మున్సిపల్ ఎన్నికలు.. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేటీఆర్
posted on Dec 17, 2019 @ 10:59AM
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు నిధుల సంకటం ఏర్పడింది. గతంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో క్షేత్ర స్థాయిలో ప్రజలు కోరిన పనులు చేపట్టగలిగే వారు. పనిలో పనిగా సొంత పార్టీ ముఖ్య నేతలకి కూడా అందులోనే అన్ని సర్దుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. నియోజక వర్గ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీ కార్యకర్తలకు ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక లోలోపల తికమకపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మునిసిపాలిటీలు కార్పొరేషన్ లుగా అప్ గ్రేడ్ చేశారు. వాటిలో పాగా వేయాలన్నది టీఆర్ఎస్ నేతల ఆలోచనగా ఉంది. అప్ గ్రేడ్ అయిన మునిసిపాలిటీలు కార్పొరేషన్లలో పలు సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ నేపధ్యంలో కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ముందుగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలన్నది టీఆర్ఎస్ పెద్దల లక్ష్యంగా ఉంది.
మున్సిపల్ ఎన్నికల పై గులాబి పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలను గుర్తించాలని పార్టీ నేతలను ఆదేశించింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనుల పై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు భోగట్టా. కొత్తగా చేపట్టాల్సిన పనుల విషయమై అధికారులతో మాట్లాడి శంకుస్థాపనలకు ముహుర్తాలు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు.ఈ తరుణంలో ఒక్కో మునిసిపాలిటీలో కనీసం 30 వరకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిజీగా వున్నారు. వచ్చే ఏడాది జనవరి మూడో వారంలోనే ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కార్పొరేషన్ లో డివిజన్ల వారీగా అనేక మంది ఆశావహులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. ఒక్కో స్థానంలో టికెట్ ఆశించే వారు లెక్కకు మిక్కిలిగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ పెద్దలకి సంక్లిష్టంగా మారింది. దీంతో ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే కేటీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.