అర్ధరాత్రి అసెంబ్లీ లాబీ వద్ద నిరసన తెలిపిన చంద్రబాబు....
posted on Jan 21, 2020 @ 10:37AM
నవ్యాంధ్ర చరిత్రలో మొదటిసారిగా మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ లాబీలో కింద కూర్చొ ని నిరసన తెలిపారు. ఆయనతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు కూడా కూర్చున్నారు, మరోవైపు టిడిపి ఎమ్మెల్యే లను బయటకు తీసుకురావటం కోసం మార్షల్ బలప్రయోగం చేశారు. దీన్ని వారు ప్రతిఘటించటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ బలప్రయోగాన్ని సస్పెన్షన్ ను నిరసిస్తూ చంద్రబాబు అక్కడ ధర్నాకు దిగారు. మార్షల్స్ వారిని లేపేందుకు ప్రయత్నించగా బలవంతం చేయొద్దని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు.అసెంబ్లీ నుంచి రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్తూ ఉండగా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తుందంటూ అనుమతి నిరాకరించగా పోలీసులకు టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ కారణంగా చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని దారిమళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు మళ్లించారు.మళ్లీ మందడం కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకువెళ్లారు. డొంకరోడ్ల గతుకుల రోడ్లలో అతివేగంతో గంటన్నర సేపు తిప్పారు.11:30 నిమిషాల ప్రాంతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వైపు తీసుకువెళ్లారు. చంద్రబాబును అరెస్టు చేసి తీసుకొస్తున్నారన్న సమాచారంతో టిడిపి కార్యకర్తలు పోలీసు వాహనాల వెంట పరుగులు తీశారు.స్థానిక మిద్దె సెంటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడుకొని చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చంద్రబాబును, ఎమ్మెల్యేల్ని వాహనం నుంచి దించేసి వెళ్ళిపోయారు.చంద్రబాబు పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించడం పై ఎమ్మెల్యేలు కార్యకర్తలు తీవ్రం గా తప్పుబట్టారు. పాదయాత్రగా మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు, తనను ఎందుకు అరెస్టు చేశారో వాహనాల్లో ఎందుకు గంట సేపు తిప్పారో చెప్పా లని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తాము ఇంటి వద్ద దింపే క్రమంలో దారి తప్పాము అంటూ పోలీసులు టిడిపి నేతలకు చెప్పగా చంద్రబాబు మరింత ఆగ్రహానికి లోనయ్యారు.తన నివాసం తెలియకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తొందని చెపారు. ఈ విషయమై గుంటూరు ఐజీతో మాట్లాడారు జరిగిన ఘటన పట్ల పోలీసులు విచారం వ్యక్తం చేసి క్షమాపణ లు చెప్పడంతో చంద్రబాబు ఎమ్మెల్యే లు శాంతించారు. మొత్తం మీద అర్ధరాత్రి 12:30 నిమిషాలకు చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు.