3 రాజధానులు... 25 జిల్లాలు... వికేంద్రీకరణే లక్ష్యం...
posted on Jan 21, 2020 @ 10:20AM
అమరావతి రైతులు, మహిళలు వద్దంటున్నా... విపక్షాలు వ్యతిరేకిస్తున్నా... తాననుకున్న మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కొత్త జిల్లాల ఏర్పాటుపైనా క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించిన సీఎం జగన్... మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. అయితే, ముందుగా ప్రాంతీయ ప్రణాళికా మండళ్లను ఏర్పాటు చేద్దామని, ఆ తర్వాతే కొత్త జిల్లాల అంశాన్ని పరిశీలిద్దామని మంత్రివర్గ సహచరులకు సీఎం జగన్ సూచించారు. అంతేకాదు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వచ్చే ఏడాది చేపడదామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అయితే, పోలీస్ శాఖలో రేంజ్ లు ఉన్నట్లుగా, కలెక్టర్లకూ ప్రాంతీయ స్థాయిలో ఒక విధానం ఉండాలన్న ఆలోచనతోనే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ముందుగా నాలుగు కమిషననరేట్లు ఏర్పాటుచేసి పాలనను వికేంద్రీకరిద్దామని, ఆ తర్వాత వచ్చే ఏడాది కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిద్దామని మంత్రివర్గ సహచరులకు సీఎం జగన్ వివరించారు.