ఆర్టీసీ పై క్లారిటీ లేదు... జీతభత్యాలు..కార్మికుల విలీనంపై స్పష్టత ఇవ్వని ఏపీ ప్రభుత్వం
posted on Dec 17, 2019 @ 10:15AM
ఏపీలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పై కీలకమైన ముందడుగు పడటంతో ఆ సంస్థ అధికారులు , కార్మికులు సిబ్బందిలో హర్షాతిరేకాలు మొదలయ్యాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేసే కార్మికులు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు అవుతున్నారు. రవాణామంత్రి పేర్ని నాని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారన్న వార్తల నేపథ్యంలో 52,000 మంది ఉత్కంఠగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు సభలోకి బిల్లు రావడం ఆమోద ముద్ర కూడా పడటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే పాత పెన్షన్ విధానం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇతర సౌకర్యాలపై బిల్లులో స్పష్టత లేకపోవటంతో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో అధికారులు , సిబ్బంది కార్మికులు అందరూ కలిపి 51,700 మంది ఉన్నారు. వీరితో పాటు మరో 7,500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామానికి సేవలందిస్తున్న ఈ సంస్థ డీజిల్ ధరల పెరుగుదల పన్నుల భారం పెరగడంతో ఎప్పుడూ నష్టాల బాటలోనే నడుస్తూ ఉంటుంది.
ఇలాంటి సంస్థలు రాత్రింబవళ్లు కష్ట పడి పనిచేసే కార్మికులు ప్రతీ నాలుగేళ్లకోసారి జరిగే వేతన సవరణ సందర్భంగా మెరుగైన జీతభత్యాల కోసం ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి వస్తోంది. అయితే ఈ సమస్యకు శాశ్వతంగా మంగళం పాడాలని జగన్ ప్రభుత్వం సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించింది. అయితే కేంద్రం 31 శాతం వాటా ఇవ్వడంతోనే ఆర్టీసీ ఆవిర్భవించిందని ఏక పక్షంగా విలీనం సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. దీంతో సిబ్బంది వరకూ విలీనం చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి 2020 జనవరి 1 నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన టీటీడీ ఏర్పాటు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో మంత్రి పేర్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కార్మికులు, సిబ్బంది, అధికారులు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కార్మికులు అనుమానాల్లో ప్రధానమైన అంశం పెన్షన్ ఉంటుందా లేదా అనేది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న సౌకర్యాల తమకూ వర్తింపజేయాలని జీతభత్యాల వ్యత్యాసాన్ని కూడా సమానం చేయాలని కార్మిక సంఘాలు కమిటీకి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశాయి.
అయితే నిన్న సభ ఆమోదించిన బిల్లులో ఆ అంశాలేవీ లేవు, వారి డిమాండ్లు అలాగే మిగిలిపోయాయి. విలీన గడువు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉండడంతో ఆలోపే స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి కార్మికులు విన్నవిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్రలో 65 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటిచ్చారని ఇప్పుడు 52 వేల మందికి మాత్రమే న్యాయం జరుగుతుందని ఔట్ సోర్సింగ్ సిబ్బంది గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని తమకు న్యాయం చేయాలని విన్నవిస్తున్నారు.