ముచ్చటగా మూడు... మనసులో మాట బయటపెట్టిన జగన్
posted on Dec 18, 2019 @ 9:47AM
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి... రాజధానిపై ఆటంబాంబు పేల్చారు. చివరి రోజు రాజధానిపై చర్చ చేపట్టడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని భావించినా... ఈ రేంజ్ లో సంకేతాలు ఉంటాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అధికార వికేంద్రీకరణ విధానం మంచిదంటూనే... ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ రావొచ్చేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... కర్నూలులో హైకోర్టు... జ్యుడీషియల్ కేపిటల్... అలాగే అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చంటూ సంకేతాలు వదిలారు. అయితే, రాజధానిపై వారం రోజుల్లో నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇవ్వనుందని, నివేదిక అందాక... సుదీర్ఘంగా చర్చించి రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఇక, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్... రాజధానిపై ప్రకటనకు ముందే తన బినామీలకు లీకులు ఇచ్చారని ఆరోపించారు. బాబు బినామీలంతా భూములు కొన్నాకే అమరాతిని రాజధానిగా ప్రకటించారని జగన్ అన్నారు. ఇక, రాజధాని నిర్మాణం, కనీస మౌలిక వసతుల కల్పనకు లక్షా 9వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కలు కట్టారని, బాబు హయాంలో కేపిటల్ పేరుతో 5వేల 800కోట్లు ఖర్చు చేశారని... ఇంకా లక్ష కోట్లు కావాలని, ఆ డబ్బును ఎక్కడ్నుంచి తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు, రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు.... అభివృద్ధి, పరిపాలన ఒకేచోట కేంద్రీకృతం కావొద్దని ప్రభుత్వానికి సూచించారు. పరిపాలన, చట్టసభలు, కోర్టులు... ఇలా అన్నీ వేర్వేరు చోట ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే... మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందని ధర్మాన హెచ్చరించారు.