తర్వాత విశాఖే అభివృద్ధి చెందే నగరమని జీఎన్ రావు కమిటీ గుర్తించిందన్న బొత్స... రాజధాని నగరంగా మారేందుకు వైజాగ్ కు అన్ని హంగులూ ఉన్నాయన్నారు.
అయితే, మూడు రాజధానులపైనా... అలాగే... విశాఖే ...ఏపీ కేపిటల్ అంటూ... రెండు మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో... అమరావతిలో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశముందని ముందుజాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను అమరావతికి తరలించారు. మరి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్దఎత్తున ఉద్యమిస్తోన్న రైతులు.... ఒకవేళ విశాఖే ఏపీ రాజధాని అని అధికారికంగా ప్రకటిస్తే ఏవిధంగా రియాక్టవుతారో... ఏస్థాయిలో పోరాటం చేస్తారో చూడాలి.