చంద్రబాబుకి 3 ఆప్షన్లు... జగన్‌కు ఒక్కటే మార్గం...
posted on Jan 21, 2020 @ 10:48AM
అనుకున్నట్లే మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే శాసనసభలో జగన్ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే, మండలిలో కూడా బిల్లు ఆమోదం పొందితేనే మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కానీ, మండలిలో పరిస్థితి రివర్స్ లో ఉంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీదే ఫుల్ మెజారిటీ. దాంతో, మండలిలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం ప్రశ్నార్ధకంగా మారింది. దాంతో, మండలిలో బిల్లును ఎలా ఆమోదించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఒకవేళ మండలి కనుగ బిల్లును ఆమోదించకపోతే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ రెండు మూడు నెలలు ఆగిపోవడం ఖాయం. అయితే, మండలిలో బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ముందు పలు ఆప్షన్లు ఉండగా, జగన్ ప్రభుత్వానికి మాత్రం ఒక్కటే మార్గం కనిపిస్తోంది.
సాధారణంగా ఏ బిల్లునైనా మొదట శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాక శాసనమండలికి పంపిస్తారు. అక్కడ ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండా ఆమోదిస్తే... ఆ బిల్లును నేరుగా గవర్నర్ కు పంపిస్తారు... ఆ తర్వాత గవర్నర్ ఆమోదం లభిస్తే... ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఒకవేళ మండలిలో బిల్లును తిరస్కరించినా లేక ప్రవేశపెట్టాక మూడు నెలల్లో ఆమోదం లభించకపోయినా... సవరణలతో బిల్లును ఆమోదించినా... అది మళ్లీ శాసనసభ ముందుకు వస్తుంది. ఇలా మండలి నుంచి శాసనసభకు తిరిగొచ్చిన బిల్లును సవరణ చేసైనా చేయకుండానైనా తిరిగి ఆమోదించి మళ్లీ శాసనమండలికి పంపుతారు. మండలి నుంచి నెలరోజుల్లోపు తిరిగిరాకపోతే... బిల్లు ఆమోదం పొందినట్లే పరిగణించి గవర్నర్ సమ్మతి కోసం పంపిస్తారు. అయితే, మూడు రాజధానుల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం... ఈ బిల్లును తిరస్కరించి పంపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలా కాకుండా సెలెక్ట్ కమిటీకి పంపిస్తే మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుంది.
అయితే, మండలిలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానిదే పైచేయిగా ఉన్నప్పటికీ, ఎలాగైనాసరే మూడు రాజధానుల బిల్లును ఆమోదింపచేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా మంత్రులంతా మండలికి వెళ్లి మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్నారు. ఇవేమీ వర్కవుట్ కాకపోతే చివరి అస్త్రంగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్డినెన్స్ తెచ్చినా దానికి ఆరు నెలలు మాత్రమే వాల్యూ ఉండటంతో... ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జనలు పడుతోంది. మరి, మండలిలో ఏం జరుగుతుందో చూడాలి.