గురువింద గింజ సామెతను గుర్తుచేసిన విజయసాయి ట్వీట్!!
posted on Dec 17, 2019 @ 2:52PM
ఎదుటి వ్యక్తిని విమర్శించడం సంగతి తరువాత.. ముందు నువ్వు ఎలా ఉన్నవో చూసుకో అని పెద్దలు చెప్తుంటారు. ఈ విషయం వైసీపీ నేత విజయసాయి రెడ్డికి తెలిసినట్టు లేదు. అందుకేనేమో ట్వీట్ చేసి మరీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వైసీపీ నేతలు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా.. కొడుకుని గెలిపించుకోలేని చేతకాని సీఎం చంద్రబాబు అంటూ.. లోకేష్ ని ప్రస్తావిస్తూ రోజా విమర్శలు చేసారు. అయితే ఈ విమర్శలకి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే బ్యాచ్ కాదు. నేను కావాలనుకుంటే మా నాన్న గెలిచిన కుప్పం నుంచి పోటీ చేసి.. గెలిచానని కాలర్ ఎగరేయొచ్చు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఎక్కడైతే టీడీపీ బలంగా లేదో అక్కడ పోటీ చేసి గెలవాలనుకున్నా. మంగళగిరిలో 1985 నుండి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే అక్కడ పోటీ చేసి గెలిచి చరిత్ర తిరగరాయాలనుకున్నా. ఆ దిశగా పని చేశా. కానీ ఓటమి ఎదురైంది. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని లోకేష్ చెప్పుకొచ్చారు.
కాగా లోకేష్ వ్యాఖ్యలపై తాజాగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "చరిత్ర సృష్టించేందుకే మంగళగిరిలో పోటీ చేశాడట చిట్టి నాయుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయింది. ఈ చరిత్ర సృష్టించాలన్న తాపత్రం ఏమిటో? రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా పరాజయం పాలయ్యావు. ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ." అని విజయ సాయి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ట్వీట్ ని ఎంజాయ్ చేస్తుండగా.. కొందరు మాత్రం విజయ సాయి పై విమర్శలు గుప్పిస్తున్నారు. "అక్కడకి నివేదో ప్రత్యేక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినట్టు బిల్డప్ ఇస్తున్నావ్"... "నువ్వు ఎక్కడ పోటీ చేసి రాజ్యసభ mp అయ్యావు తాతా.. ఎన్ని సూట్ కేస్ లు మార్చితే ఎంపీ అయ్యావు చెప్పు తాతా".. అంటూ కామెంట్స్ తో విజయసాయిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.