పోలీసుల దౌర్జన్యకాండ... అమరావతి పొలాల్లో ఘోరం...
అమరావతి రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల దౌర్జన్యాలతో 29 గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నెలరోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. అమరావతి కోసం తరలివస్తోన్న రైతులు, మహిళలు, పిల్లలపై పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారు. లాఠీలతో గొడ్డును బాదినట్లు బాదేస్తున్నారు. దాంతో, పలువురు రైతులు, వృద్ధులు, మహిళలకి రక్తం కారేలా గాయపడుతున్నారు. ఇక, ఛలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అమరావతి పొలాలు యుద్ధ రంగాన్ని తలపించాయి. ఆంక్షలను సైతం లెక్కచేయకుండా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన అమరావతి ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లు చితక్కొట్టారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పొలాల్లోనే తరిమితరిమి కొట్టారు. మహిళలు, వృద్ధులని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీలు విరిగేలా కసితీరా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. అంతేకాదు పలువురు బట్టలు చింపేశారు. మహిళలనైతే ఈడ్చిపడేశారు. దాంతో, వందలాది మంది రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల దౌర్జన్యంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక అమరావతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుళ్లూరు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, దొండపాడు, ఉద్దండరాయునిపాలెం, మందడం తదితర గ్రామాల్లో అయితే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవరైనా అసెంబ్లీ వైపు వస్తున్నట్లు కనిపిస్తే చాలు తరిమితరిమి కొడుతున్నారు. అయితే, రక్తమోడినా, తీవ్ర గాయాలైనా, అమరావతి రైతులు, మహిళలు, వృద్ధులు, యువకుల పట్టుదల ముందు పోలీసుల ఆంక్షలు ఓడిపోతున్నాయి. అమరావతిని రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ ముందుకు కదులుతోన్న రైతులు, మహిళలను చూసి పోలీసులు సైతం బిక్కమొహం చేస్తున్నారు.