పని చేయని ఫాస్టాగ్.. టోల్ గేట్ల వద్ద క్యూ కట్టిన వాహనాలు
posted on Dec 17, 2019 @ 11:09AM
ఫాస్టాగ్ అమలులోకి వచ్చాక వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. డబ్బులు చెల్లించినా వినియోగదారులకు ట్యాగ్ లను అందజేసే పరిస్థితి కనిపించటం లేదు. కారణం కేంద్రం నుంచి ట్యాగ్ లు సరఫరా నిలిచిపోవడమే అంటున్నారు. ఫాస్టాగ్ లు అందిస్తున్న 23 బ్యాంకులు మరికొన్ని పేమెంట్ బ్యాంకులు వ్యాలెట్ సంస్థల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు తంటాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ నిబంధన ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినా ఓ వైపు ఫాస్టాగ్ రీడింగ్ లో సాంకేతిక సమస్యలు మరోవైపు అవసరానికనుగుణంగా రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరం ఉన్న ట్యాగ్ ల సరఫరా లేకపోవడంతో పరిస్థితి రోజు రోజుకు జటిలమవుతోంది. డిమాండ్ కనుగుణంగా కేంద్ర రహదారుల శాఖ నుంచి ఫాస్టాగ్ ల సరఫరా లేకపోవడంతో ఇప్పటికిప్పుడు ఈ వ్యవస్థ అమలు దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే కేంద్రం కూడా 25 శాతం ఫాస్టాగ్ లైన్లను హైబ్రిడ్ గా మారుస్తూ నెల రోజుల పాటు వాటిలో ఎలాంటి అపరాధరుసుం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ట్యాగ్ ల సరఫరా లేకపోడంతో దాదాపు అన్ని బ్యాంకులు ఇప్పుడు కేవలం వినియోగదారుల నుంచి ఫీజులు వసూలు చేసి రిజిస్ర్టేషన్ లు చేయడానికి పరిమితమయ్యాయి.
15 రోజుల క్రితం వరకూ ఫాస్టాగ్ లు కొనండి బాబు అంటూ బ్యాంకులు తిరిగేవి. ఇప్పుడు వినియోగదారులు ఫాస్టాగ్ ఇవ్వండి అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఇవ్వటానికి ట్యాగ్ ల స్టాకే లేదు. దీంతో ఫాస్టాగ్ రిజిస్ర్టేషన్ చార్జీలు సెక్యూరిటీ డిపాజిట్ లు వసూలు చేసి వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ట్యాగ్ ల సరఫరా కాగానే వారికి అందజేస్తామని చెబుతున్నారు. ట్యాగ్ ల సరఫరా కోసం ప్రతి రోజు జాతీయ రహదారుల సంస్థను కోరుతున్నామని అయినా స్పందన లేదంటున్నారు బ్యాంకు సిబ్బంది. అటు క్యాబ్ డ్రైవర్ లు కూడా దీని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్టాగ్ లేకపోతే టోల్ ప్లాజాల దాటాల్సిన ప్రాంతాల కారణంగా క్యాబ్ లు ప్రైవేటు బస్సుల బిజినెస్ దెబ్బతింటోందని వాపోతున్నారు. మరోవైపు ఫాస్టాగ్ లు తీసుకున్న వాహనదారులకు తంటాలు తప్పడం లేదు. టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్ఐడీ రీడర్ లు సరిగా పని చేయడం లేదు. ఒకవేళ అవి సరిగ్గానే ఉన్న కంప్యూటర్ లోని డేటాతో అనుసంధానం చేయడంలో ఆపరేటర్లకు సరైన శిక్షణ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.