చంద్రబాబు పై మండిపడ్డ అమర్ నాధ్...

శాసన మండలిలో సంఖ్యా బలం ఉందన్న కారణంతో చంద్రబాబు డిక్టేటర్ లా వ్యవహరించారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షల్ని అడ్డుకునేలా 154 ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపేలా చూశారని ఆరోపించారు. మండలి పరిణామాల్ని ప్రతి ఒక్కరూ బ్లాక్ డేగా పరిగణిస్తున్నారన్నారు.నేడు చట్టాలను, చట్టసభలను అతిక్రమించి నేరుగా సీట్ నే డిక్టేట్ చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారంటే, ఆయన మేనేజ్ మెంట్ ఏరకంగా చేస్తున్నారన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని గుడివాడ అమర్ నాథ్ కోరారు. ఇలాంటి ప్రవర్తనతో వారు ఏమైన విజయం సాధించారా అంటే.., మాహా అయితే మూడు నెలలో, నాలుగు నెలలో ఆలస్యవుతోంది తప్ప ఏం జరగదన్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ ద్వారా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను వాడుకోవాలని తప్ప మరే ప్రజాలబ్ధి లేదని అమర్ నాధ్ వెల్లడించారు. దీని కోసం ఏదో విజయం సాధించినట్టు, పక్క దేశం మీద యుద్ధం గెలిచి వస్తే సైనికులకు ఏరకంగా బ్రహ్మరధం పడతామో ఆ రకంగా ఆయన రోడ్లు ఎక్కడం, ఆయన మీద పూలవర్షం కురిపించుకోవడం, క్షీరాభిషేకాలు చేయించుకోవడం ఏంటని ఎద్దేవా చేసారు. మొన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య ఖూనీని మీరు విజయంగా భావిస్తున్నారా అని అమర్ నాథ్ మండిపడ్డారు.

మండలి రద్దుకు ఎంత మేర అవకాశాలు ఉన్నాయి...

మండలి కొనసాగించాలా వద్దా అన్న అంశం పై ఏపీ సర్కారు తీవ్రంగా ఆలోచిస్తోంది. అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా ఈ మండలి మనకు అవసరమా అన్నట్టు మంత్రులు వారి భావనను తెలిపారు. దీంతో సీఎం కూడా మండలి కొనసాగించాలా వద్దా అనేది సోమవారం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. దీంతో మండలి భవిష్యత్ ఏం కాబోతోంది అనే చర్చ మొదలైంది. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలికి వచ్చిన తరువాత అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఎలాగైనా బిల్లుల్ని అడ్డుకోవాలని వ్యూహాల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు తన దగ్గరున్న వ్యూహాలన్ని అమలు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా రూల్ 71 ను తెరపైకి తెచ్చి దాని నెగ్గించుకున్నారు. తర్వాత మండలిలో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే వరకు వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో టిడిపి సక్సెస్ అయింది.  ప్రభుత్వం ముందు కేవలం రెండు సమాధానాలు కనిపిస్తున్నాయి.ఒకటి ఆర్డినెన్స్ తేవడం, రెండోది శాసనమండలిని రద్దు చేయడం లేకుంటే సెలక్ట్ కమిటీ నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడడం, కానీ ఇవేమీ అంత సులువు కాదని సమాచారం.ముందుగా సెలక్ట్ కమిటీ ప్రక్రియ పరిశీలిస్తే అసెంబ్లీ రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపిన ఏ బిల్లులైనా కనీసం నెల రోజుల పాటు ఆగుతాయి. అత్యధికంగా 3 నెలల పాటు ఆపొచ్చు, కనీసం నెల రోజుల పాటు ఏపీ సర్కార్ వేచి ఉండాల్సి ఉంది. ఒకవేళ సెలెక్ట్ కమిటీ మార్పులూ చేర్పులూ సూచిస్తే మళ్లీ అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించి ఆమోదం పొందాలి. ఇది ఒక సమాధానం ఐతే రెండో ఆప్షన్ ఆర్డినెన్స్ తీసుకురావడం సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపకుండా నేరుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేయటం. ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆరు నెలల్లోపు చట్టం చేసుకోవచ్చు, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు దాన్ని ఆమోదించుకోవచ్చు. ముందుగా అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలి కానీ అక్కడ మరో మెలిక కూడా ఉంది. ఆర్డినెన్సు తీసుకురావాలంటే ఏదైనా బిల్లు ఆమోదం పొందకపోతే దాని స్థానంలో ఆర్డినెన్సు తీసుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం అంటే ఈ రెండు బిల్లులు సజీవంగా ఉన్నట్లే, రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావడం కుదిరే పని కాదని తెలుస్తోంది.  ఇక శాసన మండలి రద్దు. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తీసుకునే నిర్ణయం కాదు కేంద్రం అనుమతి కూడా కావలసి ఉంటుంది. ముందుగా మండలిని రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ స్టేట్ కేబినెట్ తీర్మానం చేయాలి, దానిని శాసన సభ ఆమోదంతో కేంద్రానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. కేంద్ర చట్టం ద్వారా మాత్రమే శాసనమండలిని రద్దు చేయగలరు, ఈ ప్రక్రియ ముగియడానికి కనీసం ఏడాది పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఏం జరగవచ్చని పరిశీలిస్తే బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపడంతో ముందుగా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ చైర్మన్ ను సభ్యులను నియమించడంతో పాటు కాలపరిమితి విధి విధానాల ఖరారు చేయాల్సి ఉంది. వీటి పై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు.మండలిలో పార్టీల బలాబలాల ఆధారంగా కమిటీలో ప్రాతి నిధ్యం ఉంటుంది. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కువ కాబట్టి కమిటీలో మెజార్టీ సభ్యులు ఆ పార్టీ నుంచే ఉంటారు.కమిటీ ఆ బిల్లులను పరిశీలించి నివేదిక అందజేయటానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశముంది. ఎటు చూసినా సమయం మూడు నెలల నుంచి ఏడాది పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. దీని పై ఏపీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది సోమవారం తేలనుంది.  

నో కామెంట్.. మూడు రాజధానులపై నోరు మెదపని మండలి చైర్మన్!

శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్టు కమిటీకి పంపాలనే నిర్ణయం తాను తీసుకోవటం వల్లనే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆవేశంగా మాట్లాడారు తప్ప ఉద్దేశ పూర్వకంగా దుర్భాషలాడలేదని కౌన్సిల్ చైర్మన్ షరీఫ్ అన్నారు. తనకున్న విచక్షణాధికారాలతోనే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రానికి రాజధాని ఒకటేనా మూడు ఉండాలన్న దానిపై నో కామెంట్ అనేశారు షరీఫ్. తణుకులోని వేల్పూర్ రోడ్డులోని మసీదుకు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతూ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం మీద ఈ బిల్లులు ఏ మలుపుకు దారి తీస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

స్ట్రాంగ్ రూంలో రాంగ్ పనులు.. కొల్లాపూర్ లో బ్యాలెట్ బాక్సుల భద్రతపై ఆందోళన!

మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా పాలమూరులో పొలిటికల్ హీట్ తగ్గలేదు. గ్రామాల్లో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చేంత వరకు పార్టీలన్నీ సైలెంట్ అవుతాయి. కొల్లాపూర్ లో ఇందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. స్ట్రాంగ్ రూంలో ఏదో జరుగుతుందన్న అనుమానంతో విపక్ష పార్టీలన్నీ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ కొల్లాపూర్ వచ్చి బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూంను పరిశీలించేంత వరకు టెన్షన్ కొనసాగింది.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ ,కొత్తకోట, కోస్గి మునిసిపాలిటీలు మినహా మిగతా 12 స్థానాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మునిసిపాలిటీ భూత్పూర్ లో బిజెపి హవా కనిపిస్తోంది. నారాయణ పేట జిల్లాలోని మక్తల్, నారాయణపేటలో టిఆర్ఎస్ బిజెపి మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కల్వకుర్తిలో కాంగ్రెస్ , టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. గద్వాలలో బిజెపి, టిఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. చైర్మన్ పదవి కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఒకే ఒక్క మున్సిపాలిటీ వడ్డేపల్లి. ఆత్మకూరు, అమరచింత మునిసిపాలిటీల్లో టీఆర్ఎస్ ,బీజేపీ పోటీ పడుతుంటే పెబ్బేరులో టీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సైలెంట్ ఓటింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మునిసిపాలిటీ ఫలితాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

కమల నాయకుడు ఎవరు?.. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపు గుర్రంగా ఎవరు నిలుస్తారనే ప్రశ్న సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది. బీజేపీ ధీమాతో ముందుకు వెళుతున్నా.. సర్వే రిపోర్టులు మాత్రం కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపుతున్నాయి. అదే విధంగా ఢిల్లీ ప్రజలకు తాను పెద్ద కొడుకు వంటి వాడినని తప్పకుండా తనకే మళ్లీ పట్టం కడతారని అంటున్నారు కేజ్రీవాల్. ప్రచారంలో మాత్రం ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకువెళుతోంది ఆప్. ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు ఆప్ నేతలు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8వ తేదీన జరగబోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం సైలెంట్ గా పావులు కదుపుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నట్టే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు బిజెపి ప్రచార వ్యూహాన్ని రచిస్తోంది. అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పటికి కూడా తేలకపోవటం బీజేపీకి మైనస్ అని చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని అస్త్రంగా మార్చుకున్నారు ఆప్ నేతలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షల్ని ఐదేళ్లలో నెరవేర్చినట్టుగా చెబుతున్నారు కేజ్రీవాల్. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లుగా ఆయన తెలిపారు. కరెంట్, మంచి నీటిని ఉచితంగా అందిస్తున్నట్టుగా తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం విషయంలో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు కేజ్రీవాల్. ఇక గెలుపు ఢిల్లీ ప్రజల చేతిలోనే ఉంది.  

పాక్ తో లింక్.. డీఎస్పీ దవిందర్ సింగ్ కు 15 రోజుల రిమాండ్

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులకు సహకరిస్తూ పట్టుబడ్డ డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డీఎస్పీ దవిందర్ సింగ్ ను జమ్ములో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దవీందర్ సింగ్ కు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది. భారీ భద్రత మధ్య దవీందర్ సింగ్ తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. దవీందర్ సింగ్ కు పాకిస్థాన్ తో ఉన్న లింక్ ల పై కూడా ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. గతంలో దవీందర్ బంగ్లాదేశ్ కూడా వెళ్లినట్టుగా గుర్తించారు. బంగ్లాదేశ్ లో తన కూతుళ్లు చదువుకుంటున్నారని వివరణ ఇచ్చారు దవీందర్ సింగ్.  జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల లేటెస్ట్ కుట్ర తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు కూడా టెర్రరిస్టుల ట్రాప్ లో పడడం సంచలనం కలిగిస్తోంది. సౌత్ కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులను తన కార్లో ఢిల్లీకి తీసుకొస్తుండగా అరెస్టు చేశారు. నవీద్ బాబు, అల్తాఫ్ అనే ఉగ్రవాదులను ఢిల్లీకి తన కార్లో తీసుకొస్తుండగా పట్టుబడ్డాడు దవీందర్ సింగ్. షోపియాన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. డీఐజీ అతుల్ గోయల్ స్వయంగా డీఎస్పీ దవీందర్ సింగ్ తో పాటు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.  గతంలో ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడంలో ప్రతిభ కనపరచినందుకు డీఎస్పీ దవీందర్ సింగ్ శౌర్యపథకం కూడా లభించింది. ఇటువంటి ఆఫీసర్ ఉగ్రవాదుల ట్రాప్ లో చిక్కుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. డీఎస్పీ కారు నుండి రెండు ఏకే 47 రైఫిళ్ల తో పాటు గ్రెనేడ్ లు కూడా స్వాధీనపరుచుకున్నారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దవీందర్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు.  

మండలి రద్దయితే... పిల్లి, మోపిదేవి పరిస్థితేమిటి?

మండలిలో పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే... కౌన్సిల్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో... తెలుగుదేశానికి రుచి చూపించాలన్న పట్టుదలతో... జగన్మోహన్ రెడ్డి ఉన్నారని... దాంతో, మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో జగన్ పట్టుదలకు పోతేమాత్రం మండలి రద్దు తప్పదంటున్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విశ్లేషించిన మీడియా, రాజకీయ విశ్లేషకులు సైతం మండలి రద్దు ఖాయమనే చెబుతున్నారు. అయితే, పట్టుదలకుపోయి మండలిని రద్దుచేస్తే, ముందుముందు జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. మరి, వీళ్లందరికీ ఏం సమాధానం చెబుతారు... ఏవిధంగా పదవుల్లో అకామిడేట్ చేస్తారనేది ప్రశ్నార్ధకమే. హామీలు పొందినవాళ్ల సంగతి పక్కనబెడితే... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న 9మంది తమ పదవులు కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారతారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.  అయితే, మండలి రద్దయితే, ఇప్పటికిప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు వచ్చే ముప్పు లేకపోయినా, ఆరు నెలలు తర్వాత మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈలోపు... ఏవైనా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలొచ్చి... ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్ప.... వీళ్లిద్దరూ మంత్రి పదవుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సుండదు. అయితే, ఏపీలో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగే పరిస్థితే లేదు. దాంతో, మండలి రద్దు జరిగితే మాత్రం ఆర్నెళ్ల తర్వాత కచ్చితంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు మాజీలుగా మారిపోతారు. అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు... వైఎస్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తులు. పైగా ఎప్పట్నుంచో వైఎస్ ఫ్యామిలీతో అసోసియేటై ఉన్నారు. అదే సమయంలో జగన్ కు కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. అందుకే, మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అయితే, మండలి రద్దయి ఆర్నెళ్ల తర్వాత మాజీలుగా మారితే... వీళ్లిద్దరికీ కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టొచ్చని అంటున్నారు.

వైఎస్ పునరుద్ధరిస్తే... జగన్ రద్దు చేస్తాడా? తండ్రీకొడుకుల్లో ఎంత తేడా?

రాజ్యసభ మాదిరిగా శాసనమండలి కంపల్సరీ హౌస్ కాదు. పైగా కౌన్సిల్ కచ్చితంగా ఉండాల్సిదేనంటూ రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. శాసనమండలి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఛాయిస్ మాత్రమే. సూచనలు, సలహాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేసుకునే సభ. అయితే, రాజ్యసభ అలాంటి కాదు... ఏ ప్రభుత్వమైనా వద్దనుకున్నా రద్దు చేయడం సాధ్యంకాదు... ఎందుకంటే, రాజ్యసభకు చట్టబద్ధత ఉంది... దాన్నెవరూ రద్దు చేయలేరు. అయితే, శాసనమండలికి అలాంటి పరిస్థితి లేనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వద్దనుకుంటే మండలి రద్దును ఆపడం ఎవరి వల్లా కాదంటున్నారు. న్యాయపరంగా ముందుకెళ్లినా కౌన్సిన్ రద్దును అడ్డుకోలేరని చెబుతున్నారు. కేంద్రం కూడా అడ్డుచెప్పే అవకాశం ఉండదంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం సహకరించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పొలిటీషియన్స్ చెబుతున్నారు. అయితే, 1958లో ప్రారంభమైన ఏపీ శాసనమండలి... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 1985లో రద్దు చేశారు. అప్పట్నుంచి 2007వరకు కౌన్సిల్ పునరుద్దరణకు ఏ ముఖ్యమంత్రీ ప్రయత్నించలేదు. అయితే, 2004లో ఆంధ్రప్రదేశ్ అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి... ఏళ్ల తరబడి పదవులకు దూరంగా ఉన్న కాంగ్రెస్ లీడర్ల కోసం మండలి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో... 2007లో పార్లమెంట్ ఆమోదంతో తిరిగి ఏపీలో కౌన్సిల్ ప్రారంభమైంది. అలా, 2007లో ప్రారంభమైన మండలి.... రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు, ఎవరూ ఊహించనివిధంగా వైఎస్సార్ పునరుద్ధరించిన మండలిని రద్దుచేసే దిశగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తుండటం చర్చనీయాంశమైంది. తన తండ్రి ప్రారంభించిన అనేక పథకాలను తిరిగి కొనసాగిస్తున్న జగన్... వైఎస్ పునరుద్ధరించిన మండలిని మాత్రం ఉండాలో వద్దో తేల్చేస్తామంటూ మాట్లాడటంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తండ్రి పునరుద్ధరించిన దానిని కొడుకు రద్దు చేయబోతున్నాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి, మండలిని నిజంగానే రద్దు చేస్తారో? లేక కౌన్సిల్ లో టీడీపీని దారిలోకి తెచ్చుకోవడానికి వదిలిన అస్త్రమో చూడాలి.

కుట్రపూరితంగానే తమ పై కేసులు మోపారన్న ప్రత్తిపాటి పుల్లారావు...

ప్రత్తిపాటి పుల్లారావు గారి పై చేసిన ఆరోపణలకు స్పందిస్తూ 'సభలో గిరి దాటితే మార్షల్స్ ను పెట్టి బయటపడేయండి అని మాట్టాడిన పదజాలం చాలా అభ్యంతరకరంగా ఉందని చట్ట సభలను గౌరవించాలి కానీ చట్ట సభలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిన్న జరిగిన ఈ చట్టసభల్లోనే చూశానని పుల్లరావు వెల్లడించారు.చట్టసభలంటే హుందాతనం ఉండాలి చరిత్రలో చెప్పుకునే విధంగా ఉండాలి కానీ భయపడే పరిస్థితుల్ని అధికార పక్షం కల్పిస్తోందని ఉద్యమంలో వాస్తవాల చూపెడుతున్న మీడియా పై అక్రమ కేసులు పెడుతున్నారని పుల్లారవు వెల్లడించారు'.మండలి లో కూడా ప్రత్యేక్ష ప్రసారాలను నిలిపివేసే ప్రయత్నాలను చేపట్టారని ఎక్కడ వారు చేసే అరాచకాలు బయటికి వస్తాయో అని ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చూడకుండా మీరు లైవ్స్ కట్ చేసే ప్రయత్నాలు చేశారు అని పుల్లారవు మండిపడ్డారు. తన పై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ నారాయణ గారు కానీ, తాను కానీ ఎప్పుడూ ఎవరి వద్ద నుంచి ఎటువంటి అక్రమ భూములు కానీ, బలవంతపు భూములు కానీ తీసుకోలేదని బుజ్జి అనే ఒక దళితుడ్ని తీసుకువచ్చి కుట్రపూరితంగా తమ పై కేసులు పెట్టించారని వెల్లడించారు.తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని,తాము ఏ తప్పులు చేయలేదు కాబట్టి ఈ కేసులకు బయపడేది లేదని పుల్లారావు తెలియజేశారు.ల్యాండ్ పూలింగ్ చేసినంత కాలం తమ సమక్షంలో లీగల్ ఆర్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏది జరగలేదని,చంద్రబాబు గారి వద్ద మద్యం వాసన వచ్చిందని వస్తున్న ఆరోపణలను గట్టి జవాబునిస్తూ మద్యం అలవాటు ఉండి తాగే వారి దెగ్గిరే మద్యం వాసన వస్తుందని, చంద్రబాబు గారు ఎలాంటి వారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని లేనిపోని ఆరోపణలు చేయడం తగదని పుల్లారావు గట్టి చురకనంటించారు. వైసీపీ సర్కార్ తమ పై చేసిన ఆరోపణలను ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుల్లారవు గారు వెల్లడించారు.

దారిలోకొస్తే సరి...లేదంటే వేటే... మండలిపై మూడ్రోజుల వ్యూహం

ఎందుకీ మండలి అంటూ శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో కౌన్సిల్ రద్దు దాదాపు ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే, మండలి కొనసాగాలో వద్దో సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ మూడ్రోజులు గ్యాప్ తీసుకోవడం వెనుక వైసీపీ వ్యూహం ఉందంటున్నారు. ఈ మూడు రోజుల్లో పరిణామాలు తమకు అనుకూలంగా మారితే మండలి యథాతథంగా కొనసాగుతుందని, ఒకవేళ అదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం కౌన్సిల్ కొనసాగే అవకాశమే ఉండదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. బుధవారమే నిరవధిక వాయిదా పడాల్సిన అసెంబ్లీని గురువారం కూడా కొనసాగించి, ఆ తర్వాత మూడ్రోజులు విరామమిచ్చి... సోమ, మంగళవారాల్లోనూ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు. ఈ మూడ్రోజుల్లో మండలి వాతావరణాన్ని పరిశీలిస్తారని, సానుకూల పరిస్థితులు కనిపిస్తే కౌన్సిల్ సేఫ్ గా ఉంటుందని, లేకపోతే మాత్రం రద్దు దిశగా అడుగులు చేస్తారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో విపక్ష సభ్యులను తమవైపు లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఒకరిద్దరు మినహా ఎవరూ అధికార పార్టీ వైపు మొగ్గుచూపలేదు. దాంతో, ఈ మూడ్రోజుల గ్యాప్ లో మెజారిటీకి అవసరమైన సభ్యులను తనవైపు మళ్లించుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తోంది. ఒకవేళ, ఈ వ్యూహం ఫలించకపోతే... సోమవారం శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఆ వెంటనే ఉభయ సభలను ప్రోరోగ్ చేసి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్సులు జారీ చేసి తన పంతం నెగ్గించుకోవాలని సీఎం జగన్ ఆలోచనగా వైసీపీ నేతలు  శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన... ఇంగ్లీషు మీడియం, ఎస్సీ ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల బిల్లులను మండలి తిరస్కరించినప్పుడే... మండలి రద్దు ఆలోచనకు బీజంపడింది. అప్పుడే మండలిని రద్దు చేసేద్దామంటూ సీఎం జగన్... మంత్రులతో వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు విషయంలోనూ చుక్కెదురు కావడంతో మండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే, మంత్రులు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, సలహాదారులు, అడ్వకేట్‌ జనరల్‌, న్యాయనిఫుణులతో చర్చించిన జగన్మోహన్ రెడ్డి.... అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. తమకెలాంటి అభ్యంతరం లేదంటూ అందరి నుంచీ సమాధానం రావడంతోనే... ఈ మండలి ఎందుకంటూ శాసనసభలో జగన్ బాంబు పేల్చారని అంటున్నారు.  మొత్తానికి, ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, సర్కారు పెద్దల కంట్లో నలుసులా మారిన శాసన మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, మండలిని ఉంచుకోవడం... తుంచుకోవడం... పూర్తిగా రాష్ట్రం ఇష్టమైనా.... అసెంబ్లీ తీర్మానం చేయగానే రద్దయిపోదు... తుది నిర్ణయం కేంద్రం చేతిలో ఉంటుంది... రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాక... రాష్ట్రపతి సంతకం చేస్తేనే మండలి రద్దవుతుంది. అయితే, ఈ ప్రక్రియ ఎప్పటిలాగా పూర్తవుతుందో కచ్చితంగా చెప్పలేం... ఏడాది పట్టొచ్చు... లేక ఏడాదిన్నర... రెండేళ్లు కూడా పట్టొచ్చు... కేంద్రం ఎంత వేగంగా స్పందిస్తే అంత త్వరగా రద్దు జరుగుతుంది.

మండలిని రద్దు చేయాలంటే ప్రక్రియ ఏమిటి?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా... శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మండలిలో చుక్కెదురు కావడంతో కౌన్సిల్ రద్దు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. అయితే, మండలిని రద్దు చేయాలంటే మొదటగా శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. శాసనసభలో ఎలాగూ జగన్ ప్రభుత్వానిదే మెజారిటీ కనుక తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే. అయితే, శాసనసభ చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చించి లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ కి విచక్షణాధికారాలు ఉన్నాయి. దాంతో, కేంద్రానికి ఇష్టంలేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న తరుణంలో జగన్ ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించకుండా తిప్పిపంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే... ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసిన నేపథ్యంలో...  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. ఇందులో రాజకీయాలు ఏమీ ఉండవని చెబుతున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు.

జగన్ చేతిలో మండలి భవిష్యత్తు...

 శాసన మండలి రద్దు దిశగా వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది.ఏపీ శాసన మండలి రద్దు చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రతిపాదన చేశారు. సోమవారం సభ నిర్వహించి మండలి కొనసాగింపు పై చర్చిద్దామని స్పీకర్ ను కోరారు. శాసన మండలిలో బుధవారం జరిగిన పరిణామాల తన మనసును ఎంతగానో బాధించాయని సీఎం అసెంబ్లీలోనే మేధావుల ఉండగా మండలి అవసరమా అంటూ ప్రశ్నించారు.పాలన వికేంద్రీకరణ సీఆర్ డీఏ బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపించటంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. మండలి ఉండాలా వద్దా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుందామని స్పీకర్ తమ్మినేని సీతారాంను సీఎం కోరారు.దానిని స్పీకర్ సానుకూలంగా స్పందించారు. 27వ తేదీ ఉదయం 11 గంటలకు సభను సమావేశపరుస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో గెలవాలనుకున్న చట్టసభల్లో మేధావులకు ప్రాతి నిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో మండలిని ఏర్పాటు చేశారని అసెంబ్లీలోనే మేధావులూ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, రైతులు పాత్రికేయులు విదేశాల నుండి తిరిగొచ్చినవారూ అందరూ ఉన్నప్పుడు ఇక మండలి అవసరమా అని అభిప్రాయపడ్డారు సీఎం.ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు తిరస్కరించారు. ఆంగ్ల మాధ్యమం బిల్లును టిడిపి శాసన సభలో సమర్థిస్తే ఆ పార్టీ వాళ్లే మండలిలో వ్యతిరేకించారని రాజకీయ దురుద్దేశంతో ఉన్న మండలి అవసరమా అని  జగన్ నిలదీశారు. మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీ నిర్ణయం సందర్భంగా చేసిన ప్రసంగం వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆ ప్రసంగం విన్నాక ముఖ్యమంత్రి మళ్లీ మాట్లాడుతూ ఏ బిల్లు కైనా సవరణలు సూచనలు చేయొచ్చు, నచ్చక పోతే తిరస్కరించొచ్చు కానీ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించటం తప్పని అభిప్రాయపడ్డారు. మండలి పరిణామాలతో తన మనసు చాలా బాధపడిందని జగన్ తెలిపారు.పేద రాష్ట్రం లో ఏటా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన శాసనమండలి ఉండాలా, రద్దు చేయాలా అని ప్రశ్నించారు జగన్.  ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు నని, రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదని కేవలం పాలనా స్థానం అని మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు జగన్.ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచే పాలన సాగుతోందని దానికి ఏ చట్టం ఏ బిల్లు అవసరం లేదని ఆయన వెల్లడించారు.మొత్తానికి సోమవారం రోజు మండలి భవిష్యత్తు పై ఏదో ఒకటి తేల్చాలని  సీఎం జగన్ గట్టి నిర్ణయం తీసుకున్నారు, ఈ విషయంలో జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది.

అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని తేల్చిన డాక్టర్ల...

దిశా ఘటన జరిగి పూర్తిగా మరవక ముందే కనీసం ఎక్కడో ఒక్క చోట అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.కేవలం ప్రజల్లో మార్పు మాత్రమే ఇలాంటి ఘటనలను అంతం చేయగలదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు రెండేళ్ల క్రితం వాణినగర్ కు వచ్చి నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో పనికి కుదిరారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మమ్మ వద్ద ఉంటున్న వీరు కుమార్తె పది రోజుల క్రితం వాణినగర్ కు వచ్చింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి సమీపంలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆమెను ఓ యువకుడు బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్యంగా ఉండే చక్రపురి అనే ప్రాంతానికి తీసుకెళ్లగా, కొద్దిసేపటికీ కార్లో మరో ముగ్గురు యువకుల చేరుకున్నారు ఆమె నుంచి సెల్ ఫోన్ లాక్కుని దూరంగా విసిరేసి నిర్బంధించి అత్యాచారానికి ప్రయత్నించగా అంతలో ఆ వైపు మరో కారు రావడాన్ని చూసి యువకులు పారిపోయినట్లు సమాచారం. తన సెల్ ఫోన్ నుంచి బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన ధారుణం గురించి చెప్పింది. మొదట తన పై నలుగురు యువకు లు అత్యాచారం చేశారంటూ పోలీసులకు బాలిక తెలిపింది. ఆమెను వైద్యపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పై అత్యాచారం జరగలేదని వైద్యులు తేల్చారు. బాలికను మరోసారి ప్రశ్నించగా మాట మార్చింది. తన పై గుర్తు తెలియని నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారని ఆ వైపు రావడంతో వదిలేసి పారిపోయారు అని తెలిపింది. ఈ ఘటన పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.నిందితులను పట్టుకునేందు కు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాలనీలో గురువారం విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిసి కెమెరాలు పని చేయలేదు కావున ఇళ్ళ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాను విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు.

సర్వత్ర ఉత్కంఠంగా మారిన కోర్టు తీర్పు... జగన్‌కు కోర్టు ఊరటనివ్వనుందా...

జగన్ అక్రమాస్తుల కేసులో నేడు కీలక పరిణామం ఎదురుకాబోతోంది. ఈడీ కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 10న వాదనలు పూర్తయ్యాయి.దీనికి సంబంధించిన తీర్పును ఇవాళ వెలువరించనున్న సందర్భంగా తీర్పు ఎలా ఉండబోతోందన్న అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్ కు కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తుందా లేక హాజరు కావాలని చెబుతుందా అన్న దానిపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈడీ కేసు, సిబిఐ కేసులు రెండూ కలిపి ఒకే సారి విచారించాలన్న జగన్ పిటిషన్ ను కొట్టివేసిన సందర్భంగా నేటి తీర్పు పై అందరిలో ఉత్కంత్ఠ నెలకొంది.ఈ నెల 3న తన అక్రమాస్తుల కేసులో ఆప్షన్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా సిబిఐ కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతేడాది మార్చి నుంచి ఒక్కసారి కూడా జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసు దర్యాప్తులో పురోగతి ఎలా వుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.తదుపరి వాయిదాకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముఖ్య మంత్రి హోదాలో జగన్ ఈ నెల 10న తన అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జగన్ కోర్ట్ హాల్ లో ఉన్నారు. అనంతరం తన బదులు సహనిందితులు హాజరవుతారని పిటిషన్ దాఖలు చేశారు.తన హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మరో రెండు పిటిషన్ లు దాఖలు చేయగా అన్ని చార్జీ లు కలిపి విచారించడం ఒకటైతే, ఈడీ, సీబీఐ కేసులు రెండూ కలిపి ఒకే సారి విచారించటం మరొకటిగా ఉంది. ఈ రెండు పిటిషన్ లను కోర్టు గత వారమే కొట్టేసింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఈ నెల 10న దాఖలు చేసిన పిటిషన్ పై  తీర్పు రానుంది. ఒకవేళ కోర్టు తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వస్తే ముఖ్య మంత్రి హోదా లో ఈడీ కేసులోనూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. జగన్ కు కోర్టు ఈడీ కేసులో ఐనా కొంత మేరా మినహాయింపు కలిగిస్తుందో లేదో వేచి చూడాలి.

వచ్చే ఏడాది ఆర్ధిక బడ్జెట్ అయినా తెలంగాణ ప్రభుత్వం చేరుకోగలదా...

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ ఏడాది కూడా సవరించిన అంచనాలను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కారణంగా మొదట ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం కారణంగా 1,46,000 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రకటించారు. ఇది అంతకుముందు ఏడాది అంచనాల కంటే 35000 కోట్లు తక్కువే. అయితే, సవరించిన అంచనాలను కూడా ఇప్పుడు చేరుకోలేని పరిస్థితి ఉన్నట్లు సమాచారం.సవరించిన అంచనాలలో 10,000 కోట్లను భూముల అమ్మకం సమకూర్చుకుంటామని తెలిపారు. కానీ సాంకేతిక కారణాలతో ఒక్క ఎకరం భూమి కూడా అమ్మలేకపోయారు. దీంతో అంచనాలు చేరుకోవడం కష్టమేనని అంటున్నారు.భూముల అమ్మకం కాకుండా ఇతర ఆదాయ మార్గాల లోనూ కోత పెడుతోంది. జీఎస్టీ తో వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది మద్యం షాపుల దరఖాస్తుల వేలం ద్వారా సుమారు 10,000 కోట్ల సమకూరాయి.  మద్యం ధరల పెంపకం మద్యం షాపుల టెండర్ల వల్ల కూడా ఆదాయం ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. రవాణా రిజిస్ర్టేషన్ల శాఖ ఆదాయం కూడా లాభసాటి గానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయన జీఎస్టీ భారీగా పడిపోవటం వల్ల అంచనాలను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు.ఫిబ్రవరి 3డవ వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సారైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ అంచనాల్లో రూపొందించాలని భావిస్తున్నారు. అన్ని శాఖల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ చేరాయి. దీని పై మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్ బడ్జెట్ రూపకల్పనపై సమీక్ష చేసే అవకాశముంది.ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో గత ఏడాది అంచనాలూ చేరుకోలేకపోయారు దీంతో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు పంపాల ని సూచించినట్టు తెలిసింది ఆర్థిక మాంద్యం ప్రభావం కొత్త ఆర్థిక సంవత్సరం లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గత ఏడాది కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.2020-2021 బడ్జెట్ లో పన్నుల మోత పడే అవకాశముంది. పన్నులు పెంచి ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడ్డ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచారు. అన్ని రకాల ఎన్నికలు ముగిసినందున అవకాశం ఉన్న చోట అల్లా పన్నుల బాదే అవకాశముంది. భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ర్టేషన్ల ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. విద్యుత్ చార్జీలు కూడా పెంచి ఆ శాఖకు అందించే సహాయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఎంత మేరా తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక బడ్జట్ ను చేరుకోగలుగుతుందో వేచి చూడాలి.

మండలి రద్దు ఆలోచనపై మేధావులు ఏమంటున్నారు?

శాసనసభలో జగన్ ప్రకటన తర్వాత నిజంగానే మండలిని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే లాభనష్టాలేంటి? రద్దుకు ఎంత టైమ్ పడుతుంది? ప్రక్రియ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, మేధావులు మాత్రం మండలి రద్దు దిశగా ఆలోచన చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇంట్లో ఏదైనా పాడైతే... బాగు చేసుకోవాలే తప్ప... మొత్తం ఇల్లే తగలబెట్టుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. చీమలు పడితే... చీమల్ని తీసేయాలి కానీ... మొత్తం బెల్లాన్నే పడేస్తామంటే ఎలా అంటున్నారు. మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ముగిసేపోయే సమస్యకు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటున్నారు. మండలిలో విపక్షానికి బలముంటే... కేవలం మూడు నెలలు మాత్రమే ఆపగలరని, కానీ, పూర్తిగా అడ్డుకోలేరని గుర్తుచేస్తున్నారు. మరి, ఇంత చిన్నదానికి, మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయడం సరికాదని చెబుతున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా తొందరపాటు చర్యే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మండలి ఉండాలా? వద్దా? అవసరమా? కాదో? చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అంటున్నారని, అయితే... ప్రభుత్వాధినేతగా కౌన్సిల్ ను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే... వైసీపీలో అడ్డుచెప్పగలవారు ఎవరున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కేవలం, మూడు నాలుగు నెలలు ఆగితే సమస్య పరిష్కారమవుతుందని... మండలిలో విపక్షానికున్న బలంతో బిల్లులు ఆలస్యమవుతాయో గానీ ఆపలేరని గుర్తుచేస్తున్నారు. అయినా, ఓ మూడు నెలలు ఆలస్యమైతే ఏమవుతుందని అంటున్నారు. ఒకవేళ మండలి రద్దుకు నిర్ణయం తీసుకుంటే... ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది లేదా ఏడాదిన్నర పట్టొచ్చని.... ఒక్కోసారి పార్లమెంట్లో ఆమోదం పొందకపోవచ్చని గుర్తుచేస్తున్నారు. అయినా, ఒక్క ఏడాది లేదా ఏడాదిన్నర ఓపిక పడితే... మండలిలో కూడా వైసీపీకి మెజారిటీ వస్తుందని, అలాంటప్పుడు రద్దు దిశగా అడుగులు వేయడం ఎందుకంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు పోతే మాత్రం మండలి రద్దు జరగడం ఖాయమంటున్నారు మేధావులు. మండలిలో పరిణామాలను తనను తీవ్రంగా బాధించాయని జగన్ వ్యాఖ్యానించడంతో రద్దు దిశగా వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.... తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో ఉంటే మాత్రం మండలి రద్దు తప్పదు. అయితే, సోమవారానికి ఇంకా మూడు రోజులు సమయం ఉండటంతో ఈలోపు టీడీపీ ఎమ్మెల్సీలతో ఏమైనా లాబీయింగ్ జరుగుతుందేమోనన్న మాట కూడా వినిపిస్తోంది.

మండలిని రద్దుచేస్తే తొందరపాటు చర్యే... చీమలు పట్టాయని మొత్తం బెల్లాన్నే పడేస్తారా? 

మూడు రాజధానుల బిల్లు, అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ కౌన్సిల్ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా మండలి రద్దు దిశగా జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కౌన్సిల్ ఛైర్మన్ నిర్ణయంపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం... అసలు మండలిని కొనసాగిచాలో వద్దో సోమవారం నిర్ణయం తీసుకుందామంటూ సీఎం జగన్ ప్రకటించారు. మండలిలో పరిణామాలు తన మనసును తీవ్రంగా గాయపరిచాయన్న జగన్మోహన్ రెడ్డి... బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్న కౌన్సిల్ ను కొనసాగించాలో వద్దో శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారని, కానీ డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు శాసనసభలో ఉండగా, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారని అన్నారు. ఇంతమంది విజ్ఞులు శాసనసభలోనే ఉండగా, ఇక మండలి అవసరమేముందని జగన్ ప్రశ్నించారు. మండలి కోసం ఏటా 60కోట్లు ఖర్చు పెడుతున్నామని.... అయితే, ఆర్ధిక లోటుతో నడుస్తున్న రాష్ట్రంలో కౌన్సిల్ అవసరమా? అనేది సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. హత్య చేయడం తప్పు... అయినా చేస్తామన్నట్టుగా మండలి తీరు ఉందన్న జగన్... అయితే, ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాంటూ జగన్ ప్రశ్నించారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్న జగన్మోహన్ రెడ్డి.... మండలి ప్రజల కోసం నడుస్తోందా... రాజకీయ నిరుద్యోగుల కోసం నడుస్తోందా అన్నది ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన తర్వాత నిజంగానే మండలిని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే లాభనష్టాలేంటి? ఎవరికి ఎక్కువ నష్టం? రద్దుకు ఎంత టైమ్ పడుతుంది? ప్రక్రియ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఇంట్లో ఏదైనా పాడైతే... బాగు చేసుకోవాలే తప్ప... మొత్తం ఇల్లే తగలబెట్టుకుంటారా? అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. చీమలు పడితే... చీమలను తీసేయాలి కానీ... మొత్తం బెల్లాన్నే పడేస్తామంటే ఎలా అంటున్నారు. మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ముగిసేపోయే సమస్యకు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటున్నారు. మండలిలో విపక్షానికి బలముంటే... కేవలం మూడు నెలలు మాత్రమే ఆపగలరని, దాంతో కొంచెం ఆలస్యం అవుతుందే కానీ, పూర్తి ఆపలేరని, ఇంత దానికి, మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయడం సరికాదని చెబుతున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా తొందరపాటు చర్యే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

నా మనసు గాయపడింది... మండలిలో పరిణామాలపై జగన్ ఆవేదన...

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రభుత్వం రగిలిపోతోంది. కౌన్సిల్ ఛైర్మన్ నిర్ణయంపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం... అసలు మండలిని కొనసాగిచాలో వద్దో సోమవారం నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మండలిలో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్న ముఖ్యమంత్రి జగన్... రాజకీయ అజెండాతో నడుస్తూ... ప్రజలకు మేలుచేసే విధంగాలేని కౌన్సిల్ ను కొనసాగించాలా లేదా అన్న దానిపై సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే... మండలిలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ అజెండాతో అడ్డుకుంటోందని మండిపడ్డారు. శాసనమండలి కేవలం సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే ఏర్పడిందన్న జగన్మోహన్ రెడ్డి... చట్టాలు చేయడానికే శాసనసభ ఉందని గుర్తుచేశారు. ప్రజల చేత, ప్రజల వల్లే తమ ప్రభుత్వం ఏర్పడిందని... మొత్తం 175 స్థానాలకు గాను 86శాతం మెజారిటీతో 151 సీట్లను తమకు కట్టబెట్టి శాసనసభకు పంపారని, తాము కూడా ఏడున్నర నెలలుగా ప్రజాసంక్షేమం కోసం సేవ చేస్తూ వస్తున్నామని, అయితే... తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు మండలిని రాజకీయంగా టీడీపీ వాడుకుంటోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. చట్ట సభల్లో భాగమైన మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, కానీ కౌన్సిల్ ఛైర్మన్ దానిని వమ్ము చేశారని అన్నారు. నిష్పాక్షికంగా మండలిని నిర్వహించి పరిస్థితి కనిపించలేదన్నారు. గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు... అదీకాకపోతే సవరణలు కోరుతూ తిప్పిపంపవచ్చు. చట్టం కూడా ఇదే చెబుతోంది... కానీ వాటిని లెక్కచేయకుండా విచక్షణ అధికారమంటూ కౌన్సిల్‌ చైర్మన్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ నిర్ణయం తీసుకుని.. ప్రజాస్వామ్యానికి విలువ కూడా లేకుండా చేశారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మండలిలో ఛైర్మన్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం జగన్... నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చెప్పారని... అలాగే, బిల్లు పెట్టిన 12గంటల్లోపే సవరణలు ఇవ్వాలని, అదేవిధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే... బిల్లు పెట్టినప్పుడే ప్రతిపాదనలు చేయాలని కూడా ఛైర్మన్‌ చెప్పారని, కానీ... మళ్లీ ఆయనే రూల్స్‌ను అతిక్రమించి బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించారని జగన్ మండిపడ్డారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపకూడదనే మంత్రుల వాదనతో బీజేపీ, పీడీఎఫ్‌, వామపక్ష సభ్యులు ఏకీభవించినా.... సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం ఛైర్మన్ కు లేకున్నా... తనుకున్న విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకున్నానంటూ ఛైర్మన్‌ చెప్పడం దారుణమన్నారు. చట్టాన్ని ఉల్లఘించేందుకే విచక్షణ అధికారాన్ని వాడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అంటూ ప్రశ్నించారు. హత్య చేయడం తప్పు... అయినా నేను చేస్తా అన్నట్టుగా మండలి తీరు ఉందని జగన్ అన్నారు. అయితే, ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాంటూ జగన్ ప్రశ్నించారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్న జగన్మోహన్ రెడ్డి.... మండలి ప్రజల కోసం నడుస్తోందా... రాజకీయ నిరుద్యోగల కోసం నడుస్తోందా అన్నది ఆలోచన చేయాలన్నారు. మండలి కోసం ఏటా 60కోట్లు ఖర్చు పెడుతున్నాము... అయితే, ఆర్ధిక లోటుతో నడుస్తున్న రాష్ట్రంలో శాసనమండలి అవసరమా? అనేది కూడా ఆలోచన చేయాలన్నారు.  మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ అక్కడ సలహాలు, సూచనలు పక్కనబెట్టి ప్రజలకు మేలు జరిగే బిల్లులను ఎలా ఆలస్యం చేయాలో ఆలోచిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని అనుకున్నానని... కానీ, తన నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని వ్యాఖ్యానించారు. మరి, ఇలాంటి మండలిని కొనసాంగించాలా? వద్దా? అనేదానిపై సీరియస్‌గా చర్చ జరగాలన్నారు జగన్.  మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారన్న జగన్మోహన్ రెడ్డి... డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు అసెంబ్లీలో ఉన్నారని, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారని అన్నారు. ఇంత మంది విజ్ఞులు అసెంబ్లీలోనే ఉంటే, మండలి అవసరమేముందని జగన్ ప్రశ్నించారు. మండలిలో పరిణామాలు తన మనసును గాయపరిచాయన్న జగన్మోహన్ రెడ్డి... బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్న కౌన్సిల్ ను కొనసాగించాలో వద్దో సోమవారం శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదం లేదని... రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా పాలన సాగించవచ్చన్నారు జగన్. అలాగే, ఆర్టికల్‌ 174 ప్రకారం ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేయొచ్చన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ్నుంచే ప్రభుత్వం నడుస్తుందన్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని పెట్టొచ్చని, ఆ అధికారాన్ని ప్రజలే ప్రభుత్వానికి ఇచ్చారని జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ మంత్రుల ఫోటోల లీక్.. ఇలా దౌర్జన్యం చేయడం కోసమే లైవ్ ఆపేశారా?

శాసన మండలిలో వైసీపీ సభ్యులు, మంత్రులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలి చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేస్తున్న మంత్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మంత్రుల తీరుపై నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఫోటోలలో మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ తదితరులు.. చైర్మన్ పోడియం ముందు కుర్చీలు, బల్లలపై నిల్చొని.. వేళ్లు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా ఉన్నాయి. దీంతో ఇలా మండలి చైర్మన్ ని బెదిరించి దౌర్జన్యం చేయడం కోసమే.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారా? అంటూ అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు అయ్యుండి ఇలా కుర్చీలు, బల్లలు ఎక్కి బెదిరింపులకు పాల్పడటం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.