జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్!!
posted on Dec 17, 2019 @ 4:41PM
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల పై పెద్దగా ఆసక్తిగా లేనట్లే కనిపిస్తున్నారు. 5 ఏళ్లుగా పని చేస్తున్న పీసీసీ నుంచి తప్పుకోవాలని ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అంటీముట్టనట్లు ఉన్నారనే చర్చ పార్టీలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 3 నెలల వరకు ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉండిపోయారు. కనీసం గాంధీభవన్ కి కూడా రాలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, దాంతో మళ్ళీ కొంత యాక్టివ్ అయ్యారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రచారం మీద కొంత మేరకు తన ప్లాన్స్ వర్కౌట్ చేసుకున్నారు. తాను పోటీ చేసిన నల్గొండ పార్లమెంటు నుంచి గెలిచారు. ఆ తరువాత పార్టీ కార్యాలయానికి అప్పుడప్పుడు రావడం మొదలు పెట్టారు. పార్టీ సమావేశాలు కోర్ కమిటీలకు మాత్రమే పరిమితం అవుతూ వచ్చారు. ఇక ఇంతలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నికలు వచ్చేశాయి, దాంతో పూర్తిగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓటమి పాలయ్యారు, అది తనకు కంచుకోట అనుకున్న హుజూర్ నగర్ లో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల కార్యాలయానికి రావడం మానేసి అంతా ఢిల్లీకే పరిమితం అయ్యారు. పార్లమెంటు సమావేశాలు కావడంతో అక్కడే ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
సోనియగాంధీ ఆశిస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చారు ఉత్తమ్. ఆ తర్వాత పార్టీ అధిష్టానం కొంత లాయల్ గా ఉంటూ వచ్చారు. పీసీసీ చీఫ్ అయ్యాక రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అటు సోనియా గాంధీ ఇటు రాహుల్ గాంధీ కోటరీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలంగాణాకు జనవరి రెండో వారంలో కొత్త పీసీసీ చీఫ్ వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న వాదన మొదలైంది. 5 ఏళ్ళపాటు పార్టీ వ్యవహారాలు చూసిన ఉత్తమ్ త్వరలో కేంద్ర పార్టీ వ్యవహారాల్లో వెళ్లాలనుకుంటున్నారని చర్చ జరుగుతోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా పార్టీకి నూతన కమిటీలు కొత్త ప్రాధాన్య కార్యదర్శుల నియామకాలు జరగనున్నాయి. వీటితో పాటే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిలను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ రాజకీయాల మీద ఢిల్లీ బేసెడ్ పాలిటిక్స్ మీద కన్నేశారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా ఉంటూ సోనియా రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఉత్తమ్ ఏఐసీసీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం, పార్టీ ప్రధాన కార్య దర్శి పదవి దక్కించుకోవడంతో పాటు కీలకంగా పని చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో కొత్త చీఫ్ ఎంపికలో కూడా ఉత్తమ్ కీలకంగా మారే అవకాశముంది. ఇప్పటికే ఆయన పీసీసీ చీఫ్ పదవికి ఓ పేరును కూడా ప్రతిపాదించినట్లు ప్రచారం నడుస్తోంది. రాష్ట్రంలో తన మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకోవడంతో పాటు ఏఐసిసిలో కూడా తనకంటూ ఓ గుర్తింపు ఉండేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పాలిటిక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.